ఇనచార్జి ఉన్నట్లా.. లేనట్లా..?
ABN , Publish Date - Jul 04 , 2025 | 11:32 PM
ఆలూరు నియోజకవర్గం టీడీపీలో శ్రేణుల్లో అయోమయం నెలకొంది. నియోజకవర్గం ఇనచార్జి వీరభద్రగౌడ్ ఉన్నట్లా.. లేనట్లా..? ఇనచార్జి, సీనియర్ నాయకులు లేకుండానే శుక్రవారం నియోజకవర్గంలో టీడీపీ ప్రొగ్రామ్స్ కోఆర్డినేటర్లు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పార్టీ పరిశీలకుడు, అనంతపురం జిల్లాకు చెందిన పూల నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి ‘తొలి అడుగు’ కార్యక్రమాలు దేవనకొండ, చిప్పగిరి మండలాల్లో నిర్వహించడం రాజకీయ చర్చకు తెరలేచింది.
ఆలూరులో అయోమయంలో తెలుగు తమ్ముళ్లు
ఇనచార్జి, సీనియర్ నాయకులు లేకుండా ‘తొలి అడుగు’
ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్లుగా ఇనచార్జి మంత్రి నిమ్మల, ఎంపీ నాగరాజు, పరిశీలకుడు నాగరాజు
కర్నూలు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఆలూరు నియోజకవర్గం టీడీపీలో శ్రేణుల్లో అయోమయం నెలకొంది. నియోజకవర్గం ఇనచార్జి వీరభద్రగౌడ్ ఉన్నట్లా.. లేనట్లా..? ఇనచార్జి, సీనియర్ నాయకులు లేకుండానే శుక్రవారం నియోజకవర్గంలో టీడీపీ ప్రొగ్రామ్స్ కోఆర్డినేటర్లు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పార్టీ పరిశీలకుడు, అనంతపురం జిల్లాకు చెందిన పూల నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి ‘తొలి అడుగు’ కార్యక్రమాలు దేవనకొండ, చిప్పగిరి మండలాల్లో నిర్వహించడం రాజకీయ చర్చకు తెరలేచింది. నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లలో ఏ ఇద్దరు కలసినా ఇదే చర్చ. పార్టీ సారథి లేకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది దేనికి సంకేతమని పేర్కొంటున్నారు.
తారాస్థాయికి..
ఆలూరు నియోజకవర్గం టీడీపీలో వర్గవిభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ పోటీ చేసి కేవలం మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ ఇనచార్జిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో బి.వీరభద్రగౌడ్‌ను కాదని, ఆ ఎన్నికల ముందే టీడీపీలో చేరిన కోట్ల సుజాతమ్మకు అధినేత చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఆమె కూడా ఓటమి చెందారు. టీడీపీ క్యాడర్ బలంగా ఉన్నా పార్టీ నేతల్లో వర్గవిభేదాలతో రెండు పర్యాయాలు టీడీపీ ఓటమి చెందిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ ఇనచార్జిగా కోట్ల సుజాతమ్మ ఉంటూ యువగళం పేరిట యువనేత నారా లోకేశ చేపట్టిన పాదయాత్ర, అధినేత చంద్రబాబు నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమాలు సక్సెస్ చేశారు. 2024 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీలో వర్గవిభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. కోట్ల సుజాతమ్మకు కాకుండా మాలో ఒకరికి టికెట్ ఇవ్వాలంటూ పార్టీ నేతలు వీరభద్రగౌడ్, వైకుంఠం మల్లికార్జున, కప్పట్రాళ్ల బొజ్జమ్మ జట్టుకట్టారు. రాజకీయ సమీకరణాల దృష్ట్యా కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డికి డోన టికెట్ ఇవ్వడంతో, వీరభద్రగౌడ్‌ను అధిష్టానం ఆలూరు నుంచి బరిలో దింపింది. టికెట్ కోసం జట్టు కట్టిన నాయకుల మధ్య విభేదాలు మళ్లీ మొదలయ్యాయి. రాష్ట్రంలో కూటమి విజయ సునామీ సృష్టిస్తే ఆలూరులో మాత్రం స్వల్ప తేడాతో ఓటమి చెందాల్సి వచ్చింది.
సమన్వయంతో ముందుకెళ్లాల్సిన నాయకులే..
సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన నాయకులు విభేదాల్లో హద్దులు దాటుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వీరభద్రగౌడే టీడీపీ ఇనచార్జిగా కొనసాగుతున్నారు. ఆయన నాయకత్వాన్ని పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వైకుంఠం ప్రసాద్, గత ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించిన వైకుంఠం జ్యోతి, ఎన్నికల ముందు వైసీపీ టికెట్ ఆశించి భంగపడి, తిరిగి టీడీపీలో చేరిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ సహా ఆలూరు, ఆస్పరి, హోళగుంద మండలాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, వైకుంఠం వర్గీయులు ఇనచార్జి వీరభద్రగౌడ్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. త్వరలో తమకు ఇనచార్జి బాధ్యతలు కూడా వస్తాయని వైకుంఠం ప్రసాద్, జ్యోతి దంపతులు బాహాటంగానే చెబుతున్నారు. వీరభద్రగౌడ్, వైకుంఠం వర్గాల మధ్య విభేదాలతో పార్టీ కార్యకర్తలు సైలెంట్ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాయకుల మధ్య సమన్వయం చేసి పార్టీ కార్యక్రమాలను సమష్టగా నిర్వహించేలా అధిష్టానం జిల్లా ఇనచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, నియోజకవర్గం పరిశీలకుడు పూల నాగరాజును ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్లుగా నియమించింది. ‘తొలి అడుగు’ను దేవనకొండ, చిప్పగిరి మండలాల్లో పి.తిక్కారెడ్డి, బస్తిపాటి నాగరాజు, పూల నాగరాజు, కప్పట్రాళ్ల బొజ్జమ్మ నిర్వహించడం టీడీపీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తుంది. అలూరు నియోజకవర్గానికి టీడీపీ ఇనచార్జి ఉన్నట్లా.. లేనట్లా..? అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.