ఉన్నట్టా.. లేనట్టా!
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:04 AM
కృష్ణాడెల్టాలో సాగునీటి కాల్వలు, డ్రెయినేజీల మరమ్మతు పనుల విషయంలో అయోమయం నెలకొంది. ఈ ఏడాదైనా సకాలంలో పనులు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. వీరికి మద్దతుగా జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు సైతం గళం విప్పారు. జలవనరులశాఖ అధికారులు మాత్రం మార్చి వరకు కాల్వల నిర్వహణ పనులు చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఆ తర్వాతే మరమ్మతు పనుల సంగతి చూస్తామంటున్నారు. దీంతో అసలు ఈ ఏడాది మరమ్మతు పనులు ఉన్నట్టా.. లేనట్టా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- కృష్ణాడెల్టాలో కాల్వల మరమ్మతు పనులపై అయోమయం!
- ఈ ఏడాదైనా పనులు చేయాలని రైతుల వేడుకోలు
- నిన్న డీఆర్‌సీ సమావేశంలోనూ దీనిపై చర్చ
- మార్చి వరకు ఓఅండ్‌ఎం పనులు చేస్తామంటున్న అధికారులు
- ఈ ఏడాది నిధుల విడుదలపై మీనమేషాలు
- ఏటా పనుల ఖరారు, అనుమతులు ఇవ్వడంలో జాప్యం
- అంచనాలకే పరిమితమైన అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల నిర్మాణం
కృష్ణాడెల్టాలో సాగునీటి కాల్వలు, డ్రెయినేజీల మరమ్మతు పనుల విషయంలో అయోమయం నెలకొంది. ఈ ఏడాదైనా సకాలంలో పనులు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. వీరికి మద్దతుగా జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు సైతం గళం విప్పారు. జలవనరులశాఖ అధికారులు మాత్రం మార్చి వరకు కాల్వల నిర్వహణ పనులు చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఆ తర్వాతే మరమ్మతు పనుల సంగతి చూస్తామంటున్నారు. దీంతో అసలు ఈ ఏడాది మరమ్మతు పనులు ఉన్నట్టా.. లేనట్టా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
కృష్ణాడెల్టాలో సాగునీటి కాల్వలు, డ్రెయినేజీల మరమ్మతు పనుల విషయం శుక్రవారం జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ ఏడాది పనులు చేయాలని శాసన సభ్యులు కోరారు. కానీ జలవనరులశాఖ అధికారులు మాత్రం 2026 మార్చి వరకు కాల్వల నిర్వహణ (ఓఅండ్‌ఎం) పనులు చేయాల్సి ఉందని, ఈ గడువు ముగిశాక, కాల్వల మరమ్మతులకు సంబంధించిన అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. ఏప్రిల్‌లో అంచనాలు తయారు చేస్తే మేలో ఆమోదం పొందుతాయి. పనులకు సంబంధించి టెండర్‌లు పిలిచి కాంట్రాక్టర్‌లకు పనులు అప్పగించేసరికి జూన్ వస్తుంది. ఈ నెలలో రుతు పవనాలు ప్రవేశించి వర్షాలు కురిసే సమయానికి ఎంతమేర పనులు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్ సీజన్‌లో తీర ప్రాంతంలో ఆలస్యంగా వరినాట్లు పూర్తి చేసిన పంటల సాగు, తాగునీటి అవసరాల కోసం జనవరి వరకు కాల్వలకు సాగునీటిని విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఆరు నెలలపాటు సాగునీటి కాల్వలు, ప్రధాన డ్రెయిన్‌లలో పనులు, మరమ్మతులు చేసేందుకు అవకాశం ఉన్నా ఎంతమేర అనుమతులు వస్తాయనేది సందిగ్ధంగా మారింది.
నెలరోజుల ముందే చెప్పేశారా!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. రైతులు ఈ సంఘాల్లో సభ్యులుగా ఉండటంతో పంట కాల్వలు, డ్రెయినేజీల్లో ఎక్కడెక్కడ పూడికతీత, గుర్రపు డెక్క, నాచు తదితరాలను తొలగిస్తే పంటలకు సాగునీరు అందుతుందో తెలుస్తుందనే ఉద్దేశంతో రూ.10 లక్షల వరకు పనులను నామినేషన్ పద్ధతిన సాగునీటి సంఘాలకు అప్పగించారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పడటంతో మొదటి ఏడాది కనుక కొద్దిపాటి నిధులతో సాగు నీటి సంఘాల అధ్యక్షులు పనులు చేశారు. ఈ వేసవిలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పంట కాల్వలు, డ్రెయినేజీల్లో పూర్తిస్థాయిలో పనులు చేయాలని సాగునీటి సంఘాల అధ్యక్షులు ప్రతిపాదనలు పెట్టారు. ఈ ఏడాది నిధుల కొరత కారణంగా ముందస్తుగానే అంచనాలు తయారు చేయవద్దని నెలరోజుల ముందే జలవనరులశాఖ అధికారులు తేల్చి చెప్పినట్లు సాగునీటి సంఘాల అధ్యక్షులు అంటున్నారు.
