Compensation: పంటల బీమాపై జగన్ ప్రగల్భాలు
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:05 AM
రైతుల్ని సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ గుండెలు బాదుకున్న మాజీ సీఎం జగన్.. తన పాలనలో ఉచిత పంటల బీమాను పక్కాగా అమలు చేశామని ప్రగల్భాలు పలికారు.
ఐదేళ్ల పాలనలో మూడేళ్లు ఎగనామం
రైతు వాటా కింద నయా పైసా చెల్లించలేదు
పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన కేంద్ర మంత్రి
అయినా అన్నీ మర్చిపోయి ఉత్తుత్తి గొప్పలు
అప్పట్లో ఎరువులు, పురుగు మందులు వైసీపీ నేతల సిఫారసులు ఉన్న రైతులకే
ఇప్పుడు సహకార సంఘాల ద్వారా పంపిణీ
అయినా బ్లాక్ మార్కెట్ అంటూ జగన్ గగ్గోలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రైతుల్ని సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ గుండెలు బాదుకున్న మాజీ సీఎం జగన్.. తన పాలనలో ఉచిత పంటల బీమాను పక్కాగా అమలు చేశామని ప్రగల్భాలు పలికారు. మంగళవారం కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావంతో దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన సందర్భంగా ఆయన ఇలాంటి ఉత్తుత్తి గొప్పలు చాలానే చెప్పుకొచ్చారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చేసిందేమీ లేకపోయినా.. తుఫాను వస్తే సీఎం ఏం చేయాలో ఇప్పుడు ప్రవచించారు. పొలాలకు వచ్చి పంట నష్టాన్ని చూసి రైతులను ఓదార్చాలని సూక్తులు చెప్పారు. తుఫాన్ గతనెల 28న రాత్రి తీరం దాటింది. 29న గాలులు, భారీవర్షాలు కురవగా, 30న ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేసి, కోనసీమ జిల్లాలో రైతులతో మాట్లాడిన విషయం తెలిసిందే. తన పాలనలో తుఫాన్లు వచ్చినప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి రైతుల్ని జగన్ పరామర్శించిన దాఖలాలే లేవు. కనీసం హెలికాప్టర్ దిగి, పంట నష్టాన్ని స్వయంగా చూసిన సందర్భాలూ అరుదే. తన హయాంలో ఉచిత పంటల బీమా అమలు చేశామని ప్రగల్భాలు పలికిన జగన్.. ఐదేళ్లలో మూడేళ్ల పాటు ఫసల్ బీమా కింద రైతు వాటా నయా పైసా చెల్లించలేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ ఏడాది జూన్ 29న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పార్లమెంట్ సాక్షిగా వైసీపీ పాలనలో మూడేళ్లు పంటల బీమా సొమ్ము రైతులకు ఎగనామం పెట్టిన విషయాన్ని బహిర్గతం చేశారు. 2019 ఖరీఫ్ నాటికి అధికారంలోకి వచ్చిన జగన్.. పంటల బీమా కింద రైతులతో ఒక రూపాయి ప్రీమియం కట్టించారు.
మిగతా రైతు వాటాను రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించినా.. ఆ ఏడాది రబీ సీజన్‌లో ఈ పథకాన్ని వినియోగించుకోకపోవడంతో రైతులకు బీమా లబ్ధి చేకూరలేదు. 2020, 2021ల్లో రెండు సీజన్లలోనూ అసలు ఫసల్ బీమా పథకాన్నే వినియోగించుకోలేదు. ఉచిత పంటల బీమా అంటూ కేవలం ఖరీఫ్ సీజన్లలో మాత్రమే విపత్తులకు పంట నష్టపోయిన రైతులకు అరకొరగా పరిహారాన్ని వైసీపీ ప్రభుత్వం అందించింది. కానీ కూటమి ప్రభుత్వం గతేడాది ఉచిత పంటల బీమాను కొనసాగించింది. గత రబీ, ముగిసిన ఖరీ్‌ఫలో బీమా ప్రీమియం రైతులే చెల్లించాలని నిర్దేశించింది. బీమా చేసిన రైతులకు పరిహారం పెండింగ్‌లో ఉండగా, ఉచిత పంటల బీమా లేక ఎకరానికి రూ.20 వేలు చొప్పున రైతులు నష్టపోతున్నారని జగన్ బాధపడిపోయారు. తన హయాంలో రబీ సీజన్లకు బీమా వర్తింపజేయని విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు మాత్రం రబీ సీజన్లకూ బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ హయాంలో కేవలం వైసీపీ నేతల సిఫారసులున్న రైతులకే ఆర్బీకేలు ఎరువులు పంపిణీ చేశాయి. ఇవన్నీ విస్మరించిన జగన్.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా ఎరువులు ఇస్తుంటే.. బ్లాక్ మార్కెట్ జరుగుతోందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే తుఫాన్‌కు 1.38 లక్షల హెక్టార్లలో పంటలు మునిగినట్లు ప్రాథమిక అంచనా వేసిన వ్యవసాయ శాఖ.. వారం రోజుల ఎన్యూమరేషన్‌లో దాదాపు 1.58 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు తేల్చింది. అయితే 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందంటూ జగన్ గగ్గోలు పెట్టడంపై అధికారులు అవాక్కవుతున్నారు.