Vizag IT Growth: తూర్పు తీరం.. ఐటీ సంబరం
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:59 AM
తూర్పు తీరంలోని విశాఖ నగరంలో ఐటీ సంబరం నెలకొంది. పెద్ద కంపెనీలు ఒక్కొక్కటిగా వైజాగ్‌వైపు అడుగులు వేస్తున్నాయి.
నేడు విశాఖలో కాగ్నిజెంట్ ‘తొలి అడుగు’
800 మంది ఉద్యోగులతో తాత్కాలిక డెవల్‌పమెంట్ సెంటర్ ప్రారంభం
కాపులుప్పాడలో శాశ్వత క్యాంప్‌సకు భూమిపూజ
2029 నాటికి పూర్తి కమర్షియల్ ఆపరేషన్లు
దశల వారీగా 8 వేల మందికి ఉద్యోగాలు
మరో 7 కంపెనీలకూ శంకుస్థాపనలు
సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ రాక
విశాఖపట్నం, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): తూర్పు తీరంలోని విశాఖ నగరంలో ఐటీ సంబరం నెలకొంది. పెద్ద కంపెనీలు ఒక్కొక్కటిగా వైజాగ్‌వైపు అడుగులు వేస్తున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో కార్యకలాపాలకు శుక్రవారం శ్రీకారం చుడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నంలో రుషికొండ ఐటీ పార్కు హిల్-2పై మూడు అంతస్థుల మహతి భవనాన్ని అద్దెకు తీసుకుని తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభిస్తోంది. 800 మంది పనిచేసే ఈ కార్యాలయాన్ని ఐటీ శాఖ మంత్రి లోకేశ్ శుక్రవారం ఉదయం ప్రారంభిస్తారు. ఆ తరువాత 11.30 గంటలకు కాపులుప్పాడలో కేటాయించిన భూమిలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి లోకేశ్ కూడా పాల్గొంటారు. తమ ఐటీ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి భూమి కేటాయించాలని కాగ్నిజెంట్ కోరగా రాష్ట్ర ప్రభుత్వం కాపులుప్పాడలో 21.31 ఎకరాలు కేటాయించింది. విశాఖపట్నం ప్రాజెక్టుకు రూ. 1,582.98 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పడంతో ప్రభుత్వం ఎకరా 99 పైసలకే ఇచ్చింది. దశల వారీగా ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కాగ్నిజెంట్ ఒప్పందం చేసింది. 2029 మార్చి నాటికి కమర్షియల్ ఆపరేషన్లు ప్రారంభిస్తామని స్పష్టంచేసింది. అయితే అప్పటివరకు వేచి ఉండలేమని ఒకవైపు కేటాయించిన భూమిలో నిర్మాణం చేపడుతూనే మరో వైపు తమ సంస్థ ఆపరేషన్లు నిర్వహిస్తామని ప్రకటించింది.
మరో ఏడు కంపెనీలు కూడా..
విశాఖలో మరో ఏడు కంపెనీలకు కూడా ఐటీ మంత్రి లోకేశ్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. సత్వ కంపెనీ ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్కు నిర్మిస్తుంది. ఐటీ టవర్లతో పాటు రెసిడెన్షియల్ ప్లాట్లు, రెస్టారెంట్, హోటల్ వంటివి ఇందులో ఉన్నాయి. అదేవిధంగా ఇమ్మాజినోటివ్, ఫ్లూయెంట్ గ్రిడ్ సంస్థలు మెగా ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తాయి. నాన్‌రెల్ టెక్నాలజీస్, ఏసీఎన్ ఇన్ఫోటెక్, మదర్‌సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ సంస్థలకు కూడా భూమిపూజ చేస్తారు.