Share News

AP Ministers: పీపీపీపై జగన్‌ విష ప్రచారం

ABN , Publish Date - Sep 18 , 2025 | 05:43 AM

సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం ‘పీపీపీ’ విధానంలో మెడికల్‌ కాలేజీలను పూర్తి చేయాలని భావిస్తోందని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్‌, వాసంశెట్టి సుభాశ్‌ స్పష్టం చేశారు.

AP Ministers: పీపీపీపై జగన్‌ విష ప్రచారం

  • వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అవాస్తవం

  • మంత్రులు కొండపల్లి, వాసంశెట్టి ఫైర్‌

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం ‘పీపీపీ’ విధానంలో మెడికల్‌ కాలేజీలను పూర్తి చేయాలని భావిస్తోందని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్‌, వాసంశెట్టి సుభాశ్‌ స్పష్టం చేశారు. కానీ, 11 వైద్య కలాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ మాజీ సీఎం జగన్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. సచివాలయంలో బుధవారం మీడియాతో మంత్రులు మాట్లాడారు. తొలుత మంత్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వం 17 మెడికల్‌ కాలేజీలను మంజూరు చేయించి.. కేవలం 5 కాలేజీలకు అరకొరగా భవనాలు మాత్రమే నిర్మించింది. అది కూడా కేంద్రం సొమ్మే. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూపాయి కూడా వెచ్చించలేదు. 17 మెడికల్‌ కాలేజీల్లో 3 కేంద్ర ప్రయోజిత పథకం కింద, 14 కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో చేపట్టారు. అన్నీ పూర్తి చేశామని జగన్‌ చెబుతున్నా పూర్తిస్థాయిలో ఏవీ జరగలేదు. 3 కాలేజీలకు కేంద్రం ఇచ్చిన రూ.975 కోట్లు మాత్రమే వినియోగించారు. మిగిలిన కాలేజీల నిర్మాణం పునాది దశ కూడా దాటలేదు. 5 కాలేజీలకు రూ.2,563 కోట్లు అవసరమైతే కేంద్రం ఇచ్చిన నిధుల నుంచి రూ.671 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి, మిగతా నిధులు దారిమళ్లించారు. 5 మెడికల్‌ కాలేజీల్లో మౌలిక వసతులకు ఇప్పుడు రూ.1,900 కోట్లు అవసరమవుతాయి. ప్రతి జిల్లాలో ఒక మెడికల్‌ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో పోర్టులు, విమానాశ్రయాల తరహాలోనే వాటిని ‘పీపీపీ’ విధానంలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వీటిని విజయవంతంగా పూర్తి చేసి.. పేదలపై భారం పడకుండా నిర్వహిస్తాం.’’ అని వివరించారు.


1,150 పీహెచ్‌సీల ఆధునికీకరణ

హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టును ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతోనే నిర్మించారని మంత్రి శ్రీనివాస్‌ తెలిపారు. అయినప్పటికీ టికెట్‌ ధరలు పెరగలేదన్నారు. మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్‌ మాటలను ప్రజలు నమ్మబోరని చెప్పారు. ‘హెల్త్‌-వెల్త్‌-హ్యాపీ’ నినాదంతో 1,150 పీహెచ్‌సీలను ఆధునికీకరిస్తున్నామని, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరచడంతోపాటు 5 కోట్ల మందికి రూ.25లక్షల ఆరోగ్య బీమా అమలు చేస్తున్నట్టు తెలిపారు.

జగన్‌ బ్యాచ్‌ ఫేక్‌ ప్రచారం: సుభాశ్‌

యూరియా కొరత అంటూ జగన్‌ అండ్‌కో తప్పుడు ప్రచారం చేశారని మంత్రి సుభాశ్‌ మండిపడ్డారు. తాజాగా మెడికల్‌ కాలేజీలపై ఫేక్‌ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 కాలేజీల నిర్మాణానికి రూ.671 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి, 17 కాలేజీలు కట్టామని సిగ్గు లేకుండా చెప్పుకొంటున్నారని విమర్శించారు. వైద్య కళాశాలలు ప్రారంభించాలంటే.. ఎంబీబీఎస్‌ తరగతి గదులు ఉండాలన్న నిబంధన పాటించకుండా.. 50ు సీట్లు ప్రైవేటీకరణ చేసింది జగన్‌ కాదా? అని నిలదీశారు. 11 సీట్లకే పరిమితం చేసినా జగన్‌కు ఇంకా బుద్ధి రాలేదన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 05:47 AM