Misuse of Funds: జనం చెవిలో జగన్ పూలు
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:16 AM
ముప్పై ఏళ్లు అధికారంలో ఉంటానని కలలు కన్నారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటాడారు. విశాఖలో సముద్రానికి అభిముఖంగా రుషికొండకు గుండుకొట్టించి మరీ రూ.453 కోట్లతో రాజప్రసాదం నిర్మించుకున్నారు.
రుషికొండ ప్యాలెస్‌పై సూక్తి ముక్తావళి
ఆ భవనం పర్యాటకుల కోసమట.. పుతిన్ వంటివారు
బస చేయవచ్చునట.. నాడు సొంతానికి రాజప్రాసాదం నిర్మాణం
ఇప్పుడు మాట మార్చిన మాజీ సీఎం జగన్ రెడ్డి
453 కోట్లు పెట్టి 240 కోట్లతో రాజభవంతి అంటూ బుకాయింపు
విశాఖలో యోగాంధ్ర ఖర్చు రూ.60 కోట్లు
330 కోట్లు దుర్వినియోగమంటూ అసత్యాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ముప్పై ఏళ్లు అధికారంలో ఉంటానని కలలు కన్నారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటాడారు. విశాఖలో సముద్రానికి అభిముఖంగా రుషికొండకు గుండుకొట్టించి మరీ రూ.453 కోట్లతో రాజప్రసాదం నిర్మించుకున్నారు. అధికారం పోయేసరికి ఇప్పుడు తూచ్ అంటున్నారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన మాజీ సీఎం జగన్ మరోసారి జనం చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ, విదేశీ పర్యాటకుల కోసమే రుషికొండపై భవనాన్ని నిర్మించానని, రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి వారు బసచేయవచ్చునంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్యాలెస్ నిర్మాణానికి రూ.453 కోట్లు ఖర్చు చేయగా, కేవలం 240 కోట్లతోనే బ్రహ్మాండమైన రాజభవంతి కట్టానంటూ అబద్ధాలు వల్లె వేశారు. విజయవాడలో గురువారం లోక్‌భవన్ (గవర్నర్ బంగ్లా) ముందు విలేకరులతో మాట్లాడుతూ ‘రుషికొండ’కు కొత్తభాష్యం చెప్పారు.
ఇదీ వాస్తవం
రుషికొండపై ఏడాదికి రూ.7 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్స్ ఉండేది. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేసి, విశాఖలోనే నివాసం ఉంటూ పాలన సాగించాలని భావించిన జగన్ తన కుటుంబం కోసం ఈ రిసార్ట్స్‌ను కూలగొట్టించారు. కొండను 20 ఎకరాలకు పైగా తవ్వేసి అందులో 9.8 ఎకరాల విస్తీర్ణంలో ప్యాలె్‌సకు డిజైన్ రూపొందించారు. 2.8 ఎకరాల్లో మూడు భవనాలను జగన్ కుటుంబ సభ్యుల కోసం వేర్వేరుగా నిర్మించారు. మిగిలిన భవనాలన్నీ పెద్ద పెద్ద సమావేశ మందిరాలే. నాలుగు బ్లాకులకు రూ.453 కోట్లు ఖర్చు చేశారు. జీవీఎంసీ, హార్టికల్చర్, పర్యాటక శాఖ నిధులన్నీ మళ్లించారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి, నిర్మాణాలను చూసేందుకు ఎవర్నీ అనుమతించకుండా రహస్యంగా నిర్మించారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒక్కరోజు కూడా వాటికి జగన్ సమాధానం చెప్పలేదు. అప్పటి పర్యాటక మంత్రి రోజా, ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాత్రం ఆ భవనం పర్యాటకుల కోసమే నిర్మించామని, ప్రభుత్వ కమిటీ సూచన ప్రకారం సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకుంటామని ప్రారంభోత్సవం రోజు అక్కడే ప్రకటించారు. ఇవన్నీ దాచి తాను రూ.240 కోట్లతోనే పర్యాటకుల కోసం ఆ భవనం నిర్మించానని జగన్ ఇప్పుడు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో యోగాంధ్ర కోసం రూ.330 కోట్లు దుర్వినియోగం చేశారని జగన్ ఆరోపించారు. వాస్తవానికి యోగాంధ్ర కోసం మొత్తం చేసిన ఖర్చు రూ.60 కోట్లు. అందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21 కోట్లు పెట్టింది. కేంద్రం రూ.8 కోట్ల నిధులతో పాటు టీ షర్టులు, యోగా మ్యాట్లు పంపిణీ చేసింది. ఇంకా రూ.31 కోట్లు రావలసి ఉంది. వాస్తవం ఇది కాగా తాను నిర్మించిన భవనం వ్యయం కంటే చంద్రబాబు చేసిన ఖర్చే ఎక్కువని ప్రజలను నమ్మించేందుకు జగన్ ప్రయత్నం చేశారు.