YS Jagan: ఎక్కువగా వెజిటబుల్ ఆయిల్ తింటే రిపోర్టు ఇలానే వస్తుంది
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:10 AM
ఇటువంటి రిపోర్టు ఆవు సీరియస్ అండర్ ఫీడింగ్‌తో ఉన్నప్పుడు... ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు... ఆ ఆవు నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇటువంటి రిపోర్టు వస్తుంది అంటూ...
జగన్ సూత్రీకరణలపై తాజాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘ఇటువంటి రిపోర్టు ఆవు సీరియస్ అండర్ ఫీడింగ్‌తో ఉన్నప్పుడు... ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు... ఆ ఆవు నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇటువంటి రిపోర్టు వస్తుంది’ అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. జగన్ సీఎంగా ఉన్న సమయంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. 2024 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఉన్నట్లుగా బహిర్గతమైంది. దీనిపై ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్పందిస్తూ మాట్లాడారు. దీంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జగన్మోహన్‌రెడ్డి వెంటనే తాడేపల్లి ప్యాలె్‌సలో మీడియా సమావేశం నిర్వహించి ‘అధిక మొత్తంలో వెజిటబుల్ ఆయిల్స్... సచ్ యాజ్... రిప్రెస్డ్ ఆయిల్స్, కాటన్, పామాయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్టులు ఈ మాదిరిగా రావచ్చు’ అని వ్యాఖ్యానించారు. తాజాగా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఉందంటూ సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న నేపథ్యంలో... మరోసారి ఆనాడు జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో జగన్ మాటలను మరిచిపోయినవారు కూడా తాజా వీడియోను చూసి ‘ఔను జగన్ ఇలా అన్నాడేంటి..!’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.