Journalistic Rights: గతం గుర్తులేదా...
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:52 AM
మాజీ సీఎం జగన్ రూటే సపరేటు! ఆనాడు తాను పెట్టిన వేధింపులను రాజన్న రాజ్యం వరంలా జనం భరించాలట!. అదే తనకు బాధ కలిగితే ప్రపంచం అంతా కన్నీరు కార్చాలట!. జగన్ పార్టీ నేతలు...
నొప్పి తెలిస్తేనే హక్కులు గుర్తొస్తాయా?
కేసులు పడ్డాకే పత్రికాస్వేచ్ఛ అవసరమైందా?
మీ హయాంలో రాష్ట్రంలో సకలం బంద్
ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం..రాజద్రోహం
‘నచ్చని’ మీడియాపై లెక్కలేనన్ని కేసులు
‘ఆంధ్రజ్యోతి’పై ఐదేళ్లూ తీవ్ర వేధింపులే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మాజీ సీఎం జగన్ రూటే సపరేటు! ఆనాడు తాను పెట్టిన వేధింపులను రాజన్న రాజ్యం వరంలా జనం భరించాలట!. అదే తనకు బాధ కలిగితే ప్రపంచం అంతా కన్నీరు కార్చాలట!. జగన్ పార్టీ నేతలు, రోత మీడియాపై కేసులు పడితే యావత్ ప్రజానీకం రోడ్లమీదకొచ్చి అండగా నిలవాలట! తన ఐదేళ్ల పాలనలో తనకు నచ్చని మీడియాపై సాగించిన అరాచకాలు, నిర్బంధాలు, దురాగతాలను ‘తెలివి’గా ఆయన మరిచిపోయారు. తన రోతపత్రిక ఎడిటర్‌పై కేసులు పెడుతున్నారని, కక్షసాధింపునకు పాల్పడుతున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలని గొంతు చించుకుంటున్నారు. ‘‘పత్రికలో వచ్చే వార్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఖండించవచ్చు లేదా పరువునష్టం దావా వేయవచ్చు. అలా కాకుండా కేసులు పెడుతున్నారు’’ అంటూ జగన్ వాపోతున్నారు. ఇవన్నీ అనడానికి ఆయనకు ఎలా ఉండోగానీ, వింటున్న ప్రజలు మాత్రం విస్తుపోతున్నారు. నాడు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సహా పలు చానళ్ల కట్టడికి ప్రయత్నించిన జగనేనా ఇప్పుడిలా మాట్లాడుతోందని మీడియా వర్గాలు నివ్వెరపోతున్నాయి. ‘నొప్పి తెలిస్తేనే హక్కులు గుర్తొస్తాయా?’ అని నిలదీస్తున్నాయి.
మీడియాపై జగన్ జులుం: మీడియా అంటే తన రోతపత్రిక, చానల్ అన్నట్టు జగన్ ఐదేళ్ల పాలన సాగింది. తప్పులు ఎత్తిచూపే మీడియాపై జులుం ప్రదర్శించారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన నాడే మీడియాపై కన్నెర్ర చేశారు. పదవీప్రమాణ వేదిక నుంచే ‘ఆంధ్రజ్యోతి సంగతి చూసా’తనంటూ హెచ్చరించారు. తన ప్రభుత్వ చర్యలను ప్రశ్నించడం, ప్రజల తరపున వాస్తవాలను ప్రచురించడమే నేరం అన్నట్టు ‘ఆంధ్రజ్యోతి’పై కక్ష సాధింపులకు పాల్పడ్డారు. మీడియా గొంతు నొక్కడానికి కేసులదండం తీసుకొచ్చారు. దీనికోసం ప్రతీ శాఖలో ఓ నోడల్ అధికారిని నియమించారు. ఏ శాఖపై మీడియాలో వ్యతిరేక వార్త వస్తే ఆ శాఖ నోడల్ అధికారి సంబంధిత మీడియాపై లీగల్ నోటీసులు ఇచ్చి కేసులు పెట్టించడం, ఇంకా పరువునష్టం దావాలు వేయించడం చేశారు. ఇలా మీడియాపై లెక్కలేనన్ని కేసులు పెట్టారు.
ఆక్సుపెన్సీ తగ్గిందని రాసినందుకు‘ఆంధ్రజ్యోతి’పై ఆనాడు కేసు
కరోనా సమయంలో ప్రయాణికుల రద్దీలేక ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ తగ్గిందని వార్తరాసినందుకు జగన్ హయాంలో ‘ఆంధ్రజ్యోతి’పై కేసు పెట్టారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’, ‘టీవీ5’ తదితర ‘నచ్చని’ న్యూస్‌చానెళ్లపై అప్రకటిత నిషేధం అమలైంది. కేబుల్ ఆపరేటర్లను అడ్డుపెట్టుకుని ఈ చానళ్ల ప్రసారాలను నియంత్రించారు. చివరకు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి గెలిచింది. అప్పుడెప్పుడూ జగన్‌కు మీడియాను తాను వేధిస్తున్నట్లుగా గుర్తుకురాలేదు. సామాజిక మాధ్యమాల్లో జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఉక్కుపాదం మోపారు. జగన్ హయాంలో విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన జరిగింది. ఆ బాధితులకు న్యాయం చేయాలంటూ 75 ఏళ్ల రంగనాయకమ్మ ఫేస్‌బుక్‌లో పోస్టుపెట్టారు. అంతే....ఆమెకు సీఐడీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. సీనియర్ జర్నలిస్టు అంకబాబు సోషల్‌మీడియాలో ఓ పోస్టును పార్వార్డ్ చేశారని అరె్‌స్టచేశారు. కరోనాలో మాస్క్‌లు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌కు ఏ పరిస్థితి తీసుకొచ్చారో రాష్ట్ర ప్రజలకు ఇంకా మరచిపోలేదు. తన ఐదేళ్ల పాలనలో ఇలాంటి దుర్మార్గాలెన్నో జరిగినప్పుడు హక్కులు,స్వేచ్ఛల గురించి మాట్లాడని జగన్ ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు.