Share News

J P Nadda: అభివృద్ధి పథంలో ఏపీ

ABN , Publish Date - Sep 15 , 2025 | 03:50 AM

ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారం నుంచి వెలుగు దిశగా తీసుకువెళ్తోందని, అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ పరుగులు పెట్టిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు...

J P Nadda: అభివృద్ధి పథంలో ఏపీ

  • అంధకారం నుంచి వెలుగుల వైపు రాష్ట్రం

  • గాడిలో పెడుతున్న కూటమి.. వైపీసీ హయాంలో అవినీతి, అరాచకం

  • అసమర్థ పాలనతో అడుగంటిన అభివృద్ధి.. మోదీ సంస్కరణలతో దేశ ఆర్థికం బలోపేతం.. అమరావతికి అన్ని విధాలా సహకరిస్తాం

  • చంద్రబాబు, పవన్‌ నేతృత్వం సూపర్‌.. 2047 నాటికి విశ్వగురుగా భారత్‌: జేపీ నడ్డా.. విశాఖలో ‘సారథ్యం యాత్ర’ ముగింపు సభ

విశాఖపట్నం, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారం నుంచి వెలుగు దిశగా తీసుకువెళ్తోందని, అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ పరుగులు పెట్టిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పీవీఎన్‌ మాధవ్‌ ‘సారథ్యం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర నిర్వహించారు. ఆదివారం విశాఖపట్నంలోని రైల్వేమైదానంలో ‘సారథ్యం యాత్ర’ ముగింపు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నడ్డా మాట్లాడుతూ, ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందని, అవినీతి, అసమర్థ, అరాచక పాలన సాగించారని, అభివృద్ధి అడుగంటిందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ అసమర్థ పాలన, వారసత్వ రాజకీయాలు, అవినీతిని ప్రజలు చూశారన్నారు. ఎన్‌డీఏ పాలనలో జవాబుదారీతనం, సమస్యలపై తక్షణ స్పందనను గుర్తించిన ప్రజలు తమకు అండగా ఉంటున్నారని నడ్డా పేర్కొన్నారు.

అభివృద్ధిలో ఏపీ పరుగులు

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలనలో సూపర్‌గా ఉందని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని నడ్డా తెలిపారు. రాష్ట్రంలో వేల కిలో మీటర్ల హైవేల నిర్మాణం జరుగుతోందని, 3,300 గ్రామాలకు రోడ్ల నిర్మాణం, రూ.3,334 కోట్లతో 32 మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. 15 పోర్టులు, 8 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తూ అభివృద్ధికి ఏపీ చిరునామాగా మారిందన్నారు. రూ.625 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కొనసాగుతోందన్నారు. ఓర్వకల్లు విమనాశ్రయం అందుబాటులోకి రానుందన్నారు. అమరావతి నిర్మాణానికి సహకారం అందిస్తున్నామన్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్ట్‌, నక్కపల్లి మండలంలో రూ.వేల కోట్లతో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటవుతున్నాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందని నడ్డా సూచించారు.


అన్నివిధాలా సహకారం

  • కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ప్రధాని మోదీకి రాష్ట్రంపై ఎంతో ప్రేమ ఉందని, విశాఖకు వచ్చినప్పుడు రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌కు రూ.11,500 కోట్ల ప్యాకేజీ ఇచ్చి ఆదుకున్న ఘనత ఎన్‌డీఏ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రూ.1.35 లక్షల కోట్లతో నక్కపల్లి ప్రాంతంలో మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో మేలు: మాధవ్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ, బీజేపీని అన్ని ప్రాంతాలకు విస్తరించి, అన్ని వర్గాలకు చేరువ చేసే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ‘సారథ్యం యాత్ర’ను నిర్వహించినట్టు చెప్పారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని అందించే ఏకైక ప్రభుత్వం ఎన్‌డీఏనని పేర్కొన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 03:50 AM