Share News

Water Resource Management: జగన్‌ దెబ్బకు..నీటి లెక్కలు హుష్‌కాకి

ABN , Publish Date - Oct 18 , 2025 | 06:43 AM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి దెబ్బకు రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్నతరహా నీటి వనరులు, చెరువులు, భూగర్భజలాల లెక్కల...

Water Resource Management: జగన్‌ దెబ్బకు..నీటి లెక్కలు హుష్‌కాకి

  • 2022లో ముగిసిన నీటి గణాంకాల సేకరణ కాంట్రాక్టు

  • దానిని పొడిగించలేదు.. కొత్త టెండర్లు పిలవలేదు

  • తప్పులతడకలుగా భూగర్భ జలాల లెక్కలు

  • నిర్వహణ నుంచి వైదొలగిన ప్రణాళికా శాఖ

  • దీంతో జలవనరుల శాఖకు ఇటీవల బాధ్యత

  • ఆటోమేటిక్‌ పరికరాల కొనుగోలుకు టెండర్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి దెబ్బకు రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్నతరహా నీటి వనరులు, చెరువులు, భూగర్భజలాల లెక్కలన్నీ ‘హుష్‌కాకి’లా ఎగిరిపోయాయని జల వనరుల నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలోని జల వనరులన్నింటిలోనూ నీటి నిల్వలను లెక్కించే పరికరాలను ఏర్పాటు చేశారు. సహజంగా ఈ లెక్కలను జల వనరుల శాఖ తీస్తుందని అందరూ భావిస్తారు. కానీ జిల్లాల్లో వర్షపాతం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వల లెక్కలను ప్రణాళికా విభాగం రోజువారీ సేకరిస్తుంది. దీనిని ప్రణాళికా శాఖ పరిధిలోని రాష్ట్రాభివృద్ధి సంస్థకు పంపుతారు. 2015లో రాష్ట్రంలోని జల వనరుల్లో నీటి నిల్వలు, యాజమాన్య విధానాల అమలుపై ప్రణాళికా శాఖ ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో 1,710 చోట్ల భూగర్భజలాల నిల్వలను తెలుసుకునేందుకు ఫిజియోమీటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 1,325 చోట్ల బిగించింది. అదేవిధంగా 108 చిన్న మధ్యతరహా జలాశయాల్లో 76 చోట్ల వాటర్‌ గేజ్‌లను ఏర్పాటు చేశారు. ఇవన్నీ 2019దాకా బాగానే పనిచేశాయి. జలాలపై ఎప్పటికప్పుడు గణాంకాలు అందించేవి. కానీ 2019లో వచ్చిన జగన్‌ ప్రభుత్వం నీటి లెక్కల సంగతి పక్కన పడేసింది. నీటి లెక్కల గణాంకాలను లెక్కించే బాధ్యత చేపట్టిన కాంట్రాక్టు సంస్థకు చెల్లింపులనూ నిలిపివేసింది. 2022లో ఈ కాంట్రాక్టు గడువు ముగిసింది. సదరు సంస్థ కాలపరిమితినీ పొడిగించలేదు. కొత్తగా టెండర్లనూ పిలవలేదు.


దీంతో.. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు మొదలుకొని భూగర్భజలాల నిల్వల దాకా రోజువారీ సమాచారం సేకరించడం నిలిచిపోయింది. 431 చోట్ల ఆటోమేటిక్‌ గ్రౌండ్‌ వాటర్‌ లెవల్‌ గణాంకాలను తీయాల్సి ఉన్నా.. మాన్యువల్‌గా సేకరిస్తున్నారు. రాష్ట్రంలో నీటి లెక్కలను సాంకేతికంగా తీసేందుకు అవసరమైన వ్యవప్థ 2022లోనే ఆగిపోవడం.. జగన్‌ ప్రభుత్వం దానిని నిర్లక్ష్యం చేయడంతో.. జలాశయాలకు వచ్చే వరద.. భూగర్భంలో ఉంటే జలాల లెక్కలన్నీ ఊహాతీతంగా మారిపోయాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వరదలపై వాస్తవ నివేదికలు రావడంలేదని అంటున్నారు. రాష్ట్రంలో నీటి లెక్కలను రియల్‌ టైమ్‌లో ఉంచాలంటూ రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ (ఆర్‌టీజీఎస్‌) సమీక్షల్లో జల వనరుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తున్నారు. అయితే.. జలాల గణాంక నిర్వహణ బాధ్యతలను ప్రణాళికా శాఖ చూస్తుండడం, జలాశయాల వద్ద ఫిజియోమీటర్లు, వాటర్‌ గేజ్‌లను కూడా అదే ఏర్పాటు చేయడంతో ఈ అంశంలో ఎలా తలదూర్చడమా అని జల వనరుల శాఖ తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే మెజారిటీ ఫిజియోమీటర్లు దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్తవాటిని బిగించాల్సి ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జలాశయాలన్నింటి వద్ద ఫిజియోమీటర్లు, భూగర్భజలాల నిల్వలను తెలుసుకునేందుకు ఆటోమేటిక్‌ గ్రౌండ్‌వాటర్‌ పరికరాలను కొనుగోలు చేసే బాధ్యతను కొనసాగించాలంటూ ప్రణాళికా శాఖను రియల్‌టైమ్‌ గవర్నెన్‌ విభాగం కోరింది. అయితే.. వ్యవస్థను నిర్వహించలేమని ప్రణాళికా శాఖ ఈ మధ్యే చేతులెత్తేసింది. దీంతో.. జలవనరుల శాఖే 1,810 చోట్ల భూగర్భజలాల లెక్కలను తెలుసుకునేందుకు ఆటోమేటిక్‌ పరికరాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. టెండర్లను కూడా పిలిచింది.

Updated Date - Oct 18 , 2025 | 06:45 AM