Share News

Jagan: తుఫాన్‌ నిర్వహణపై.. పిట్టల దొర మాటలు

ABN , Publish Date - Nov 02 , 2025 | 05:57 AM

తుఫాన్‌ నిర్వహణపై బాబుగారివి పిట్టల దొర మాటలు. ఇది హృదయం లేని, అసమర్థ ప్రభుత్వం అని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విమర్శించారు.

Jagan: తుఫాన్‌ నిర్వహణపై.. పిట్టల దొర మాటలు

ఇది హృదయం లేని, అసమర్థ ప్రభుత్వం: జగన్‌

అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘తుఫాన్‌ నిర్వహణపై బాబుగారివి పిట్టల దొర మాటలు. ఇది హృదయం లేని, అసమర్థ ప్రభుత్వం’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విమర్శించారు. ఆయన ఎక్స్‌ వేదికగా శనివారం స్పందించారు. మొంథా తుఫానుకు రైతులు నష్టపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనంటూ వివరణాత్మక ఆరోపణలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంట బీమా అమలు చేయకపోవడంతో సొంతగా బీమా కట్టుకోలేని ఐదు లక్షల మంది రైతులు పరిహారం అందక నష్టపోతున్నారని ఆరోపించారు. 16 నెలల కాలంలో 16 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని అన్నారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారని, ఈ-క్రాపింగ్‌ విధానాన్ని నిలిపివేశారని ఆరోపించారు.


రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపకపోవడం చారిత్రక తప్పిదం

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నవంబరు 1న నిర్వహించకపోవడం చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదమని జగన్‌ విమర్శించారు. ఎక్స్‌ వేదికగా శనివారం మరో ప్రకటన చేసిన ఆయన... ముందుగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపకపోవడమంటే పొట్టి శ్రీరాములు త్యాగాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమాన పరచడమేనని అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రాజకీయాలకు అతీతంగా జరగాలని జగన్‌ పేర్కొన్నారు. మరో ప్రకటనలో... దైవదర్శనాలకు వెళ్లే భక్తుల భద్రతను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని జగన్‌ విమర్శించారు. ఈ ఏడాది తిరుమల, సింహాచలం, కాశీబుగ్గలలో జరిగిన ఘటనలను ఆయన ఉదహరించారు. బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 05:59 AM