Share News

టీడీపీ పండుగకు వేళాయె!

ABN , Publish Date - May 26 , 2025 | 12:57 AM

కడపలో ఈ నెల 27 నుంచి జరిగే రాష్ట్రస్థాయి టీడీపీ మహానాడుకు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి 20 వేల మంది కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లనున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి రెండు వేల మంది కార్యకర్తలు, 500 మంది నాయకులు బయలుదేరుతున్నారు. మండల, జిల్లా నాయకత్వాలతో సహా ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల నుంచి మొత్తం 20 వేల మంది వెళ్తున్నట్టు సమాచారం.

టీడీపీ పండుగకు వేళాయె!

- ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి 20 వేల మంది పయనం

- ఒక్కో నియోజకవర్గం నుంచి 2 వేల మంది కార్యకర్తలు, 500 మంది నాయకులు

- ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రతిపాదనతో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల అధ్యక్షులు నెట్టెం, కొనకళ్ల

- కడపలో 27 నుంచి టీడీపీ రాష్ట్ర మహానాడు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

కడపలో ఈ నెల 27 నుంచి జరిగే రాష్ట్రస్థాయి టీడీపీ మహానాడుకు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి 20 వేల మంది కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లనున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి రెండు వేల మంది కార్యకర్తలు, 500 మంది నాయకులు బయలుదేరుతున్నారు. మండల, జిల్లా నాయకత్వాలతో సహా ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల నుంచి మొత్తం 20 వేల మంది వెళ్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కార్లు, బస్సులు బుక్‌ చేసుకున్నట్టు తెలిసింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసీపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా కార్యకర్తలు, నాయకులు కృషి చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మహానాడు కావడంతో అనేక ఆశలు, ప్రతిపాదనలు, సమస్యల అజెండాలతో జిల్లా నాయకత్వాలు మహానాడుకు బయలుదేరుతున్నాయి.

మహానాడు దృష్టికి పలు తీర్మానాలు

నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించిన మినీ మహానాడుల్లో అనేక తీర్మానాలు చేశారు. ్ణజిల్లాల స్థాయిలో నిర్వహించిన మినీ మహానాడుల్లో సైతం పలు తీర్మానాలు చేయటం జరిగింది. ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల అధ్యక్షులు నెట్టెం రఘురామ్‌, కొనకళ్ల నారాయణరావు సంయుక్తంగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదనతో మహానాడుకు వెళుతున్నారు. మహానాడులో ఈ ప్రతిపాదన చేయనున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో అనేక సమస్యలను పార్టీ దృష్టికి తీసుకు రావటానికి తీర్మానాలు చేశారు. బుడమేరు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని, చింతలపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని, జీ కొండూరులో ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని, వీటీపీఎస్‌ నుంచి విడుదలవుతున్న బూడిత కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని, ఏడు నియోజకవర్గాల్లో అహర్నిశలూ పార్టీ కోసం పనిచేసిన వారికి నామినే టెడ్‌ పదవులు ఇవ్వాలని, తూర్పు నియోజకవర్గంలో రీటైనింగ్‌ వాల్‌ వెంబడి పంపింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని, విజయవాడ నగరంలో యూజీడీ మెరుగు పరచాలని, వత్సవాయి మండలం పోలంపల్లి మున్నేరుపై నిర్మించిన ఆనకట్ట గండ్లు పూడ్చాలని, గుణదలలో ఆగిపోయిన ఫ్లై ఓవర్‌ను పునరుద్ధరించాలని, పశ్చిమలో హజ్‌ హౌస్‌ పూర్తి చేయాలని, తిరువూరులో సురక్షిత నదీజలాల ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రతిపాదనలతో నేతలు మహానాడుకు తరలివెళుతున్నారు.

కృష్ణాజిల్లా అభివృద్ధిపై..

మచిలీపట్నం పోర్టు ఏర్పాటు నేపథ్యంలో పోర్టు ఆధారిత ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని, అసైన్డ్‌ భూముల సమస్యకు పరిష్కారం చూపాలని, మచిలీపట్నం - రేపల్లె రైల్వేలైన్‌ చేపట్టాలని, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, గోల్డ్‌ కవరింంగ్‌, కలంకారీకి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని, ఆక్వా రైతుల అందరికీ యూనిట్‌ కరెంట్‌ రూ.1.50కే అందించాలని, మచిలీపట్నం - విజయవాడ ఆరు వరసల రోడ్డును అనుసంధానం చేయాలని, ఎన్‌హెచ్‌ - 216 ను 4, 6 లైన్లుగా విస్తరించాలని, మల్లవల్లి పారిశ్రామిక కారిడార్‌కు ఎక్కువ పరిశ్రమలు వచ్చేలా చూడాలని, పోలవరం కుడి కాలువ 137 కిలోమీటర్‌ దగ్గర బండారుగూడెం నుంచి ఏలూరు కాలువ 36 కిలోమీటర్‌ వరకు గోదావరి జలాలను తీసుకు వచ్చే లింకు చానల్‌కు సవరించిన అంచనాల ప్రకారం రూ. 32 కోట్లు మంజూరు చేయాలని, గన్నవరం నియోజకవర్గంలో 15 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, గుడివాడలో తాగునీరు, వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయాలని, పామర్రులో యువత, విద్యార్థి, ఉద్యోగ ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టాలని, విదేశీ విద్య, విద్యా దీవెన అమలు చేయాలన్న తదితర ప్రతిపాదనలతో మహానాడుకు బయలుదేరుతున్నారు.

Updated Date - May 26 , 2025 | 12:57 AM