Opposition Leader Status: మళ్లీ అదే పాట పాడిన జగన్
ABN , Publish Date - Sep 19 , 2025 | 05:34 AM
అసెంబ్లీలో విపక్ష నేత హోదాపై మాజీ సీఎం తిరిగి అదే పాట పాడారు. ప్రతిపక్ష నేత పదవి ఇచ్చేస్తే సభకు వస్తానని తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన తెలిపారు.
విపక్షనేత హోదా ఇస్తేనే సభకు వస్తా
లేదంటే నామీడియాతో మాట్లాడుకుంటా!
మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయండి
వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్దేశం
అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో విపక్ష నేత హోదాపై మాజీ సీఎం తిరిగి అదే పాట పాడారు. ప్రతిపక్ష నేత పదవి ఇచ్చేస్తే సభకు వస్తానని తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన తెలిపారు. తద్వారా తాను, ఎమ్మెల్యేలు ఈసారీ అసెంబ్లీ బయటే ఉంటామని చెప్పేశారు. శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ‘‘ప్రతిపక్షనేత హోదాను సభాపతి ప్రకటిస్తేనే శాసనసభకు వస్తాను. అసెంబ్లీకి సమాంతరంగా నేను ఎంచుకున్న మీడియాతో మాట్లాడతా. సభలో మాట్లాడాలనుకున్న ప్రజా సమస్యలను ప్రెస్ ద్వారా వెల్లడిస్తాను’’ అని తెలిపారు. శాంతిభద్రతలు, మెడికల్‌కాలేజీలు, యూరియా, అధిక ఎమ్మార్పీకి లిక్కర్ అమ్మకాలు, సూపర్ సిక్స్-సూపర్ హిట్...ఇలా పలు అంశాలపై మండలిలో నిలదీయాలని అక్కడ విపక్షనేత బొత్సను కోరారు.
ప్రభుత్వానికి బాధ్యత లేదు: బొత్స
ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్సీలు గురువారం సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన ఆసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడారు. సభలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం, మంత్రులు బాధ్యతారహితంగా సమాధానాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. 50 ఏళ్లకే పెన్షన్, కల్తీ మద్యంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు లేవన్నారు. తిరుపతి, సింహాచలం ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజలు, దేవుడంటే ప్రభుత్వానికి లెక్కలేదని మండిపడ్డారు.
పేదల పట్టాల రద్దు అధికారం మీకెవరిచ్చారు?
సీఎం చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబూ... పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసిమరీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు?’ అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానికా? వారి సొంతింటి కలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్న వాటిని తీసేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి రుజువయింది. మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’ అని జగన్ డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో పట్టాలు ఎంతమందికి, ఎంత ఖర్చుపెట్టి ఇచ్చిందీ వివరించారు.