Share News

కాలువల్లో పనులు చేశాకే.. సాగునీరు విడుదల చేయాలి

ABN , Publish Date - Jun 04 , 2025 | 01:05 AM

‘‘పంట కాలువల్లో, డ్రెయినేజీల్లో గుర్రపు డెక్క, నాచు, కిక్కిస, తూడు పెరిగిపోయాయి. కాలువల్లో ఇప్పటి వరకు పూడికతీత, కాలువల నిర్వహణ (ఓఅండ్‌ఎం) పనులు ప్రారంభించనేలేదు. ఇలాంటి స్థితిలో కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేస్తే అన్ని ప్రాంతాలకు సకాలంలో నీరు చేరదు. కాలువల్లో పనులు చేశాకే సాగునీటిని విడుదల చేయాలి’’ అంటూ జిల్లాలోని ఎమ్మెల్యేలు, సాగు నీటి సంఘాల అధ్యక్షులు డిమాండ్‌ చేశారు. మంగళవారం జెడ్పీ సమావేశపు హాలులో 42వ సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం కలెక్టర్‌ బాలాజీ అధ్యక్షతన నిర్వహించారు. గన్నవరం, పామర్రు, పెడన ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్‌రాజా, కాగిత కృష్ణప్రసాద్‌ తమ నియోజకవర్గాల్లో పంట కాలువలు, డ్రెయినేజీ దుస్థితిని సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ నెల 10వ తేదీన కృష్ణాడెల్టాకు సాగు నీటిని విడుదల చేస్తే ఉపయోగం ఉండదని, కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూడు తదితరాలను తొలగించే పనులు పూర్తి చేసి, ఆ తర్వాతే సాగునీటిని విడుదల చేస్తే ఉపయోగం ఉంటుందని స్పష్టం చేశారు.

కాలువల్లో పనులు చేశాకే.. సాగునీరు విడుదల చేయాలి

- పంట కాలువలు, బుడమేరు గండ్లు పూడ్చకుంటే సాగు ప్రశ్నార్థకమే!

- డ్రెయిన్లలో పూడిక తీయకుంటే పంటలు మునిగిపోవడం ఖాయం

- సాగునీటి సలహామండలి సమావేశంలో ఎమ్మెల్యేలు, సాగునీటి సంఘాల అధ్యక్షులు

- 10న సాగునీరు విడుదల చేసే అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్ణయం

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

‘‘పంట కాలువల్లో, డ్రెయినేజీల్లో గుర్రపు డెక్క, నాచు, కిక్కిస, తూడు పెరిగిపోయాయి. కాలువల్లో ఇప్పటి వరకు పూడికతీత, కాలువల నిర్వహణ (ఓఅండ్‌ఎం) పనులు ప్రారంభించనేలేదు. ఇలాంటి స్థితిలో కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేస్తే అన్ని ప్రాంతాలకు సకాలంలో నీరు చేరదు. కాలువల్లో పనులు చేశాకే సాగునీటిని విడుదల చేయాలి’’ అంటూ జిల్లాలోని ఎమ్మెల్యేలు, సాగు నీటి సంఘాల అధ్యక్షులు డిమాండ్‌ చేశారు. మంగళవారం జెడ్పీ సమావేశపు హాలులో 42వ సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం కలెక్టర్‌ బాలాజీ అధ్యక్షతన నిర్వహించారు. గన్నవరం, పామర్రు, పెడన ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్‌రాజా, కాగిత కృష్ణప్రసాద్‌ తమ నియోజకవర్గాల్లో పంట కాలువలు, డ్రెయినేజీ దుస్థితిని సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ నెల 10వ తేదీన కృష్ణాడెల్టాకు సాగు నీటిని విడుదల చేస్తే ఉపయోగం ఉండదని, కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూడు తదితరాలను తొలగించే పనులు పూర్తి చేసి, ఆ తర్వాతే సాగునీటిని విడుదల చేస్తే ఉపయోగం ఉంటుందని స్పష్టం చేశారు.

