Share News

ముడా ఉనికినే కోల్పోతుందా!

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:46 AM

మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. మచిలీపట్నం పోర్టుకు అవసరమైన భూములను సేకరించడం, కొనుగోలు చేయడం వంటి పనులు పూర్తయిన తర్వాత ముడాలోని అధికారులందరూ బదిలీపై వెళ్లిపోయారు. పోర్టు నిర్మాణానికి భూముల కేటాయింపు అనంతరం ముడాలోని టౌన్‌ ప్లానింగ్‌, ఒకటీ రెండు విభాగాలు మినహా ఇతర విభాగాలకు అంతగా పనిలేకుండా పోయింది. సీఆర్‌డీఏ పరిధిలో లేని ప్రాంతాలను ముడా పరిధిలోకి తెచ్చి టౌన్‌ ప్లానింగ్‌, బిల్డర్‌లకు లైసెన్సులు జారీ చేయడం, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు అనుమతులు ఇవ్వడానికి ముడా పరిమితమైందనే వాదన వినిపిస్తోంది. ఈక్రమంలో ఏపీ మినరల్‌ కార్పొరేషన్‌ నుంచి తీసుకున్న రూ.200 కోట్ల అప్పు తీర్చలేక భూములు తీసుకోమని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

ముడా ఉనికినే కోల్పోతుందా!

-భూముల కొనుగోలుకు ఏపీ మినరల్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.200 కోట్ల అప్పు

- తీర్చాలని కొంతకాలంగా పెరిగిన ఒత్తిడి

- తీర్చలేము.. భూములు తీసుకోవాలని నెల కిందట లేఖ

- ఖాళీగా చైర్మన్‌ పదవి.. ఆశావహుల ఎదురుచూపు

మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. మచిలీపట్నం పోర్టుకు అవసరమైన భూములను సేకరించడం, కొనుగోలు చేయడం వంటి పనులు పూర్తయిన తర్వాత ముడాలోని అధికారులందరూ బదిలీపై వెళ్లిపోయారు. పోర్టు నిర్మాణానికి భూముల కేటాయింపు అనంతరం ముడాలోని టౌన్‌ ప్లానింగ్‌, ఒకటీ రెండు విభాగాలు మినహా ఇతర విభాగాలకు అంతగా పనిలేకుండా పోయింది. సీఆర్‌డీఏ పరిధిలో లేని ప్రాంతాలను ముడా పరిధిలోకి తెచ్చి టౌన్‌ ప్లానింగ్‌, బిల్డర్‌లకు లైసెన్సులు జారీ చేయడం, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు అనుమతులు ఇవ్వడానికి ముడా పరిమితమైందనే వాదన వినిపిస్తోంది. ఈక్రమంలో ఏపీ మినరల్‌ కార్పొరేషన్‌ నుంచి తీసుకున్న రూ.200 కోట్ల అప్పు తీర్చలేక భూములు తీసుకోమని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమి కొనుగోలు నిమిత్తం 2018లో అప్పటి ప్రభుత్వం ఏపీ మినరల్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.200 కోట్లను ముడాకు రుణంగా ఇప్పించింది. ఇందులో రూ.160 కోట్లతో భూములను కొనుగోలు చేశారు. మిగిలిన రూ.40 కోట్లలో రూ.20 కోట్లను అధికారులు, సిబ్బంది జీతాలకు ఖర్చు చేయగా, మరో రూ.20 కోట్లతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణానికి కేటాయించుకున్నారు. దీంతో ముడా వద్ద ఉన్న ఖజానా ఖాళీ అయ్యింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది, అధికారులకు జీతాలు చెల్లించేందుకు నెలనెలా వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

