Heavy Lift Rocket: రేపు నింగిలోకి బ్లూబర్డ్ బ్లాక్ 2
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:29 AM
అత్యంత బరువైన ఉపగ్రహాలను మోసుకెళ్లే ఇస్రో ఎల్వీఎం3 రాకెట్ మరోసారి ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి...
భారీ ఉపగ్రహాన్ని మోసుకెళ్లేందుకు ఎల్వీఎం3-ఎం6 రాకెట్ సిద్ధం
నేటి ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట/తిరుమల, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అత్యంత బరువైన ఉపగ్రహాలను మోసుకెళ్లే ఇస్రో ఎల్వీఎం3 రాకెట్ మరోసారి ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి బుధవారం ఉదయం 8.54 గంటలకు ఎల్వీఎం3-ఎం6 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) సోమవారం తెల్లవారుజామున నిర్వహించారు. అనంతరం రాత్రి షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (లాబ్) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. మంగళవారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభిస్తారు. ప్రయోగం ప్రారంభమైన 15.07 నిమిషాల్లో ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెడతారు. ప్రయోగ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ నారాయణన్ సోమవారం ఉదయం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో పూజలు చేశారు. అలాగే శాస్త్రవేత్తల బృందంతో కలిసి రాకెట్ నమూనాను తిరుమల శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఇదో వాణిజ్య ప్రయోగమని చెప్పారు. 2027లో గగన్‌యాన్ ప్రారంభవుతుందన్నారు.