Share News

Financial Mismanagement: గురివింద జగన్‌

ABN , Publish Date - Oct 22 , 2025 | 04:10 AM

ఉద్యోగ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం సరికాదు. ఏ సమస్యనైనా కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి. అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పూ ఉండాలి...2022 నవంబరు 27న జగన్‌ క్యాబినెట్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలివి.

Financial Mismanagement: గురివింద జగన్‌

  • ఒక్క డీఏను కూడా సరిగ్గా ఇవ్వని ఘనుడు

  • ప్రభుత్వం ప్రకటించిన డీఏపై మాత్రం విమర్శలు

  • ఒక్క డీఏతో ఎలా బతుకుతారంటూ మొసలి కన్నీరు

  • ఐదేళ్లపాటు నాడు రాష్ట్ర ఉద్యోగులతో చెడుగుడు

  • ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తక్కువగా ఇచ్చిన ఏకైక సీఎం

  • డబ్బులివ్వలేక రిటైర్మెంట్‌ వయసునే పెంచిన వైనం

  • సీపీఎస్‌, జీపీఎఫ్‌ సొమ్మునూ దారిమళ్లించిన దుర్మార్గం

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

‘‘ఉద్యోగ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం సరికాదు. ఏ సమస్యనైనా కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి. అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పూ ఉండాలి’...2022 నవంబరు 27న జగన్‌ క్యాబినెట్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలివి. ఈ వ్యాఖ్యలను అప్పటి సీఎం జగన్‌ కనీసం ఖండించలేదు. పైగా తాను అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఉద్యోగులతో చెడుగుడు ఆడుకున్నారు. తన హయాంలో ఒక్క డీఏను కూడా సరిగ్గా ఇవ్వలేదుగానీ, చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఉద్యోగులకు ప్రకటించిన డీఏను విమర్శిస్తూ జగన్‌ గురువింద నీతులు సెలవిస్తున్నారు. ఒక్క డీఏతో ఎలా బతుకుతారంటూ ఉద్యోగులపై సానుభూతి కురిపిస్తున్నారు. కానీ, డీఏలు, పీఆర్సీ, మెడికల్‌ బిల్లులు, ఈఎల్స్‌, సీపీఎస్‌ కంట్రిబ్యూషన్‌ను నాడు ఎగ్గొట్టడం.. జీతాలు, పెన్షన్లు కూడా సరైన సమయానికి ఇవ్వకపోవడాన్ని ఉద్యోగులు అంత త్వరగా మరిచిపోలేరు. ఉద్యోగులకు రిటైర్మెంట్‌ ప్రయోజనాలు ఇవ్వడం ఇష్టం లేని జగన్‌ వారి పదవీవిరమణ వయసును 62 ఏళ్లకు పెంచి చేతులు దులుపుకున్నారు.


జీవోలకు పరిమితమైన ఉద్యోగుల లబ్ధి

2019 ఎన్నికలకు ముందు విపక్ష నేతగా ఉండగా ఉద్యోగులపై జగన్‌ ప్రేమను వొలకబోశారు. ముఖ్యమంత్రి అయ్యాక 2024 వరకు ఐదేళ్ల పాటు ఉద్యోగుల మొహాలు చూడడానికి కూడా ఇష్టపడలేదు. పైగా ఉద్యోగులను ఆనాడు కాల్చుకుతిన్నారు. ఒక డీఏ బకాయిని మూడు విడతల్లో ఇవ్వొచ్చంటూ జీవో ఇచ్చిన ఘనత జగన్‌దే. కొత్త పీఆర్సీ వేస్తూ జీవో అయితే ఇచ్చిన జగన్‌, పాత పీఆర్సీ బకాయిల లెక్క మాత్రం తేల్చలేదు. ఈ బకాయిలను 2024 నుంచి 2027 వరకు 16 విడతల్లో ఉద్యోగులకు చెల్లిస్తామంటూ అధికారికంగా ప్రకటించారు. రిటైర్మెంట్‌ తర్వాత ఇస్తామన్న డీఏ, పీఆర్సీ బకాయిలు రూ.7,500 కోట్లు ఉన్నాయి. వీటిని 2027లోగా చెల్లిస్తామని చెప్పారు. 2024 జనవరిలో 10శాతం, 2025లో 20 శాతం, 2026లో 30 శాతం, 2027లో 40 శాతం ఇస్తామన్నారు. అయితే, 2024 జనవరిలో ఇస్తామన్నవి కూడా జగన్‌ ఇవ్వలేదు.


