Raghurama Krishna Raju: జగనే నా టార్గెట్
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:38 AM
వైఎస్ జగన్మోహన్ రెడ్డే నా టార్గెట్, నాకు ఎవరి మద్దతు అవసరం లేదు. ఒంటరి పోరాటమే నాకు ఇష్టం అని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రామకృష్ణరాజు అన్నారు.
నేను బరిలో పందెం కోడిలాంటివాడిని
చావుకు తెగించి ఒంటరి పోరాటం చేశా
ఎవరి మద్దతు అవసరం లేదు: రఘురామ
కాళ్ళ, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డే నా టార్గెట్, నాకు ఎవరి మద్దతు అవసరం లేదు. ఒంటరి పోరాటమే నాకు ఇష్టం’ అని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను నిర్మించిన 180 మెగావాట్ ప్రాజెక్టు విలువ రూ.2వేల కోట్లు ఉంటుందని చెప్పారు. దేశంలోనే ఇంత తక్కువ ఖరీదైన ప్రాజెక్టును ఇప్పటి వరకు ఎవరూ నిర్మించలేదని తెలిపారు. జగన్ మీడియా తనపై అబద్ధపు రాతలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు నాపై కావాలని పెట్టించిన 3 కేసుల ద్వారా నన్ను 420గా చిత్రీకరించి నీ పత్రికలో రాయిస్తున్నావు. డిప్యూటీ స్పీకర్ పదవిని బర్తరఫ్ చేయాలని నీ వాళ్లతో మాట్లాడిస్తున్నావు’ అంటూ జగన్‌పై మండిపడ్డారు. 11 కేసుల్లో 420గా ఉన్న నువ్వు సీఎంగా పని చేయలేదా అని నిలదీశారు. పోరాటం తనకు కొత్తేమీ కాదన్నారు. తాను బరిలో పందెంకోడి లాంటివాడినని, చావుకు తెగించి జగన్‌తో పోరాడానని పేర్కొన్నారు. త్వరలోనే నిర్దోషిగా తిరిగి వస్తానని చెప్పారు. జగన్‌కు ఒక మతం సపోర్టుగా ఉండొచ్చని, తనకు సమాజంలో ఎంతోమంది మద్దతుగా ఉన్నారని తెలిపారు. తింగరి రాతలతో తన అభిమానుల మనోభావాలు దెబ్బతీయలేరని, జగన్ తనను చంపాలని చూసినా భయపడలేదని, ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని రఘురామ స్పష్టం చేశారు. జగన్‌పై ఒంటరిగా పోరాటం ప్రారంభించినప్పుడు తనవెనుక ఎవరూ లేరన్నారు. రెండేళ్లు ఒంటరి పోరాటం చేశానని, ఇప్పుడు తనకు ఎవ్వరి సహకారం అక్కర్లేదని చెప్పారు.
తాను పెట్టిన కేసు విచారణ త్వరగా పూర్తిచేస్తే సంతోషిస్తానని, ప్రభుత్వం ఈ విషయంలో సహకరిస్తుందని భావిస్తున్నానని అన్నారు. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఉండి నియోజకవర్గంలో అందరికీ తాగు, సాగునీరు అందిస్తానని ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కాలువ గట్లపై ఉన్న కట్టడాలను తొలగించామని తెలిపారు. దీనికి చర్చిలను మాత్రమే తొలగిస్తున్నారని కొంతమంది సామాజిక మాధ్యమాల ద్వారా అల్లరి చేయడంలో వైసీపీ అధినేత పాత్ర ఉందని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వార్తలు రాయించడం మీ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తన పోరాటంలో నిజాయితీ ఉందని, తాను ఏ తప్పు చేయలేదని రఘురామ స్పష్టం చేశారు.