Endowment Department: సమాచారం ఇవ్వం..
ABN , Publish Date - Sep 01 , 2025 | 05:38 AM
దేవదాయ శాఖలో ఆర్టీఐ (సమాచార హక్కు) విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది..! కమిషనరేట్‌లో ఆర్టీఐ దరఖాస్తుదారులకు చిన్న సమాచారం ఇవ్వడానికి కూడా అధికారులు ఇష్టపడడం లేదు.
దేవదాయ శాఖలో అధికారుల వింత ప్రవర్తన
ఆర్టీఐ దరఖాస్తులకు కనీస స్పందన కరువు
అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖలో ఆర్టీఐ (సమాచార హక్కు) విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది..! కమిషనరేట్‌లో ఆర్టీఐ దరఖాస్తుదారులకు చిన్న సమాచారం ఇవ్వడానికి కూడా అధికారులు ఇష్టపడడం లేదు. దీంతో ప్రతి కేసు విషయంలోనూ ఆర్టీఐ కమిషనర్ (రెండో అప్పీలేట్ అథారిటీ) వద్దకు వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటీవల ఒక వ్యక్తి దేవదాయ శాఖలో పదోన్నతులకు సంబంధించిన రోస్టర్ రిజిస్ట్రర్, క్యాడర్ స్ట్రెంత్ సమాచారం కోరారు. అధికారులు స్పందించకపోవడంతో రెండో అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో దేవదాయ శాఖ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి (పీఐవో) చెప్పిన సమాధానంతో కమిషనర్ షాక్ అయ్యారు. ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం వారిని ఎన్నిసార్లు అడిగినా సమాచారమివ్వడం లేదని ఆ అధికారి తన గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్.. తదుపరి విచారణకు ఎస్టాబ్లిష్‌మెంట్ అధికారులను తీసుకురావాలని ఆదేశించారు. దేవదాయ శాఖలో ప్రతి విభాగం అధికారులు నిత్యం ఆర్టీఐ విచారణలకు హాజరుకావడం పరిపాటిగా మారింది. శాఖలో పదోన్నతులు, పోస్టింగ్స్‌లో నిబంధనలు పాటించడం లేదు. ఈ విషయాలు బయటకొస్తే సమస్యలు వస్తాయనే కొన్ని విభాగాల అధికారులు ఫైల్స్ బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారన్న ఆరోపణలున్నాయి.