ఏటా నిధుల్లో కోత
ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి 2022-23 సంవత్సంలో జిల్లాలో ప్రధాన డ్రెయిన్‌లు, సాగు నీటి కాల్వల నిర్వహణ పనులకు రూ.50.87 కోట్లను కేటాయించారు. ఇందులో డ్రెయిన్‌ల పనులు చేసేందుకు రూ.17.25 కోట్లు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు సక్రమంగా చేయకుండా మమ అనిపించారు. దీంతో పంట చేతికొచ్చే సమయంలో సంభవించిన తుఫాను కారణంగా అప్పట్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2023-24 సంవత్సరంలో కేవలం రూ.26 కోట్లను మాత్రమే కేటాయించారు. జూలై వరకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించలేదు. 2025-26 సంవత్సరంలో నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయల చొప్పున జిల్లా మొత్తానికి కేవలం రూ.14 కోట్లు కేటాయించారు. తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులకు మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. అధికశాతం ఈ పనులను సాగునీటి సంఘాలకు అప్పగించి జూన్, జూలై నెలల్లో పనులు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. వచ్చే ఏడాది కూడా కాల్వల్లో తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులు మాత్రమే చేసేందుకు నిధులు విడుదల అవుతాయని, కాల్వల్లో పూడికతీత కోసం, మట్టి పనులకు, ఇతరత్రా పనులకు ఎలాంటి అంచనాలు తయారు చేయవద్దనే సంకేతాలు వెలువడినట్లు సాగునీటి సంఘాల అధ్యక్షులు చెబుతున్నారు. తూడు, గుర్రపు డెక్క నిర్మూలనకు సంబంధించిన పనులకు మేలోనే అనుమతులు ఇస్తే వర్షాలు రాకముందే రసాయనాలు పిచికారీ, ఇతరత్రా పనులు చేయడానికి అవకాశం ఉంటుందని, జూన్‌లో వర్షాలు కురిసిన తర్వాత అనుమతులు ఇస్తే ఉపయోగం ఉండ దని రైతులు, సాగునీటి సంఘాల అధ్యక్షులు అంటున్నారు.
అవుట్ ఫాల్ స్లూయిస్‌గేట్ల మరమ్మతులకు నిధులు విడుదలయ్యేనా!
అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, నాగాయలంక మండలాలు, మచిలీపట్నం సౌత మండలంలోని కొత్తపల్లె తుమ్మలపాలెం, మాలకాయలంక సమీపంలో ప్రధాన డ్రెయిన్‌లపై అవుట్‌ఫాల్ స్లూయిస్‌గేట్లు పది ఉన్నాయి. పొలాల నుంచి మురుగు నీరు సముద్రంలోకి వెళ్లేందుకు, సముద్రపు పోటు సమయంలో ఉప్పునీరు డ్రెయిన్‌ల ద్వారా పొలాల్లోకి చొచ్చుకు రాకుండా ఉండేలా గతంలో వీటిని నిర్మాణం చేశారు. పాలకాయతిప్ప, హంసలదీవి, నాలి, పాతఉపకాలి, గుల్లలమోద, మచిలీపట్నం నియోజకవర్గంలోని అవుట్‌పాల్‌స్లూయిస్‌లు పూర్తిగా పాడైపోయాయి. అవనిగడ్డ నియోజకవర్గంలోని అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల నిర్మాణానికి రూ.38 కోట్లతో అంచనాలు రూపొందించారు ఈ అంచనాలు ఏళ్ల తరబడి కాగితాలకే పరిమిత మయ్యాయి. మొంథా తుఫాను సమయంలో పాడైన పంటలను పరిశీలించేందుకు కోడూరు మండలం వచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు రైతులు అవుట్‌ఫాల్ స్లూయిస్ స్థితిగతులను వివరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల మరమ్మతుల అంశాన్ని ప్రస్తావించారు. శుక్రవారం జరిగిన డీఆర్‌సీ సమావేశంలో ఎమ్మెల్యే మండలి అవుట్‌ఫాల్ స్లూయిస్‌లు బాగుచేయకుంటే ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో తీరప్రాంతంలోకి ఉప్పునీరు చొచ్చుకువచ్చే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గంలో అవుట్‌ఫాల్ స్లూయిస్ మరమ్మతులపై ఇంతవరకు తనతో ఎందుకు చర్చించలేదని జలవనరులశాఖ అధికారులను డీఆర్‌సీ సమావేశంలో నిలదీశారు. కృత్తివెన్ను మండలం పెదలంక డ్రెయిన్ 3.23 కిలోమీటరు వద్ద అవుట్‌ఫాల్ స్లూయిస్ నిర్మాణానికి రూ.40 కోట్లతో అంచనాలు రూపొందించారు. టెండర్ ప్రక్రియ దాదాపు పూర్తయింది కానీ ఈ పనులు మాత్రం చేయడంలేదు. ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రారంభమై గిలకలదిండి వరకు 72 కిలో మీటర్లకు పైగా బందరు పంట కాలువ ఉంది. దీంతో పాటు అప్పర్ పుల్లేరు, రామరాజుపాలెం చానల్ ఆధునికీకరణ పనులు చేసేందుకు గతంలో రూ.697.20 కోట్లతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ పనులు చేస్తారా లేదా అనే అంశంపైనా స్పష్టతలేదు.