జగన్ అవినీతిని కేంద్ర సంస్థలు కక్కిస్తాయి: సీఎం రమేశ్
ABN , Publish Date - Aug 02 , 2025 | 06:08 AM
అధికారం అడ్డం పెట్టుకొని మాజీ సీఎం జగన్... ఐదేళ్లు దిగమింగిన అవినీతి సొమ్మును కేంద్ర దర్యాప్తు సంస్థలు కక్కిస్తాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు.
విశాఖపట్నం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): అధికారం అడ్డం పెట్టుకొని మాజీ సీఎం జగన్... ఐదేళ్లు దిగమింగిన అవినీతి సొమ్మును కేంద్ర దర్యాప్తు సంస్థలు కక్కిస్తాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ఆయన శుక్రవారం విశాఖపట్నంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేశ్‌బాబుతో కలసి విలేకరులతో మాట్లాడారు. జగన్ హయాంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని, కేంద్ర సంస్థలు సీబీఐ, ఈడీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ కూడా రంగంలో దిగి మొత్తం బండారం బయట పెడతాయన్నారు. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలకు శ్రీకారం చుట్టింది జగన్‌మోహన్‌రెడ్డేనన్నారు. త్వరలో పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతుందని, బీటెక్ రవి భార్యను పోటీకి దించి గెలిపిస్తామన్నారు. తద్వారా అక్కడ జగన్ బలం ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని ఎంపీ ప్రకటించారు. మద్యం స్కామ్‌లో జగన్ ప్రధాన దోషిగా తేలడం ఖాయమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. అధికారం ఇక దక్కదనే విషయం అర్థమై జగన్ మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు.