పీఏనా మజాకా!
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:02 AM
ఆయన ఓ ఎన్‌ఆర్‌ఐ ఎమ్మెల్యే దగ్గర పీఏ. ఎమ్మెల్యే కార్యాలయం వ్యవహారాలు అన్నీ ఆయనే చూస్తాడు. ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా అక్కడి పరిస్థితులు ఉన్నాయి. ఇదే అదనుగా భావించిన ఆయన పైసా వసూల్ ప్రారంభించాడు. అనతికాలంలోనే కోట్ల రూపాయలు దండుకున్నాడు. విషయం గమనించిన ఎమ్మెల్యే అతని వ్యవహారాలపై నిఘా పెట్టడంతో నివ్వెరపోయే విషయాలు వెలుగుచూశాయి.
- ఎన్‌ఆర్‌ఐ ఎమ్మెల్యే నియోజకవర్గంలో భారీగా వసూళ్లు
- రూ.10 కోట్లు దాటిన అక్రమాస్తులు
- అవినీతిపై నిఘా పెట్టిన ఎమ్మెల్యే కార్యాలయం
- వెలుగుచూసిన అనేక వ్యవహారాలు
- రూ.7 కోట్లకు తేలిన లెక్కలు.. తేలాల్సినవి మరెన్నో..
- వాటాల పంపకంలో వచ్చిన తేడాలతో విషయం బయటకు..
ఆయన ఓ ఎన్‌ఆర్‌ఐ ఎమ్మెల్యే దగ్గర పీఏ. ఎమ్మెల్యే కార్యాలయం వ్యవహారాలు అన్నీ ఆయనే చూస్తాడు. ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా అక్కడి పరిస్థితులు ఉన్నాయి. ఇదే అదనుగా భావించిన ఆయన పైసా వసూల్ ప్రారంభించాడు. అనతికాలంలోనే కోట్ల రూపాయలు దండుకున్నాడు. విషయం గమనించిన ఎమ్మెల్యే అతని వ్యవహారాలపై నిఘా పెట్టడంతో నివ్వెరపోయే విషయాలు వెలుగుచూశాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఇంద్రుడు-చంద్రుడు సినిమాలో పీఏ త్రిపాఠి క్యారెక్టర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. నిత్యం నోట్ల కట్టలను పోగు చేయనిదే అతనికి నిద్రపట్టదు. అచ్చు అలాంటి వ్యక్తే ఉమ్మడి కృష్ణాజిల్లాలోనూ ఉన్నాడు. ఓ ఎన్‌ఆర్‌ఐ ఎమ్మెల్యే దగ్గర పీఏగా పనిచేస్తున్న సదరు వ్యక్తి కూడబెట్టిన ఆస్తులను చూసి ఆ ఎమ్మెల్యేనే ఖంగుతిన్నాడు. రెండు, మూడు సార్లు మందలించినా ఆయనలో మార్పు రాకపోగా, మరింతగా రెచ్చిపోయాడు. పీఏ వ్యవహారాలపై రహస్య నిఘా పెట్టిన ఎమ్మెల్యేకు నివ్వెరపోయే విషయాలు వెలుగుచూశాయి. భారీగా ఆస్తులు కూడబెట్టుకోవడం, భూమిని కొనుగోలు చేసి డెవలప్‌మెంట్‌కు ఇవ్వడం వంటివి బయటకు రావడంతో పీఏను కూర్చోబెట్టి లెక్కలు తేల్చారు. కొంతమేర లెక్కలు బయటకు వచ్చాయి. ఇంకా తేలాల్సినవి అనేకం ఉన్నాయి. దీంతో నోట్ల కట్టలు దిగమింగిన పీఏ సంగతి తేల్చే పనిలో పడ్డారు.
పీఏ బాధ్యతలు వేరొకరికి అప్పగింత
తన కార్యాలయంలో పనిచేసే వారిలో ఒక్కొక్కరూ ఒక్కో చరిత్రను కలిగి ఉండటంతో గంపగుత్తగా అందర్నీ మార్చేయాలని ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి నాటికి తన ట్రస్టుకు సంబంధించిన ఉద్యోగులతో కార్యాలయాన్ని రీ ప్లేస్ చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అప్పటి వరకు పీఏ బాధ్యతలను పసుపు దళంలో క్రియాశీలకంగా వ్యవహరించే వ్యక్తికి అప్పగించటం హాట్ టాపిక్‌గా మారింది. కొద్ది రోజులుగా పసుపు దళ నేత ఎమ్మెల్యే కార్యాలయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే ఆఫీసులో పనిచేసే వారిలో సింహభాగం వసూల్ రాజాలు ఉన్నారు. ఎమ్మెల్యేకు పీఏగా పనిచేస్తున్న వ్యక్తి ఈ స్థాయిలో ఆస్తులు ఎలా కూడబెట్టాడన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది.
ధర నిర్ణయించి మరీ వసూళ్లు!
నియోజకవర్గంలో పోస్టింగ్‌లు, బదిలీల వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే పీఏనే చూసేవారు. పోస్టింగ్‌లు, బదిలీలకు ధర నిర్ణయించి వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమంగా వసూళ్లకు పాల్పడటం ద్వారా భారీగా ఆర్జించినట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా రెవెన్యూ, రిజిస్ర్టేషన్స్, పోలీస్ స్టేషన్స్, ఎక్సైజ్, మైనింగ్, మార్కెటింగ్ తదితర శాఖల నుంచి వారం వారం వసూళ్లకు కూడా తెరతీసినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో చెరువుల తవ్వకాలు, ఇతర అవసరాలకు మట్టి తరలింపునకు అనుమతుల పేరుతో కూడా భారీగా దందా నడిపినట్టు సమాచారం. రేషన్ బియ్యం మాఫియాతో కూడా సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి వ్యాపారానికి షాడోగా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో బెల్ట్ షాపులకు పరోక్షంగా అనుమతులు ఇస్తూ భారీగా వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ధాన్యం మిల్లర్లను వదల్లేదు!
