దుర్గగుడి చైర్మన్ నియామకంపై ఐవీఆర్‌ఎస్ సర్వే
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:49 AM
దుర్గగుడి పాలకవర్గం నియామకానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చైర్మన్‌గా ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే అంశంపై ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది.

- కసరత్తు ప్రారంభించిన కూటమి ప్రభుత్వం
-పదవి కోసం పట్టుబడుతున్న కూటమి పార్టీల నేతలు
- ప్రచారంలో నెట్టెం, గూడపాటి, వెలగపూడి, బుద్దా, సారిపల్లి పేర్లు
- బీజేపీ నుంచి అడ్డూరి శ్రీరామ్, జనసేన నుంచి ఓ మహిళా నాయకురాలి పేరు కూడా..
- దుర్గగుడి పాలకవర్గం నియామకంపై కసరత్తు
ఇంద్రకీలాద్రి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి):
దుర్గగుడి పాలకవర్గం నియామకానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చైర్మన్‌గా ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే అంశంపై ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కాగా, గత రెండు నెలలు నుంచి ప్రభుత్వ పెద్దలు వివిధ ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో కొన్నింటికి నియామకాలు చేశారు. మరికొన్ని పదవులపై కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోనే అతిపెద్ద రెండవ దేవస్థానం అయిన శ్రీదుర్గామల్లేశ్వర దేవస్థానం చైర్మన్ పదవిపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల్లోని పలువురు నాయకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పదవి బీజేపీకి ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. మరో పక్క టీడీపీ, జనసేన పార్టీల్లోని పలువురు నాయకులు తమకే చైర్మన్ పదవి కావాలని ఆయా పార్టీల అధినేతలపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
పదవి కోసం పలువురి నేతల పట్టు
దుర్గగుడి చైర్మన్ పదవి మరికొన్ని రోజుల్లో భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, గూడపాటి పద్మశేఖర్, వెలగపూడి శంకర్‌బాబు, బీసీ సామాజిక వర్గం నుంచి సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న, సారిపల్లి రాధాకృష్ణ, బీజేపీ నుంచి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన పార్టీ నుంచి ఓ మహిళా నాయకురాలు కూడా దుర్గగుడి చైర్మన్ పదవికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దుర్గగుడి చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.