Minister Anita: జగన్... వైద్య కళాశాలల పర్యటనకు సిద్ధమా
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:00 AM
లండన్ మందులు వేసుకోకుండా మెడికల్ కళాశాలల గురించి జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.
వస్తానంటే పోలీసు రక్షణతో స్వయంగా తీసుకెళ్తా: మంత్రి అనిత
ఆయన లండన్ మందులు వేసుకోవడం లేదని ఎద్దేవా
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): లండన్ మందులు వేసుకోకుండా మెడికల్ కళాశాలల గురించి జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ నిర్మించానని చెపుతున్న 17 వైద్య కళాశాలల ప్రస్తుత పరిస్థితిపై వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒక్కో కళాశాల దుస్థితిని వివరిస్తూ... వాటిలో ఆహా అనేట్లు నిర్మించిన కళాశాల ఏం ఉందో చెప్పాలని నిలదీశారు. ‘బెంగళూరులో ఫుల్ టైమ్ ఉంటూ, ఏపీకి పార్ట్ టైమ్ వస్తున్న జగన్ బురద తెచ్చి ప్రభుత్వంపై చల్లుతున్నాడు. వైద్య కళాశాలలను పీపీపీ మోడ్‌లో నిర్మించడంపై ప్రజల్ని భయపెట్టే యత్నం చేస్తున్నాడు. కట్టడాలే లేకుండా ఆహా అనేలా 17 వైద్య కళాశాలలు కట్టేశామని చెప్పుకోవడం జగన్‌కే చెల్లింది. తాను నిర్మించానని చెబుతున్న 17 వైద్య కళాశాలల క్షేత్రస్థాయి పర్యటనకు జగన్ రాగలడా..? జగన్ సిద్ధమైతే పోలీసు భద్రతతో నేనే ఆయన్ను అక్కడికి తీసుకెళ్తా. సామాన్యులకు మెరుగైన వైద్య విద్య అందించాలనే కూటమి ప్రభుత్వ తపనను జగన్ రాజకీయం చేస్తున్నాడు’ అని అనిత విమర్శించారు.