Share News

Jagan Mohan Reddy: కక్షతోనే తప్పుడు కేసులు

ABN , Publish Date - Aug 01 , 2025 | 06:02 AM

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని... ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నంలో భాగంగా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని జగన్‌ విమర్శించారు.

Jagan Mohan Reddy: కక్షతోనే తప్పుడు కేసులు

  • ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారు: జగన్‌

నెల్లూరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని... ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నంలో భాగంగా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని జగన్‌ విమర్శించారు. క్వార్ట్జ్‌ అక్రమ రవాణా కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసి ప్రజాగ్రహానికి గురైన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డిని పరామర్శించడానికి జగన్‌ గురువారం నెల్లూరు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ నాయకులపై పెట్టినవన్నీ తప్పుడు కేసులని, కక్షపూరితంగా పెట్టినవేనని ఒక్కో కేసుకు ఒక్కో కొత్త కారణాన్ని వివరించారు. ఏం తప్పు చేశాడని కాకాణిని జైల్లో పెట్టారని ప్రశ్నించారు. చదువుకునే రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి చెప్పుతో కొట్టారని, ‘‘అది ఎంతగా చంద్రబాబు మనసులో నాటుకొని పోయిందంటే ఏకంగా పెద్దిరెడ్డన్న కొడుకును ఎట్లయినా జైల్లో పెట్టించాలా, పెద్దిరెడ్డికి మానసిక క్షోభ కలిగించాల అని ఆయన కుమారుడు మిథున్‌ రెడ్డిని అరెస్టు చేయించారు’’ అని వింత వాదన తెరపైకి తెచ్చారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని... అంతమాత్రాన ప్రసన్న కుమార్‌ రెడ్డి ఇంటిపై దాడికి దిగి హత్యాయత్నం చేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి చెవిరెడ్డి చేతుల్లోకి పోయిందని ఆయనపై కేసు పెట్టారన్నారు. మూడేళ్ల తరువాత వైసీపీ అధికారంలోకి వస్తుందని... అప్పుడు చంద్రబాబును, ఆయన అడుగులకు మడుగులొత్తిన అవినీతి అధికారులను చట్టం ముందు నిలబెడతామని జగన్‌ హెచ్చరించారు.

Updated Date - Aug 01 , 2025 | 06:03 AM