10న నీటి విడుదలపై సందిగ్ధం

జిల్లాకు సాగు నీటిని ఈనెల 10వ తేదీన విడుదల చేయాలని కోరుతూ తీర్మానం చేయాలని సాగునీటి సలహా మండలి సమావేశంలో పాల్గొన్న సభ్యులంతా తొలుత సూచించారు. అయితే పంట కాలువలు, డ్రెయినేజీల్లో ఓఅండ్‌ఎం పనులు చేయకపోవడంతో కాలువల్లో తూడు, గుర్రపుడెక్క తదితరాలు పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నాయనే అంశం చర్చకు వచ్చింది. దీంతో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంట్రావుమాట్లాడుతూ పంట కాలువల్లో అసలు పనులు ప్రారంభించకుండా సాగునీటిని విడుదల చేస్తే ఎంతమేర ఉపయోగం ఉంటుందనే అంశంపై అధికారులు సమాధానం చెప్పాలన్నారు. రామవరప్పాడు కాలువ పరిధిలో 48వేల ఎకరాల ఆయకట్టు ఉందని, 1,600 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రవహించే ఈ కాలువ వెయ్యి క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని కూడా తట్టుకునేస్థితిలో లేదన్నారు. దీంతో ఈ కాలువ ద్వారా సాగునీరు ఎంతమేర పొలాలకు చేరుతుందని ప్రశ్నించారు. బుడమేరుకు ఎనిమిది చోట్ల గండ్లు ఉన్నాయని, వాటిని ఎప్పటిలోగా పూడుస్తారని నిలదీశారు. గండ్లు పూడ్చడానికి రూ.2.30 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారని, ఈ నిధులు ఎప్పటికి విడుదల అవుతాయి, ఎప్పటికి పనులు పూర్తిచేయిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ నిధుల విడుదలకు నీటిపారుదలశాఖ ఎస్‌ఈ ప్రతిపాదనలు పంపారా, సంబందిత శాఖ మంత్రికి వివరించారా లేదా ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో ఇస్తామని చెబితే కాంట్రాక్టర్లను ఒప్పించి పనులు చేయిస్తానన్నారు. బొడ్డపాడు, ఎనికేపాడు, ఉంగుటూరు తదితర ప్రాంతాల్లో తొమ్మిది చోట్ల కాలువలకు గండ్లు ఉన్నాయని, వాటిని పూడ్చేందుకు రూ.3 కోట్లు అవసరమని, పనులు చేసేందుకు నిధులు అందుబాటులో ఉన్నాయా లేవా అన్ని ప్రశ్నించారు.

పామర్రులో పూడిపోయిన ప్రధాన డ్రెయున్లు

పామర్రు నియోజకవర్గంలో ప్రధాన డ్రెయిన్‌లు, పంట కాలువలు ఉన్నాయని, వాటిలో కనీస పూడిక తీత పనులు ఇంతవరకు చేయలేదని పామర్రు ఎమెల్యే వర్ల కుమార్‌రాజా సమావేశం దృష్టికి తెచ్చారు. నియోజకవర్గంలో ఆయకట్టు అధికంగా ఉందని, గుడివాడ, పెడన, అవనిగడ్డ, బందరు నియోజకవర్గాలకు ఈ నియోజకవర్గంలో నుంచే సాగునీరు వెళుతుందని తెలిపారు. కంకిపాడు వద్ద లాకులు శిథిలావస్థకు చేరాయని, వాటికి కనీస మరమ్మతులు చేయాలని కోరారు. ప్రఽధాన కాలువలకు సంబంధించి రెగ్యులేటర్లు, లాకులు సక్రమంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పెడన నియోజకవర్గానికి ముందస్తుగా నీరు విడుదల చేయాలి

పెడన నియోజకవర్గం కాలువ శివారు ప్రాంతంలో ఉండటంతో ముందుస్తుగానే వెదజల్లే పద్ధతిన రైతులు వరి నాట్లు పూర్తి చేస్తారని, పూర్తిగా వరి సాగుపైనే రైతులు ఆధారపడి ఉన్నారని, పెడన నియోజకవర్గానికి ముందస్తుగానే సాగు నీటిని విడుదల చేయాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌ కోరారు. అర్తమూరు, కృత్తివెన్ను, పెందుర్రు, నాగేశ్వరరావుపేట, వడ్లమన్నాడు, ఇసుకపర్ర డ్రెయిన్‌లలో పూడికతీత పనులు అసలు చేయలేదన్నారు. ఈ పనులు వెంటనే చేయాలని అధికారులకు సూచించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేసేందుకు ఆటంకాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

కలెక్టర్‌ ఫోన్‌ చేస్తే గాని పనులు చేయరా!

పామర్రు నియోజకవర్గంలోని ఐనంపూడి, కొమరవోలు డ్రెయినేజీల్లో కాంట్రాక్టర్‌ ఇంకా పనులు ప్రారంభించలేదని ఎమ్మెల్యే కుమార్‌ రాజా, సాగు నీటి నంఘాల అధ్యక్షులు కలెక్టర్‌ బాలాజీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై కలెక్టర్‌ బాలాజీ అధికారులను నిలదీశారు. 45 రోజుల క్రితమే పనులు చేయాలని కాంట్ర్టాక్టర్‌కు చెప్పామని, ఏ కారణంతో పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడుతూ కలెక్టర్‌ ఫోన్‌ చేసి మీతో మాట్లాడే వరకు పనులు ప్రారంభించరా.. బుధవారం పనులు ప్రారంభించి సంబంధిత ఫొటోలు తనకు పెట్టాలని చెప్పారు. నామినేషన్‌ పద్ధతిన సాగునీటి సంఘాలకు కేటాయించిన ఓఅండ్‌ఎం పనులను త్వరితగతిన ప్రారంభించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కాగా, పంట కాలువల్లో ఓఅండ్‌ఎం పనులు ప్రారంభించని నేపఽథ్యంలో కృష్ణాడెల్టాకు సాగునీటిని విడుదల చేసే తేదీని ఈ నెల 20వ తేదీకి వాయిదా వేయాలని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో జలవనరులశాఖ ఎస్‌ఈ మోహనరావు, వ్యవసాయశాఖ జేడీ మనోహరరావు, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్టీవోలు కె.స్వాతి, బాలసుబ్రహ్మణ్యం, హేలా షారోన్‌, సాగునీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 01:05 AM