Share News

High Court: జగన్‌ ప్రతిపక్ష పిటిషన్‌పై కౌంటర్‌ వేయండి

ABN , Publish Date - Sep 25 , 2025 | 04:59 AM

శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇచ్చిన రూలింగ్‌ను రద్దు చేయాలని...

High Court: జగన్‌ ప్రతిపక్ష పిటిషన్‌పై కౌంటర్‌ వేయండి

  • అసెంబ్లీ, స్పీకర్‌ కార్యదర్శులకు హైకోర్టు నోటీసులు

  • న్యాయశాఖ ముఖ్య కార్యదర్శికి కూడా

  • విచారణ మూడు వారాలకు వాయిదా

అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇచ్చిన రూలింగ్‌ను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులుగా ఉన్న శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, స్పీకర్‌ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌కు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా తనను గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించడంతో పాటు దానిని రద్దు చేయాలని.. ఈ రూలింగ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేమెంట్‌ ఆఫ్‌ శాలరీస్‌ అండ్‌ పెన్షన్స్‌ అండ్‌ రిమూవల్‌ ఆఫ్‌ డిస్‌క్వాలిఫికేషన్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 12బీకి విరుద్ధమని ప్రకటించాలని.. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా శాసన వ్యవహారాల కార్యదర్శి, స్పీకర్‌ కార్యదర్శిని ఆదేశించాలని జగన్‌ తన పిటిషన్‌లో కోరారు.

Updated Date - Sep 25 , 2025 | 05:00 AM