Political Publicity: జనం చెవిలో జగన్ బొకే
ABN , Publish Date - Dec 21 , 2025 | 05:05 AM
బెంగళూరుకు వెళ్తున్న మాజీ సీఎం జగన్‌కు విమానంలో బాలిక పుష్పగుచ్ఛం అందించేలా వేసిన ‘బర్త్‌డే’ సెట్టింగ్ బెడిచికొట్టింది.
విమానంలో పక్కాగా బర్త్‌డే ‘సెట్టింగ్’
బాలిక బొకే ఇచ్చినట్టు సినిమాటిక్ వీడియో
వైసీపీ సోషల్ మీడియా హడావుడి
కానీ, జగన్‌కు బిల్డప్ ఇవ్వబోయి బోల్తా కొట్టారంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
అమరావతి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): బెంగళూరుకు వెళ్తున్న మాజీ సీఎం జగన్‌కు విమానంలో బాలిక పుష్పగుచ్ఛం అందించేలా వేసిన ‘బర్త్‌డే’ సెట్టింగ్ బెడిచికొట్టింది. జగన్ ఎక్కడకు వెళ్లినా, ఆఖరికి విమానం ఎక్కినా అభిమానులు చుట్టుముడుతున్నారని జనం బుర్రల్లోకి ఎక్కించేందుకు వైసీపీ సోషల్‌మీడియా చేసిన వీడియో, చివరకు జనం పరిహాసానికి గురయింది. ఇలాంటి సినిమాటిక్ వీడియోలతో తమ కళ్లు కప్పలేరంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. శుక్రవారం ఎంపీ మిధున్‌రెడ్డితో కలసి జగన్ విమానంలో బెంగళూరుకు బయలుదేరారు. విమానంలోని తన సీటు వద్దకు చేరుకుంటున్న ఆయన వద్దకు ఒక బాలిక వచ్చింది. జగన్‌కు హ్యాపీ బర్త్‌డే చెప్పి, బొకే అందించగా, ఆయన ఆప్యాయంగా ఆ బాలికను పలకరించినట్టుగా ఉన్న ఓ వీడియోను వైసీపీ సోషల్ మీడియా ప్రచారంలో పెట్టింది. అయితే, వీడియోలో కనిపించిన బాలిక దుస్తులపై హ్యాపీ బర్త్‌డే జగన్ మామ అని రాసి ఉండటం, వానిపై ఆయన ఫొటో ఉండటం, జగన్ తన సీటు వద్దకు వచ్చేటప్పటికే బాలిక అక్కడ సిద్ధంగా ఉండటం వంటివి ఎవరినైనా సందేహానికి గురిచేస్తాయి. బస్సుల్లో, రైళ్లలో తిరగనిచ్చినట్టు స్వేచ్ఛగా విమానాల్లో తిరగనీయరు. నియంత్రణలు, కట్టుదిట్టాలు ఉంటాయి.
కానీ, జగన్ విమానంలోకి వచ్చినప్పటి నుంచీ వెనుకనుంచి.. ఎదురు నుంచి.. ఒక బృందం కదులుతుండటం ఆ వీడియోలో కనిపించింది. ఆ బృందమే వీడియో తీసింది. ఆయన విమానంలోకి వస్తూనే.. బాలిక ఆయన వద్దకు రావడాన్ని ఒక సినిమా తరహాలో చిత్రీకరించారు. ప్రయాణికులకు ప్రత్యేకించి ఆ బాలిక తల్లిదండ్రులకు జగన్ అదే విమానంలో వస్తున్నారని ఎలా తెలుసుననేది ఆ వీడియో చూసినవారికి కలిగిన మొదటి సందేహం. కొంచెం నిశితంగా గమనిస్తే బొకేతోపాటు కేక్ కూడా జగన్ సీటు పక్కన కనిపించింది. నిజానికి, విమానంలోకి వీటిని తీసుకురావడం సులువేమీ కాదు. సెక్యూరిటీ చెక్ గట్టిగా ఉంటుంది. అలాంటిది బొకే, కేక్ ఎలా విమానంలో వచ్చాయంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.