Share News

Manickam Tagore: జగన్‌, భారతిలే ప్రధాన సూత్రధారులు

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:34 AM

మద్యం కుంభకోణంలో మిథున్‌ రెడ్డి బంటు మాత్రమేనని, అసలైన ప్రధాన సూత్రధారులు వైఎస్‌ జగన్‌, భారతి అని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాకూర్‌ ఆరోపించారు.

Manickam Tagore: జగన్‌, భారతిలే ప్రధాన సూత్రధారులు

  • మిథున్‌రెడ్డి బంటు మాత్రమే..: కాంగ్రెస్‌

  • లిక్కర్‌ మాఫియా కోటి కుటుంబాలను నాశనం చేసింది: ఠాకూర్‌

న్యూఢిల్లీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో మిథున్‌ రెడ్డి బంటు మాత్రమేనని, అసలైన ప్రధాన సూత్రధారులు వైఎస్‌ జగన్‌, భారతి అని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాకూర్‌ ఆరోపించారు. జగన్‌ మద్యం మాఫియా ఆంధ్రప్రదేశ్‌లో కోటి పేద కుటుంబాలను నాశనం చేసిందని ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా మండిపడ్డారు. జగన్‌ అండ్‌ కో రూ.3,500 కోట్ల లంచాల కోసం హానికరమైన మద్యాన్ని ప్రోత్సహించారని ఆరోపించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన కుంభకోణం కాదని, జగన్‌ ఎంతో పకడ్బందీగా, ప్రణాళికతో చేసిన ఆపరేషన్‌ అన్నారు. నాసిరకం మద్యం బ్రాండ్లను గుర్తించి, పంపిణీ ప్రణాళికను రచించి, కిక్‌ బ్యాక్‌లపై ముందుగానే చర్చించుకుని, నకిలీ సంస్థలను సృష్టించి.. దోపిడీని చట్టబద్ధంగా చేయడానికి కొత్త మద్యం పాలసీ తెచ్చారని ఆరోపించారు. జగన్‌, ఆయన భార్య భారతి, కొంతమంది మంత్రులు, వారితో కలిసి పనిచేసిన కాంట్రాక్టర్లు లబ్ధి పొందారని ఆరోపించారు. 2019-24మధ్య కనీసం రూ.3,200 కోట్లు మళ్లించినట్టు సిట్‌ దర్యాప్తు చెబుతోందని, ఇది దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణమని అన్నారు. ఆ డబ్బును గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను మబ్య పెట్టేందుకు, మద్యం పంచేందుకు, ఓటర్లకు డబ్బులు ఇచ్చేందుకు వినియోగించారని ఆరోపించారు. ఎక్సైజ్‌ శాఖ, రాజకీయ నేతల మధ్య సమన్వయం చేయడంలో చీఫ్‌ ఆపరేటర్‌ అవతారంలో మిఽథున్‌రెడ్డి కీలకపాత్ర పోషించారన్నారు. ఇది జగన్‌ చేసిన మొదటి స్కామ్‌ కాదని, సీబీఐ లెక్కల ప్రకారం రూ. 43 వేలకోట్ల అక్రమ ఆస్తుల కేసుల్లో ఇప్పటికే ప్రధాని నిందితుడని గుర్తు చేశారు. 16 నెలలకు పైగా జైలులో ఉన్నారని అన్నారు. జగన్‌.. ఇసుక మాఫియా, మైనింగ్‌, భూ కేటాయింపులు, అమరావతి చుట్టూ ఇన్‌ సైడ్‌ ట్రేడింగ్‌.. దీనికితోడు ప్రజారోగ్యాన్ని సైతం తాకట్టుపెట్టి మద్యం దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్‌ బాధితులు అందరూ పేదలు, మాట్లాడలేని అమాయకులు, ఓటర్లేనని తెలిపారు.

Updated Date - Jul 21 , 2025 | 04:39 AM