ఆ బకాయు బిల్లులపై హడావుడి..చివరకు రద్దు

ఎప్పుడూ లేని విధంగా ఐఆర్‌ 27 శాతం కంటే 4 శాతం తగ్గించి 23శాతం ఫిట్‌మెంట్‌ను జగన్‌ ఇచ్చారు. హెచ్‌ఆర్‌ఏ తగ్గించారు. 11వ పీఆర్సీ సమయంలో మొదట హెచ్‌ఆర్‌ఏ, అదనపు క్వాంటమ్‌ పింఛనులో కోత విధించారు. ఆ తర్వాత హెచ్‌ఆర్‌ఏ పెంపు కాదు కదా, ఉన్నదాన్నే కొనసాగించాలంటూ ఉద్యోగులు కోరే స్థితికి జగన్‌ తీసుకురావడం గమనార్హం. 2018 జూలై నుంచి 2021 డిసెంబరు వరకు ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన డీఏ, 11వ పీఆర్సీ బకాయిలు జగన్‌ గద్దె దిగేనాటికి దాదాపు రూ.19వేల కోట్లు. ఆయన సీఎం అయిన కొత్తల్లో ఈ డీఏ బకాయిల బిల్లులను అత్యవసరంగా చెల్లించాల్సిన బిల్లులుండే గ్రీన్‌చానల్‌లో పెట్టారు. ఉద్యోగులంతా అప్పట్లో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తీరా ఆర్థిక సంవత్సరం చివరిరోజు మార్చి 31 వచ్చేసరికి వాటిని చెల్లించకుండా రద్దు చేసేశారు. ఇలా వరుసగా మూడేళ్లపాటు చేయడమే కాకుండా, 2024 జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు కూడా ఉద్యోగుల ఖాతాల్లో ఆ సొమ్ము జమ కాలేదు. 2022 జూలై, 2023 జనవరి డీఏలను ప్రభుత్వం దాదాపు ఏడాదిన్నర ఆలస్యంగా ప్రకటించింది. జగన్‌ హయాంలోనే ఈ 2 డీఏల బకాయిలు రూ.7,000 కోట్లకు పైనే.


ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ నొక్కేశారు

సీపీఎస్‌ ఉద్యోగులకు సంబంధించి ఒక ఏడాది కంట్రిబ్యూషన్‌ రూ.2,300 కోట్లు. ప్రభుత్వ వాటా కూడా ఏడాదికి రూ.2,300 కోట్లు. అయితే, జగన్‌ మాత్రం ఉద్యోగుల జీతాల నుంచి వారి కంట్రిబ్యూషన్‌ కట్‌ చేశారు కానీ, దానికి నాటి ప్రభుత్వం మ్యాచింగ్‌ కలిపి ఎన్‌ఎ్‌సడీఎల్‌కు (నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపోజిటరీ లిమిటెడ్‌) చెల్లించకపోగా, ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ను వాడుకుంది. జగన్‌ గద్దె దిగేనాటికి సీపీఎస్‌ కంట్రిబ్యూషన్‌ బకాయిలే రూ.3,800 కోట్ల వరకు ఉన్నాయి. మెడికల్‌ బిల్లులు, సరెండర్‌ లీవులు, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్లు, ఏపీజీఎల్‌ఐ, జీపీఎఫ్‌ ఇతర బిల్లుల రూపంలో ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం రూ.2,800 కోట్ల మేర నిలిపివేసింది. ఉద్యోగులు తమ జీతం నుంచి దాచుకున్న జీపీఎఫ్‌ సొమ్మును కూడా జగన్‌ ప్రభుత్వం వాడుకుంది.


ఉద్యోగుల ‘చలో’పై ఉక్కుపాదం

పోలీసు నిర్బంధాలను అధిగమించి 2022 ఫిబ్రవరి 3న ఉద్యోగులు వేలమంది తరలివచ్చి ‘చలో విజయవాడ’ నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం కాస్త దిగొచ్చి పీఆర్సీపై చర్చలు జరిపినా, ఉద్యోగులకు ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. ఆ తర్వాత ఉద్యోగసంఘాల్లో చీలిక తెచ్చి ఉద్యోగుల ప్రయోజనాలకు భారీగా గండికొట్టారు. జగన్‌ దిగిపోయేనాటికి రూ.513కోట్ల ఏపీజీఎల్‌ఐ బకాయిలు చెల్లించాలి. ఇందులో రూ.313 కోట్లే యాప్‌లో అప్‌లోడ్‌ అయ్యాయి. ఈ బిల్లులను అప్‌లోడ్‌ చేసే యాప్‌ను జగన్‌ ప్రభుత్వం ఆపేసింది. మరో 200 కోట్ల బిల్లులు అప్‌లోడ్‌ కాలేదు. సచివాలయంలో సీపీఎస్‌ ఉద్యోగులకు 60 నెలల డీఏ బకాయిలను కూటమి ప్రభుత్వం సెప్టెంబరులో చెల్లించింది.


రూ. వేల కోట్లలో బకాయిలు..

జగన్‌ దిగిపోయేనాటికి ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన వివిధ రకాల బకాయిలు రూ.25వేల కోట్ల బాకీ ఉందని అప్పటి ఆర్థిక శాఖ అధికారులు రాతపూర్వకంగా మంత్రుల కమిటీకి ఇచ్చారు. ఆ సమయంలో ఉద్యోగులు తమకు ప్రభుత్వం రూ.31,519 కోట్లు బాకీ అని లెక్కలేశారు. 2018 జూలై, 2019 జనవరి డీఏలకు సంబంధించి 66 నెలల బకాయిలను కొంతమంది ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. సాంకేతికంగా ఇచ్చినట్టు చూపించి ఉద్యోగుల నుంచి ఆదాయపన్ను మినహాయించిన ఘనత జగన్‌దే.

Updated Date - Oct 22 , 2025 | 04:15 AM