Share News

సాగునీటి ఎద్దడి!

ABN , Publish Date - Jul 14 , 2025 | 01:03 AM

ఖరీఫ్‌ సీజన్‌ప్రారంబంలోనే శివారుప్రాంత రైతులకు కష్టాలు మొదలయ్యాయి, కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా శిొరుప్రాంతాల్లోని పంటభూములకు సాగునీరు అందడంలేదు. గత పదిరోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నా, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎగువప్రాంత రైతులు పైరును కాపాడుకునేందుకు ఆయిల్‌ఇంజన్లద్వారా నీటిని పొలాలకు మళ్లిస్తుండటంతో కాలువల్లో నీటిమట్టం పెరగడం లేదు. వర్సంకురిస్తేనే వరిపైరు బతుకుతుందని రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు.

సాగునీటి ఎద్దడి!

- నీరందక ఎండిపోతున్న వరిపైరు

- పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, మచిలీపట్నం, గూడూరు మండలాల్లో పరిస్థితులు దారుణం

- పసుపు రంగులోకి మారుతున్న వెదజల్లిన పొలాలు

- ప్రధాన కాలువలకు వదిలినా శివారు భూములకు చేరని నీరు

- ఆందోళనలో అన్నదాతలు

ఖరీఫ్‌ సీజన్‌ప్రారంబంలోనే శివారుప్రాంత రైతులకు కష్టాలు మొదలయ్యాయి, కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా శిొరుప్రాంతాల్లోని పంటభూములకు సాగునీరు అందడంలేదు. గత పదిరోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నా, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎగువప్రాంత రైతులు పైరును కాపాడుకునేందుకు ఆయిల్‌ఇంజన్లద్వారా నీటిని పొలాలకు మళ్లిస్తుండటంతో కాలువల్లో నీటిమట్టం పెరగడం లేదు. వర్సంకురిస్తేనే వరిపైరు బతుకుతుందని రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన, గూడూరు, మచిలీపట్నం మండ లంలో వెదజల్లే పద్ధతిలో సుమారు 15వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. విత్తనాలు జల్లి 15 నుంచి 20 రోజులు గడిచింది. మొలకలు వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పోవడంతోపాటు, కాలువలకు పూర్తిస్థాయిలో నీరు విడుదల కాకపోవడంతో పైరు ఎదుగుదల లోపించి పసుపు రంగులోకి మారిపోతోంది. అధిక ఉష్ణ్ణోగ్రతల ధాటికి లేత దశలో ఉన్న వరిపైరు వడలిపోతోంది. కాలువల ద్వారా వస్తున్న కొద్దిపాటి నీటిని కాలువ పక్కన ఉన్న రైతులు ఆయిల్‌ ఇంజన్లతో తోడేస్తున్నారు. కాలువలకు దూరంగా ఉన్న పొలాలకు నీటిని ఇంజన్‌ల ద్వారా పంపింగ్‌ చేసేందుకు అవకాశం లేకపోవడంతో నారుమడులు, వెదజల్లిన పొలాల్లోని వరిపైరు చనిపోయేందుకు సిద్ధంగా ఉంది.

వారం క్రితమే నీటిని విడుదల చేసినా..

బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో వెదజల్లే పద్ధతిన వరి సాగు చేయగా, సరిపడినంతగా నీరు లేక పైరు ఎండిపోతుండటంతో రైతులంతా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. దీంతో వారం రోజుల క్రితం గుడ్లవల్లేరు వద్ద పుల్లేటి కాలువ నుంచి కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలకు సాగునీటిని సరఫరా చేసే బంటుమిల్లి చానల్‌ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అప్పటి నుంచి 500 క్యూసెక్కుల నీటిని బంటుమిల్లి చానల్‌కు విడుదల చేస్తున్నారు. అయితే ఎండలు అధికంగా ఉండటంతో బంటుమిల్లి చానల్‌కు ఎగువన ఉన్న గ్రామాల రైతులు ఆయిల్‌ ఇంజన్‌లు పెట్టి కాలువ నీటిని పొలాలకు మళ్లిస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాలకు సాగు నీరు పూర్తిస్థాయిలో చేరడం లేదు. బంటుమిల్లి చానల్‌లో మల్లేశ్వరం వంతెన వద్ద 4.50 అడుగుల నుంచి 5 అడుగుల వరకు నీటి మట్టం ఉండాలి. కానీ ఆదివారం నాటికి ఈ వంతెన వద్ద కేవలం మూడు అడుగుల మేర నీటిమట్టం ఉంది. అడుగున్నర నుంచి రెండు అడుగుల మేర నీటి మట్టం కాలువలో తక్కువగా ఉండటంతో సాగునీరు పూర్తిస్థాయిలో దిగువ ప్రాంతాలకు చేరడంలేదు.

బందరు, గూడూరు మండలాల్లోనూ..

రామరాజుపాలెం, సీనాయి కాలువల ద్వారా బందరు, గూడూరు మండలాల్లోని పొలాలకు సాగునీరు అందాల్సి ఉంది. బందరు మండలంలోని అరిసేపల్లి, బుద్దాలపాలెం, కానూరు తదితర గ్రామాలకు, పెడన, గూడూరు మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీరు రామరాజుపాలెం కాలువ ద్వారానే అందాలి. ఈ కాలువకు నీటిని వదిలినా దిగువ ప్రాంతాలకు నీరు చేరడంలేదు. బందరు మండలంలోని అరిసేపల్లి, చిట్టిపాలెం, బుద్దాలపాలెం, కానూరు తదితర ప్రాంతాలకు పూర్తిస్థాయిలో నీరు రావడం లేదు. ఈ గ్రామాల్లో వెదజల్లే పద్ధతిన సాగు చేసిన పొలాల్లోని పైరు ఎండిపోయే స్థితికి చేరుకుంది.

500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నాం

- రాజ్యలక్ష్మి, బంటుమిల్లి నీటిపారుదలశాఖ ఏఈ

పుల్లేరు కాలువ ద్వారా బంటుమిల్లి చానల్‌కు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. కానీ ఎగువ ప్రాంత రైతులు నాట్లు వేసిన పొలాల్లోని పైరును కాపాడుకునేందుకు ఇంజన్‌ల ద్వారా నీటిని తోడుతున్నారు. దీంతో దిగువ ప్రాంతాలకు సరిపడా నీరు వెళ్లడంలేదు. ఒకటీ, రెండు రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతాం.

Updated Date - Jul 14 , 2025 | 01:03 AM