Media Controversy: జగన్ పరువు తీసేసిన సొంత మీడియా
ABN , Publish Date - Oct 31 , 2025 | 04:45 AM
జగన్ గ్రాఫ్‌ను అమాంతం ఆకాశానికి ఎత్తేయాలన్న తొందరలో సొంత మీడియా చేస్తున్న వ్యాఖ్యానాలు ఆయన పరువును పాతరేసేలా ఉన్నాయి.
సీఎంగా లేకపోయినా తుఫాన్‌లో ఆదుకున్న ఏకైక మగాడట
రోత మీడియాలో వింత కామెంట్.. విపత్తుల్లో ఏనాడూ గడపదాటని జగన్
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): జగన్ గ్రాఫ్‌ను అమాంతం ఆకాశానికి ఎత్తేయాలన్న తొందరలో సొంత మీడియా చేస్తున్న వ్యాఖ్యానాలు ఆయన పరువును పాతరేసేలా ఉన్నాయి. ‘సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు’ అంటూ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్ చానల్‌లో ఒక వాక్యం కనిపించింది. దీనిపై కూటమి పక్షాల నేతలు వెంటనే స్పందిస్తూ.. తామెవరమూ జగన్ మగాడు కాదనలేదంటూ వ్యంగ్యధోరణిలో ట్వీట్‌లు చేయడం మొదలుపెట్టారు. నిజానికి, సీఎంగా ఉండగా జగన్ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏనాడూ గడప దాటలేదు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలావరకు హైదరాబాద్ నివాసానికే ఆయన పరిమితమయ్యారు. పంట నష్టపోయిన రైతుల వద్దకు వెళ్లింది లేదు. జగన్ సీఎంగా ఉండగా రాష్ట్రాన్ని ఒకసారి ప్రకృతి విపత్తు ముంచెత్తింది. దానివల్ల దెబ్బతిన్న వరిచేలలోని పనలను చూసేందుకు ఆయన ప్రత్యేకంగా స్టేజీ సెటప్ వేయించుకున్నారు. ఆయన తీరు అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. పైగా మొంథా తుఫాను సమయంలో ఆయన రాష్ట్రంలో లేరు. ఎప్పటిలాగే బెంగళూరు వెళ్లిపోయారు.