Share News

Jagan Project Failures: జగన్‌ పాలనలో ప్రాజెక్టులన్నీ కుదేలే

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:57 AM

జగన్‌ పాలనలో 120 సాగునీటి ప్రాజెక్టులలో చాలావరకు పనులు ప్రారంభం కాకుండానే ఆగిపోయాయి. నిధుల కొరత, పాలనానిర్లక్ష్యం వల్ల రాష్ట్రం సాగునీటి లోటుకు గురైంది

Jagan Project Failures: జగన్‌ పాలనలో ప్రాజెక్టులన్నీ కుదేలే

ఆ ఐదేళ్లలో 120 పథకాలు ఎక్కడివక్కడే

57 ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టీ ఎత్తలేదు

మిగతా 63లో నాలుగో వంతు పనులూ కాలేదు

విధ్వంసం నుంచి బయటపడడమెలా?

జలవనరుల శాఖ మల్లగుల్లాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ గద్దెనెక్కక ముందే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల విధ్వంస రచనకు ప్రణాళికలు వేసినట్లు ఆయన అనుసరించిన విధానమే చాటుతోందని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన వెంటనే.. శరవేగంగా నడుస్తున్న పోలవరం పనులు ఆపేశారు. కేంద్రం వద్దంటున్నా కాంట్రాక్టు సంస్థను తొలగించారు. రివర్స్‌ టెండర్‌ పేరిట విధ్వంసానికి బీజం వేశారు. ఇదే కాదు.. 25శాతం పనులు పూర్తికాని అన్ని ప్రాజెక్టుల కాంట్రాక్టులనూ నిరంకుశంగా కనీసం నోటీసైనా ఇవ్వకుండా రద్దు చేశారు. ఆ వెంటనే తన అస్మదీయ సంస్థలకు కొత్త ఎస్‌ఎ్‌సఆర్‌ ప్రకారం పనులు కట్టబెట్టారు. ఐదేళ్ల జగన్‌ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులను ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తరచూ సమీక్షిస్తున్నప్పుడు కళ్లు చెదిరే నిజాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 120 ప్రాజెక్టుల్లో 57 ప్రాజెక్టులు పనుల ప్రారంభానికే నోచుకోలేదు. వీటిలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు... పోయలేదు. మరో 53 పథకాలకు పాలనామోదం లభించినా.. నాలుగో వంతు పనులైనా పూర్తికాలేదు. జగన్‌ నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుల్లో బుడమేరు మళ్లింపు-ఆధునికీకరణ పథకం, ముక్త్యాల ఎత్తిపోతల, గోదావరి-పెన్నా మొదటి దశ, వరికిపూడిశెల ఎత్తిపోతల, హంద్రీ-నీవా సుజల స్రవంతి రెండో దశ, రాయలసీమ ఎత్తిపోతల, రాజోలిబండ మళ్లింపు పథకం, వేదావతి ఎత్తిపోతల, జీడిపల్లి రిజర్వాయరు-భైరవానితిప్ప ఎత్తిపోతల, గాలేరు-నగరి సుజల స్రవంతి, హంద్రీ-నీవా(చక్రాయపేట), అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ వంటివి ఉన్నాయి.


మొదలే కాని ప్రాజెక్టులు..

ప్రాజెక్టు పనులు ప్రారంభం కానివాటిలో ఉత్తర కోస్తా చీఫ్‌ ఇంజనీర్‌ పరిధిలో 4, గోదావరి డెల్టా సిస్టమ్‌, ధవళేశ్వరం చీఫ్‌ ఇంజనీర్‌ పరిధిలో ఒకటి, కృష్ణా డెల్టా సీఈ పరిధిలో 4, ఒంగోలు సీఈ పరిధిలో 4, నాగార్జునసాగర్‌ సీఈ పరిధిలో రెండు, ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టు (తిరుపతి) సీఈ పరిధిలో 12, కర్నూలు సీఈ పరిధిలో 4, అనంతపురం సీఈ పరిధిలో 7 ఉన్నాయి. కడపలో ఏకంగా 14 ప్రాజెక్టు పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. అంచనా వ్యయంలో 25శాతం కంటే తక్కువ పనులు జరిగిన ప్రాజెక్టులు 63 ఉన్నాయని జలవనరుల శాఖ తేల్చింది. వాటిలో ఉత్తర కోస్తా సీఈ పరిధిలో 15, ధవళేశ్వరం సీఈ పరిధిలో 5, పోలవరం సీఈ పరిధిలో 6, కృష్ణా డెల్టా సీఈ పరిధిలో 7, ఒంగోలు సీఈ పరిధిలో 2, నాగార్జునసాగర్‌ సీఈ పరిధిలో 1, తెలుగుగంగ సీఈ పరిధిలో 7, కర్నూలు సీఈ పరిధిలో 7, అనంతపురం సీఈ పరిధిలో 1, కడప సీఈ పరిధిలో 12 ప్రాజెక్టులు ఉన్నట్లు వెల్లడించింది. జగన్‌ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తిచేయాల్సి బాధ్యత ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై పడింది. అవన్నీ పూర్తిచేయాలంటే అంచనాలు పెంచాలి. కొత్త ఎస్‌ఎ్‌సఆర్‌ ధరల ప్రకారం అమలు చేస్తే.. ఆర్థిక భారం తడిసిమోపెడవుతుందని జలవనరుల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. జగన్‌ విధ్వంసం నుంచి బయటపడే మార్గాలు అన్వేషిస్తోంది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టక తప్పదని స్పష్టం చేస్తోంది.


పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ మాజీ సీఎం జగన్‌ కక్షకు బలయ్యాయి. ఆయన ఐదేళ్ల ఏలుబడిలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదు. పైగా రూపాయి కూడా ఇవ్వకుండా అన్నిటినీ నాశనం చేసేశారు. ఇప్పుడు వాటిని ముట్టుకోవాలంటేనే ప్రభుత్వం భయపడుతోంది. నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. అలాగని వాటిని చేపట్టకుండా ఆపితే ప్రజలకు భారీ నష్టం. ఏం చేయాలో అర్థం కాక తర్జనభర్జన పడుతోంది.

Updated Date - Apr 11 , 2025 | 05:57 AM