During Jagan Governance: జగన్ పాలనలో రైతు ఘోష
ABN , Publish Date - Oct 01 , 2025 | 03:46 AM
రైతు పక్షపాతిగా పదే పదే ప్రకటించుకునే వైసీపీ అధినేత జగన్ పాలనలో నెలకు 77మంది చొప్పున రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతులతో పాటు వ్యవసాయ కూలీలు...
నెలకు 77 మంది చొప్పున బలవన్మరణం
2023లో 925 మంది రైతులు, కూలీలు మృతి
దేశంలోనే మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్
శ్మశానాలుగా సాగు భూములు: ఎన్‌సీఆర్‌బీ
మహిళల ఆత్మగౌరవ భంగంలో దేశంలోనే తొలి స్థానం
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రైతు పక్షపాతిగా పదే పదే ప్రకటించుకునే వైసీపీ అధినేత జగన్ పాలనలో నెలకు 77మంది చొప్పున రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతులతో పాటు వ్యవసాయ కూలీలు, సొంత భూమి సాగు చేసిన రైతులు సైతం సాగు గిట్టుబాటుగాక బలవన్మరణాలకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా 2023లో ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంటే రెండో స్థానంలో కర్ణాటక, మూడోస్థానంలో ఆంధ్రప్రదేశ్(925 మంది) ఉన్నాయి. ఇది వైసీపీ ప్రభుత్వంలో రైతులకు లభించిన సహకారానికి నిదర్శనమని రైతు నాయకులు చెబుతున్నారు. కాగా, దేశంలో రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలోనే ఉన్న మన రాష్ట్రం 2020 నుంచి వరుసగా అదే స్థానాన్ని కొనసాగించింది. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, అప్పులు, వడ్డీలు, పురుగు మందుల ధరలు, ప్రకృతి వైపరీత్యాలు వంటివి అన్నదాతల ఉసురు తీశాయి. వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారిలో 828మంది పురుషులతో పాటు 97మంది మహిళలు సైతం బలవన్మరణాలకు పాల్పడ్డారు. రైతుల కన్నా వ్యవసాయ కూలీలు ఎక్కువగా ప్రాణాలు తీసుకోవడంతో సాగు భూమలు శ్మశానాలుగా మారినట్లు వివరించింది.
నేరాల్లోనూ రికార్డే!
మహిళల జోలికొస్తే 21 రోజుల్లోనే మరణ శిక్ష వేస్తామంటూ అసెంబ్లీలో ప్రకటించి చట్టం కూడా చేయలేక ‘దిశ’ యాప్‌తో సరిపుచ్చిన జగన్ పాలనలో మహిళలపై లైంగిక వేధింపులు, నేరాలు అధికమేనని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. దేశంలో 2023లో మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల్లో ఏపీ 7వ స్థానంలో ఉండగా, ఇతర నేరాల్లో(22,418 కేసులు) 9వ స్థానంలో నిలిచింది. వృద్ధులపై దాడులు, అఘాయిత్యాల్లో రోజుకు సరాసరి ఐదుకు పైగా కేసులతో ఏకంగా ఆరో స్థానం దక్కించుకుంది. అప్పట్లో రంగనాయకమ్మ, డాక్టర్ సుధాకర్ వంటి వారి పై జరిగిన దౌర్జన్యాల ఫలితమే రాష్ట్రాన్ని ఈ స్థానంలో నిలిపాయని తెలుస్తోం ది. ఎస్‌సీలపై 2027కేసులతో 7వ స్థానం, ఎస్టీలపై ఆ తర్వాతి స్థానంలో ఏపీ నిలిచింది. ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడంలో వైసీపీ పాలనలో(2023) ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 8,446 ఘటనలు జరగ్గా ఒక్క మన రాష్ట్రంలోనే 2,826 ఘటనలు జరిగాయని పేర్కొంది. దీంతో తొలిస్థానంలో రాష్ట్రం నిలిచిందని, రెండో స్థానంలో మహారాష్ట్ర ఉందని నివేదిక తెలిపింది.
సైబర్ నేరాల్లో టాప్ టెన్
2023లో రాష్ట్రంలో సైబర్ నేరాలు పెరిగాయి. 2,341 కేసులతో ఏపీ.. దేశంలోనే పదో స్థానంలో నిలిచింది. వీటిలో ఆర్థిక మోసాలు, ఓటీపీ ఫ్రాడ్స్ ఉన్నాయి. అయితే, హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, కిడ్నాప్‌లు, బాలలపై నేరాలు దేశవ్యాప్తంగా తగ్గినట్టే ఏపీలోనూ తగ్గాయని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది.