వేటుకు వేళాయె!
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:59 AM
గత వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు, పలువురు అధికారులు బరితెగించారు. రికార్డులు, అగ్రిమెంట్లు, ఎం.బుక్‌లు లేకుండా చేసిన 69 పనులకు రూ.54.97 లక్షల బిల్లులు పెట్టారు. వాటిని చెల్లించాలని మాజీ మంత్రి కొడాలి నాని ద్వారా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో అనేక ఆరోపణలు రావడంతో బిల్లుల చెల్లింపులను అధికారులు నిలుపుదల చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కూటమి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పరిశీలించిన ప్రభుత్వం 19 మంది మున్సిపల్ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది.
- రూ.54.97 లక్షల బిల్లుల వ్యవహారంలో ప్రభుత్వం నిర్ణయం
- వైసీపీ హయాంలో గుడివాడలో బరి తెగించిన కాంట్రాక్టర్లు, అధికారులు
- 19 మంది మున్సిపల్ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు కూటమి ప్రభుత్వం ఆదేశం
- అప్పట్లో మాజీ మంత్రి నాని ద్వారా బిల్లులు చెల్లించాలంటూ ఒత్తిడి
- నాడు చక్రం తిప్పిన అరాచక కాంట్రాక్టర్
- రికార్డుల్లేవు, అగ్రిమెంట్‌లు లేవు, ఎం.బుక్‌లు లేవు
- బిల్లుల చెల్లింపులు నిలుపుదల చేసిన నాటి ఉన్నతాధికారులు
గత వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు, పలువురు అధికారులు బరితెగించారు. రికార్డులు, అగ్రిమెంట్లు, ఎం.బుక్‌లు లేకుండా చేసిన 69 పనులకు రూ.54.97 లక్షల బిల్లులు పెట్టారు. వాటిని చెల్లించాలని మాజీ మంత్రి కొడాలి నాని ద్వారా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో అనేక ఆరోపణలు రావడంతో బిల్లుల చెల్లింపులను అధికారులు నిలుపుదల చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కూటమి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పరిశీలించిన ప్రభుత్వం 19 మంది మున్సిపల్ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది.
ఆంధ్రజ్యోతి - గుడివాడ:
గుడివాడ పురపాలక సంఘ పరిధిలో గతంలో అనేక కారణాలతో సి.బిల్లుల చెల్లింపులను నిలిపివేశారు. పనులు సక్రమంగా జరగలేదని, రికార్డులు లేవని, కనీసం ఎగ్రిమెంట్ కూడా చేసుకోకుండా, ఇష్టానుసారంగా నాటి అధికార పార్టీ కాంట్రాక్టర్‌లకు పనులను అప్పగించారని అప్పట్లో మాజీ మంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్, కాంట్రాక్టర్ పాలంకి సారధిబాబు నిరసన కూడా తెలిపారు. దీనిపై స్పందించిన డీఎంఏ (డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిసే్ట్రషన్) రాజమండ్రి ఆర్డీని విచారణ అధికారిగా నియమించారు. విచారణ పూర్తి చేసిన ఆయన నివేదికను డీఎంఏకు సమర్పించారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీ కాంట్రాక్టర్‌లకు బిల్లులను చెల్లించాలని మున్సిపల్ అధికారులపై నాటి ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్య అనుచరుడు ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే అదే సమయంలో ఎన్నికల నగారా మోగడంతో బిల్లుల చెల్లింపునకు బ్రేక్ పడింది. గుడివాడ పురపాలక సంఘం పరిధిలో కంటిన్‌జెంట్ బిల్లుల పేరుతో ఐదేళ్ల వైసీపీ పాలనలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారనే ఆరోపణలున్నాయి.
69 పనులకు రూ.54,97,531 బిల్లులు
2022-2023 ఆర్థిక సంవత్సరంలో 69 పనులకు గాను రూ.54,97,531 కంటిన్‌జెంట్ బిల్లులను పెట్టారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ 2024, ఏప్రిల్ 6వ తేదీన ‘నాడు అక్రమం.. నేడు సక్రమం’ అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురించింది. అప్పటి కలెక్టర్ రంజిత బాషా పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డీఎంఏకు లేఖ రాశారు. దీంతో డీఎంఏ ముందస్తుగా ఎటువంటి చెల్లింపు చేయరాదంటూ మౌఖిక ఆదేశాలను జారీ చేశారు. ఈ నేపథ్యంలో బినామీ కాంట్రాక్టర్లు అప్పటి కమిషనర్, అకౌంట్స్ అధికారిపై తీవ్రస్థాయిలో ఒత్తిడిని తీసుకువచ్చారు. ఏకంగా అసిస్టెంట్ కమిషనర్ రంగారావు బిల్లులను చెల్లించాలంటూ ఉద్యోగులపై దౌర్జాన్యానికి సైతం దిగారు. 69 పనుల్లో అప్పటి అసిస్టెంట్ కమిషనర్ టి.రంగారావుకు చెందిన బినామీ కాంట్రాక్టర్‌ల బిల్లులే అధికంగా ఉన్నాయని ఆరోపణలు వెలువెత్తాయి.
చెల్లింపులు నిలిపివేసిన డీఎంఏ
ఈ విషయంలో అసలుకే మోసం వస్తుందని భావించి బిల్లుల చెల్లింపును మున్సిపల్ అధికారులు నిలుపుదల చేశారు. అప్పటి కమిషనర్, అకౌంట్స్ అధికారులు సదరు బిల్లుల్లోని లోపాలను తెలియజేస్తూ డిపార్టుమెంట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిసే్ట్రషన్, గుంటూరు, రీజనల్ డైరెక్టర్, రాజమండ్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో బిల్లుల చెల్లింపును నిలుపుదల చేయాలని డీఎంఏ మౌఖిక ఆదేశాలను జారీ చేశారు. మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ సత్యనారాయణను విచారణ అధికారిగా నియమించగా, విచారణ పూర్తి చేసి నివేదికను డీఎంఏకు అందించారు. అప్పటి మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరుడు అడబాల అప్పారావు, అతని కుమారుడు మున్సిపల్ కాంట్రాక్టర్ హేమంత, మరో ఇద్దరు కాంట్రాక్టర్లు నానితో డీఎంఏకు పలుమార్లు ఫోన్ చేయించి బిల్లులను చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నగారా మోగడంతో చెల్లింపులకు బ్రేక్ పడింది.
కంటిన్‌జెంట్ పనుల పేరుతో భారీగా దోపిడీ
పురపాలక సంఘ పరిధిలో కేవలం నోటి మాటతో రూ.లక్ష లోపు విలువ గల పనులను చేపట్టారు. ఎటువంటి టెండర్ ప్రకటన, నియమాలు, అగ్రిమెంట్‌లు లేకుండా 69 పనులను చేపట్టినట్టు చూపి రూ.54.97 లక్షల బిల్లులను పెట్టారు. అప్పట్లో మున్సిపాల్టీలో చక్రం తిప్పిన అధికార పార్టీ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్, కొందరు మున్సిపల్ ఉద్యోగులు మిలాఖత అయ్యి, అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న ముగ్గురు కాంట్రాక్టర్‌ల సహాయంతో మున్సిపల్ నిధులను కొల్లగొట్టారని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. కరోనా విపత్తు కాలంలో రూ.2 కోట్ల మేర ఈ విధంగా గుట్టుచప్పుడు కాకుండా బొక్కేశారని కాంట్రాక్టర్ వర్గాలు కోడైకూస్తున్నాయి. కంటిన్‌జెంట్ అంటే నామమాత్రంగా చిన్న కాగితం ముక్కపై పనులు చేశామని పేర్కొంటూ మున్సిపల్ కమిషనర్ అనుమతితో జనరల్ ఫండ్ నుంచి బిల్లులు చెల్లిస్తారు. ఆ తర్వాత సదరు కాగితపు ముక్కను చించేసినా, పారేసినా అడిగే దిక్కే లేదు. ఏ ఒక్క అధికారి దీనికి సమాధానం చెప్పరు. అందుకే ఈ రకంగా బిల్లులతో పనులు చేపడితే ఆడిట్‌లో కూడా దొరికే ఛాన్స్ లేదని కాంట్రాక్టర్లు బహిరంగంగా చెబుతున్నారు.
క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు
రూ.54.97 లక్షల కంటిన్‌జెంట్ బిల్లుల వ్యవహారంలో అప్పటి మున్సిపల్ రీజనల్ డైరెక్టర్, రాజమండ్రి వారి నివేదిక, మున్సిపల్ డీఎంఏ సిఫారసు మేరకు కూటమి ప్రభుత్వం అప్పటి 19 మంది మున్సిపల్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. వీరిలో విశ్రాంత మున్సిపల్ కమిషనర్ పి.జె.సంపతకుమార్, అసిస్టెంట్ కమిషనర్, ప్రస్తుత మండపేట మున్సిపల్ కమిషనర్ టి.వి.రంగారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.శేఖర్ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, విశాఖపట్నం), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కరుణాకర్ (విజయవాడ డిప్యూటీ ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్), పి.ఆర్.సి.ప్రవీణ్‌కుమార్ (మచిలీపట్నం), విశ్రాంత డీఈఈ టి.వి.రాజు, అసిస్టెంట్ ఆడిట్ అధికారి ఎం.డి.ఎస్.ఎస్.రత్న(కృష్ణా వర్సిటీ ఆర్థిక అధికారి), అసిస్టెంట్ ఇంజినీర్లు జ్వాల దీప్తి, తేజస్వి (అసిస్టెంట్ ఇంజినీర్లు, మచిలీపట్నం), విశ్రాంత ఏఈ ప్రభాకర్, శానిటరీ ఇన్స్‌పెక్టర్ ఎల్.ఎస్.అప్పారావు, డి.ఆదినారాయణ(పెద్దాపురం శానిటరీ ఇన్స్‌పెక్టర్), ఎ.రాంబాబు (చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్), బి.పి.కె.వి.ఎన్.సుబ్రహ్మణ్యం (హెల్త్ అసిస్టెంట్, తాడిగడప), ఆర్.నరేష్, టౌన్ ప్లానర్ పి.నాగేంద్ర(రిటైర్డ్), అసిస్టెంట్ సిటీ ప్లానర్ వై.రాంబాబు (విజయవాడ అసిస్టెంట్ సిటీ ప్లానర్), సీనియర్ అసిస్టెంట్ కె.చెన్నకేశవరావు (సీనియర్ అసిస్టెంట్, ఉయ్యూరు), సీనియర్ అకౌంటెంట్ ఆర్.జోజి ఉన్నారు.