Jagan: డేటాకు మైండ్ అప్లై చేస్తే.. ఏఐ
ABN , Publish Date - Oct 26 , 2025 | 06:21 AM
నాడు కోవిడ్ మహమ్మారి గురించి కానీ, నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ.. ఏ అంశమైనా సరే మాట్లాడటంలో మాజీ సీఎం జగన్ స్టైలే వేరు బహుశా ఆయన్ను మించినవారు లేకపోవచ్చు..
నాడు కరోనా.. నేడు ఏఐ గురించి జగన్ నోట ఆణిముత్యాలు
సోషల్ మీడియాలో మీమ్స్ హల్‌చల్
(అమరావవతి-ఆంధ్రజ్యోతి)
నాడు కోవిడ్ మహమ్మారి గురించి కానీ, నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ.. ఏ అంశమైనా సరే మాట్లాడటంలో మాజీ సీఎం జగన్ స్టైలే వేరు! బహుశా ఆయన్ను మించినవారు లేకపోవచ్చు! ఆయన నోట వచ్చే ఆణిముత్యాలు అలాంటివి మరి! పండితులను కూడా తికమక పెట్టేలా జగన్ చెప్పగలరు! అంతేకాదు.. సోషల్ మీడియాలో నెటిజెన్లకు టైమ్‌పాస్ అవుతున్నారు! తాజాగా జగన్ విశ్లేషణ మీమ్స్‌కు మేతగా మారింది. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. అనుకూల మీడియాతో ప్రెస్ కాన్ఫరెన్స్ పేరిట రెండు గంటలకు పైగా మాట్లాడారు. విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం తన చలవే అన్నట్టుగా చెప్పారు. తాను 2023లో అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన ఫలితమే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు కారణమైందన్నారు. అంతటితో ఆగకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మరపురాని మాటలు చెప్పారు. ‘గొప్ప మార్పుకైనా గాని, డేటా సెంటర్ అనేది డేటా ఉంటే, ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అని జగన్ సెలవిచ్చారు. జగన్ చెప్పినదానికి అర్థం ఏమిటో తెలియక ఐటీలో తలపండినవారు సైతం తికమకపడిపోతున్నారు. నాలుగేళ్లక్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనాగురించి కూడా జగన్ సింపుల్‌గా తనదైన స్టైల్లో చెప్పారు. ‘కరోనా గురించి భయపడాల్సిందేముంది.. పారాసిటమల్ వేసుకుంటే అదే పోతుంది. బ్లీచింగ్ పౌడర్ చెల్లితే వైరస్ నశిస్తుంది’ అని తేల్చేశారు.