BJP: మెడికల్ కాలేజీలపై చర్చకు సిద్ధమా జగన్
ABN , Publish Date - Oct 09 , 2025 | 06:23 AM
మీరు దురుద్దేశ పూర్వకంగా బురద జల్లుతున్న మెడికల్ కాలేజీల అంశంపై అసెంబ్లీ లేదా మీ సొంత టీవీ సాక్షిలో లైవ్ డిబేట్‌కు సిద్ధమా అని రాష్ట్ర బీజేపీ..
అసెంబ్లీ లేదా మీ సొంత టీవీ లైవ్‌లో: బీజేపీ సవాల్
అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ‘మీరు దురుద్దేశ పూర్వకంగా బురద జల్లుతున్న మెడికల్ కాలేజీల అంశంపై అసెంబ్లీ లేదా మీ సొంత టీవీ సాక్షిలో లైవ్ డిబేట్‌కు సిద్ధమా?’ అని రాష్ట్ర బీజేపీ.. మాజీ సీఎం జగన్‌కు సవాలు విసిరింది. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్ నారాయణ బుధవారం మీడియాతో మాట్లాడారు. వైద్య కళాశాలల్ని వైసీపీ ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేసిందో.. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు మంచి జరిగేలా ఎలాంటి చర్యలు చేపడుతోందో వైసీపీకి బలమున్న శాసనమండలిలో వివరిస్తే ఎందుకు పారిపోయారని నిలదీశారు. ఇప్పటికైనా మించి పోయింది లేదని, బురద రాజకీయాలు మానుకుని ప్రజలకు వాస్తవాలు చెబితే ఆ పదకొండైనా వచ్చే ఎన్నికల్లో మిగులుతాయని హితవు పలికారు.