Share News

Jagan Mohan Reddy: మా హయాంలో వ్యవసాయమంటే పండగ

ABN , Publish Date - Nov 27 , 2025 | 05:14 AM

రాష్ట్రవ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందుల్లో ఉన్నా ఆదుకోవాల్సిన ప్రభుత్వమే పట్టించుకోవడం లేదని మాజీ సీఎం జగన్‌ విమర్శించారు...

Jagan Mohan Reddy: మా హయాంలో వ్యవసాయమంటే పండగ

  • అన్ని రకాలుగా రైతులను ఆదుకున్నాం: జగన్‌

పులివెందుల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందుల్లో ఉన్నా ఆదుకోవాల్సిన ప్రభుత్వమే పట్టించుకోవడం లేదని మాజీ సీఎం జగన్‌ విమర్శించారు. ఉచిత పంటల బీమాను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, తమ హయాంలో వ్యవసాయం అంటే పండగలా ఉండేదని అన్నారు. మూడురోజుల పర్యటనలో భాగంగా పులివెందులకు వచ్చిన ఆయన రెండో రోజు బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందుల సమీపంలోని బ్రాహ్మణపల్లెలో అరటి తోటలను పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడి.. పంట పరిస్థితిపై ఆరా తీశారు. కొన్ని నెలలుగా అరటి ధరలు పూర్తిగా పడిపోయాయని ఒక రైతు చెప్పారు. అనంతరం జగన్‌ అక్కడే విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా ఆదుకున్నామన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులివెందులలో 2024 మార్చిలో కోల్డ్‌ స్టోరేజీని ప్రారంభించామని, దానిని వినియోగంలోకి తీసుకురాకుండా ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో అతివృష్టో, అనావృష్టో, ప్రకృతి వైపరీత్యాల కారణంతో 11 సార్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని, కానీ ఒక్కసారి కూడా చెల్లించలేదని అన్నారు. ఇప్పటికే రూ.1100 కోట్లు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగనిరీతిలో ఉల్లి రైతులు కూడా పంట సాగుచేసి ఇప్పుడు రోడ్లపై పారబోసిన పరిస్థితిని చూశామన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 05:14 AM