Share News

IPS officer N. Sanjay: అబ్బే.. అంతా బాగానే చేశాం

ABN , Publish Date - Sep 03 , 2025 | 04:28 AM

విజయవాడ జిల్లా జైలులో ఉన్న ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. దళితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్గించేందుకు...

IPS officer N. Sanjay: అబ్బే.. అంతా బాగానే చేశాం

  • టెండర్‌ దక్కించుకున్న ఏజెన్సీకి బిల్లు చెల్లించాం

  • ఎస్సీ, ఎస్టీ సదస్సుల నిధుల్లో అవినీతి జరగలేదు

  • అగ్నిమాపకశాఖలో ట్యాబ్‌ల పంపిణీ జరిగింది

  • ఏసీబీ కస్టడీలో ఐపీఎస్‌ సంజయ్‌ వెల్లడి

అమరావతి, విజయవాడ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): విజయవాడ జిల్లా జైలులో ఉన్న ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. దళితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్గించేందుకు కేటాయించిన నిధులను జగన్‌ జమానాలో స్వాహా చేసిన వ్యవహారంతోపాటు పలు అవినీతి అంశాలపై సంజయ్‌ను ప్రశ్నించారు. అయితే, కొన్ని ప్రశ్నలకు మౌనం వహించిన ఆయన.. మరికొన్నింటికి ‘అబ్బే.. అంతా బాగానే చేశాం’ అంటూ నమ్మబలికే ప్రయత్నం చేసినట్టు సమాచారం. సీఐడీ, అగ్నిమాపక విభాగాలకు అధినేతగా ఆనాడు పనిచేసిన సంజయ్‌పై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఆదేశంతో విజిలెన్స్‌ విచారణ జరిపి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. దీనిపై హైకోర్టుకు వెళ్లి సంజయ్‌ తెచ్చుకున్న ముందస్తు బెయిల్‌ను ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సంజయ్‌ను మంగళవారం నుంచి మూడు రోజులపాటు కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఏసీబీ అధికారులు సంజయ్‌ను జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. అగ్నిమాపక శాఖలో ఎన్‌వోసీలు ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు మొబైల్‌ యాప్‌ అభివృద్ధి, నిర్వహణ, ట్యాబ్‌ల కొనుగోళ్లలో అవినీతిపై ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధించారు. ప్రశ్నల్లో కొన్నింటిని దాటవేసిన సంజయ్‌ మరికొన్నింటికి ‘కాదు’ అని సమాధానం చెప్పినట్లు తెలిసింది. అంతా సక్రమంగానే జరిగిందని, టెండర్‌ నిర్వహించి దక్కించుకున్న వారికి బిల్లులు చెల్లించామని, ఎక్కడా అవినీతి జరగలేదని ఏసీబీ విచారణలో సంజయ్‌ వెల్లడించినట్లు సమాచారం. మరో వైపు అగ్నిమాపక శాఖలో బిడ్‌ రిగ్గింగ్‌, టెండర్లు కట్టబెట్టడంలో పక్షపాత ధోరణి అవలంబించినట్లు తేలింది.


సౌత్రిక టెక్నాలజీస్‌కు యాప్‌ అభివృద్ధి పేరుతో బిల్లులు చెల్లించి 59.93 లక్షలు దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్‌ గుర్తించింది. ‘అగ్ని-ఎన్‌వోసీ’ వెబ్‌సైట్‌ రూపకల్పన, యాప్‌ అభివృద్ధి, నిర్వహణ, 150ట్యాబ్‌ల సరఫరా కోసం ముందే ఎంపిక చేసుకున్న మూడు సంస్థలతో బిడ్లు వేయించి ఎల్‌-1గా సౌత్రికా టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బిడ్‌ను ఎంపిక చేశారు. మొత్తం 2.29కోట్ల రూపాయల ప్రాజెక్టులో పనులు జరగకుండానే 59.93లక్షలు చెల్లించేశారు. మార్కెట్‌ ధరకన్నా ఎక్కువ చెల్లించి టాబ్‌లు కొనుగోలు చేయడం, బిడ్‌ వేసిన సంస్థకు నిబంధనలు అతిక్రమించి బిల్లులు చెల్లించడం వెనుక సంజయ్‌ అవినీతి ఉన్నట్లు విజిలెన్స్‌ నివేదికలో స్పష్టం చేసింది. అలాగే.. సీఐడీ చీఫ్‌గా ఉండగా ఆయన దళితులకు ఎస్‌సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు పలు కల్యాణ మండపాల్లో పెట్టిన సమావేశాల్లో రూ.1.19కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి క్రిత్వాప్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థకు బిల్లులు చెల్లించినట్లు చూపారు. అయితే ప్రభుత్వ బడుల్లో నిర్వహించిన వాటికి సీఐడీ అధికారులు, సిబ్బంది తప్ప దళిత, గిరిజనులు హాజరు కాలేదని విజిలెన్స్‌ విచారణలో తేలింది. ఫొటోలు, వీడియోలు సీఐడీ సిబ్బంది సెల్‌ఫోన్లలో చిత్రీకరించి వాటికి సైతం బిల్లులు పెట్టారని.. టీ, బిస్కట్లు ఇచ్చి భోజనాలు పెట్టినట్లు భారీగా ఖర్చు చూపించి రూ.కోటికి పైగా నిధులు కాజేశారని విజిలెన్స్‌ తెలిపింది. ఈ రెండు అవినీతి భాగోతాలపైనా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అగ్నిమాపక శాఖలో ట్యాబ్‌లు కొనుగోలు చేశామని, అగ్ని-ఎన్‌వోసీ వెబ్‌సైట్‌ రూపకల్పన జరిగిందని ఎలాంటి అవినీతి జరగలేదని సంజయ్‌ బదులిచ్చినట్లు తెలిసింది. ఈ విచారణ అంతా రహస్యంగా జరిగింది. అనంతరం సంజయ్‌ను జైలుకు తరలించారు. మరో రెండు రోజులు ఆయనను ఏసీబీ విచారించనుంది.

Updated Date - Sep 03 , 2025 | 04:30 AM