మినరల్‌ కార్పొరేషన్‌ నుంచి ముడాకు లేఖలు

ఏపీ మినరల్‌ కార్పొరేషన్‌ అధికారులు తమ నుంచి తీసుకున్న రూ.200 కోట్ల రుణంతోపాటు, వడ్డీ కూడా చెల్లించాలని, అడిట్‌ అభ్యంతరాలు వస్తున్నాయని పదేపదే ముడాకు లేఖలు రాస్తున్నారు. దీంతో ఇటీవల ముడా అధికారులు తమ వద్ద నగదు లేదని, మీ వద్ద తీసుకున్న రుణంతో భూములు కొనుగోలు చేశామని, ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని నెలరోజుల క్రితం లేఖ రాయడం గమనార్హం. సీఆర్‌డీఏ పరిధిలోలేని మచిలీపట్నం, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, ఏలూరు జిల్లా పరిధిలోని ముదినేపల్లి, కైకలూరు తదితర మండలాల్లో లే ఆవుట్‌లు, గృహ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ వచ్చే ఆదాయంతోనే నెట్టుకోస్తోంది. వచ్చే ఆదాయం సిబ్బంది జీతభత్యాలకు చెల్లించేందుకు సరిపోవడం లేదని ముడా అధికారులు చెబుతున్నారు.

9 నెలలే ముడా చైర్మన్‌ పదవిలో..

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీకి చెందిన మట్టా ప్రసాద్‌ను ముడా చైర్మన్‌గా నియమించింది. 2024 నవబంరు 20వతేదీన ఆయన బాధ్యతలు స్వీకరించారు. తొమ్మిది నెలల పాటు ఈ పదవిలో కొనసాగిన ఆయన తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయనను నియమించడంతో ముడా చైర్మన్‌ పదవిని వదులుకున్నారనే ప్రచారం జరిగింది. దీంతో ముడా వైస్‌ చైర్మన్‌గా జేసీ ఎం.నవీన్‌కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు.

చైర్మన్‌ పదవి కోసం పోటాపోటీ

ముడా చైర్మన్‌ పదవి ఖాళీ కావడంతో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు ఈ పదవి కోసం తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. కూటమి పొత్తులో భాగంగా ముడా చైర్మన్‌ పదవిని మళ్లీ బీజేపీ నాయకులకే కేటాయిస్తారని టీడీపీ, జనసేన నాయకులు అంటున్నారు. అయితే మచిలీపట్నానికి చెందిన వారికి ఈ పదవిని ఇస్తారా లేక జిల్లాలోని వేరే ప్రాంతానికి చెందిన బీజీపీ నాయకులకు కేటాయిస్తారా అనే అంశంపై స్పష్టత కొరవడింది. మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ఇటీవల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మచిలలీపట్నంలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణకు బీజేపీ నాయకులు ప్రయత్నం చేశారు. వాజ్‌పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదని టీడీపీ నాయకులు అడ్డుచెప్పారు. ఈ అంశం వివాదాస్పదం కావడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ విషయంపై దృష్టి సారించింది. మంత్రి నారా లోకేశ్‌ను మచిలీపట్నం తీసుకువచ్చి వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించేలా తెరవెనుక చక్రం తిప్పారనే ప్రచారం జరిగింది. ఈ సమయంలోనే ముడా చైర్మన్‌ పదవిని బీజేపీకి కాకుండా టీడీపీలోని ఒక సీనియర్‌ నాయకుడికి కేటాయిస్తారనే అంశం తెరపైకి వచ్చింది. ఈ ప్రచారం స్థానికంగా జరిగేదేనని, కూటమి పొత్తులో భాగంలో ముడా చైర్మన్‌ బీజేపీకే కేటాయిస్తారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. దీంతో ముడా చైర్మన్‌ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబరు 9వ తేదీన మట్టా ప్రసాద్‌ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించగా, అప్పటి నుంచి ముడా చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు ఎవరి స్థాయిలో వారు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గతంలో గుడివాడకు చెందిన మట్టా ప్రసాద్‌కు ముడా చైర్మన్‌ పదవిని ఇచ్చారని, ఈ సారైనా మచిలీపట్నానికి చెందిన సీనియర్‌ నాయకులకు ముడా చైర్మన్‌ పదవిని ఇవ్వాలనే డిమాండ్‌ ఇటీవల కాలంలో ఊపందుకుంది. ముడా చైర్మన్‌ పదవిని బీజేపీకే ఇవ్వాలనే డిమాండ్‌తో జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

Updated Date - Dec 29 , 2025 | 12:46 AM