రైతుల నుంచి కొనే ధాన్యం బస్తాకు రూ.10 చొప్పున ఇవ్వాలని పీఏ ధాన్యం మిల్లర్లకు ఆదేశాలు ఇవ్వడంతో కొంతమంది చెల్లించారు. మరికొంత మంది మిల్లర్లు ఇవ్వలేదు. ఇవ్వలేని మిల్లర్లను రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయకుండా అడ్డుకున్నట్టు తెలిసింది. ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ ఆ నియోజకవర్గంలో పక్షం రోజుల పాటు ఉండి రైతులు పండించిన ధాన్యం బస్తాలను 22 రైల్వే వ్యాగన్‌ల ద్వారా కాకినాడ జిల్లా పెద్దాపురంలోని రైస్ మిల్లులకు తరలించారు. కలెక్టర్, జేసీలు అండగా నిలబడకపోతే రైతులు తమ ధాన్యాన్ని కూడా అమ్ముకోలేని పరిస్థితి నెలకొనేది.
భూ వివాదాల్లో తలదూర్చి..
చివరకు పలు వివాదాలను కూడా ఎమ్మెల్యే పీఏ తన ఆదాయ వనరుగా మార్చుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. భూ వివాదాల్లో సైతం తలదూర్చి డబ్బులిచ్చిన వారికే కొమ్ము కాసినట్టు పలు ఫిర్యాదులు కూడా ఉన్నాయి. పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకాన్ని కూడా తనకు కాసులు కురిపించే పథకంగా మార్చుకున్నాడని సమాచారం. ఫీల్డ్ అసిస్టెంట్లు వారం వారం డబ్బులు ఇవ్వాల్సిందేనని ఆదేశించినట్టు తెలిసింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టే ఏ కాంట్రాక్టర్ అయినా కూడా పీఏను సంతృప్తి పరచాల్సిందేనని సమాచారం. కమీషన్లు ఇచ్చుకో.. పనులు పుచ్చుకో అన్నట్టుగా వ్యవహారం నడిచినట్టు తెలిసింది. మునిసిపల్ కార్యాలయాన్ని కూడా తన అవినీతికి వేదికగా చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రణాళిక, ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాల నుంచి కూడా ముడుపులు వసూలు చేసినట్టు సమాచారం. రైతు బజార్లలో కూడా షాపుల వాళ్ల నుంచి వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువుగా పేద, మధ్య తరగతి వర్గాలనే టార్గెట్‌గా చేసుకుని కార్యాలయానికి పనుల కోసం వచ్చిన వారి నుంచి కూడా వసూళ్ల పర్వం సాగించినట్టు ఫిర్యాదులున్నాయి.
వ్యక్తిగత ఆస్తులు పెరిగిపోతుండటంతో అనుమానం
పీఏ వ్యక్తిగత ఆస్తులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో సదరు ఎమ్మెల్యేకి అనుమానం వచ్చింది. వెంటనే ఆయన నిఘా పెట్టారు. రూ.10 కోట్ల వరకు అక్రమంగా వసూళ్లకు పాల్పడినట్టుగా ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. పీఏను కూర్చోబెట్టి లెక్కించగా రూ.7 కోట్ల వరకు లెక్కలు తేలినట్టు తెలిసింది. ఇంత భారీ ఎత్తున పీఏ ఆస్తులు కూడబెట్టుకోవటం చూస్తే.. కనిపించని వసూళ్లు ఇంకా ఎంత ఉన్నాయి ? ఎవరెవరికి పంపకాలు జరిగాయి ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంక్రాంతి నుంచి ఆఫీసులో కొత్త ముఖాలు!
ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేస్తున్న వారు వివిధ వివాదాల్లో ఉండటం.. రూ.కోట్లు కూడబెట్టుకుంటుండటంతో ఎమ్మెల్యేకు చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశ్యంతో అందరినీ వెళ్లిపొమ్మన ్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి నాటికి తమ ట్రస్టు ఉద్యోగులను తెచ్చుకునేందుకు ఆయన ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.
వాటాల పంపకంలో గొడవలు వచ్చాయా!
ఈ మొత్తం వ్యవహారంలో వాటాల పంపకం దగ్గర గొడవలు వచ్చాయా అన్న చర్చ నడుస్తోంది. అవినీతి లెక్కలు చెప్పిన పీఏ.. డీవీ మానర్ దగ్గర గెస్ట్‌హౌస్ సంగతులు, ఇతర వ్యవహారాలన్నీ తాను బయటపెడతానని, చిట్టా విప్పితే మీ పరువే పోతుందంటూ కొంతమంది దగ్గర హెచ్చరించినట్టు తెలుస్తోంది.
కొత్త పీఏగా పసుపుదళ నేత!
పసుపు దళంలో పనిచేస్తున్న ఒక నాయకుడిని సరికొత్త పీఏగా నియమించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం అందరికీ వెంటనే తెలియకుండా రహస్యంగా ఉంచినట్టు సమాచారం. ఆ నేత కూడా గతంలో ఎమ్మెల్యేగా సదరు ఎన్‌ఆర్‌ఐ ఎంపికకు వ్యతిరేకంగా పోరాడాడు. ఎమ్మెల్యేగా గెలిచాక.. ఇక తప్పక నమ్మినబంటుగా మారిపోయాడని తెలుస్తోంది.