Panchumarthi Anuradha: కల్తీ మద్యానికి మూల విరాట్ జగనే
ABN , Publish Date - Oct 07 , 2025 | 05:42 AM
వైసీపీ హయాంలో కల్తీ లిక్కర్ మాఫియాకు మూల విరాట్‌గా ఉన్న జగన్ రూ.3,500 కోట్లు కొల్లగొట్టారని మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విమర్శించారు.
ఎన్నికలకు ముందు టీడీపీలోకి వైసీపీ కోవర్టులు: పంచుమర్తి
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో కల్తీ లిక్కర్ మాఫియాకు మూల విరాట్‌గా ఉన్న జగన్ రూ.3,500 కోట్లు కొల్లగొట్టారని మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘కల్తీ మద్యం విషయంలో సీఎం చాలా కఠినంగా ఉన్నారు. కేవలం ఆరోపణలు వచ్చినందుకే ఇద్దరు పార్టీ నాయకులను సస్పెండ్ చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అధికారికంగానే కల్తీ మద్యం వ్యాపారం జరిగింది. ఆ పార్టీ నేతలు విచ్చలవిడిగా కల్తీ మద్యం వ్యాపారాలు చేశారు. చాలా మంది జైలు పాలయ్యారు. వారిలో ఎంత మందిని జగన్ సస్పెండ్ చేశారు? కల్తీ మద్యం కేసులో జైలుకు వెళ్లిన వారిని స్వాతంత్ర సమరయోధుల్లా భావించి పరామర్శించిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి నేడు ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కొందరు వైసీపీ కోవర్టులు టీడీపీలో చేరారు. వారివల్లే పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. జే బ్రాండ్ల మద్యంలో విష పూరిత పదార్థాలు ఉన్నట్టు చెన్నై, బెంగళూరుతోపాటు అమెరికాలోని ప్రముఖ ల్యాబ్‌లు నిర్ధారించాయి. అయినా వైసీపీ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదు?’ అని పంచుమర్తి ప్రశ్నించారు.