IPS Officer Sanjay: నిధుల దుర్వినియోగం కేసులో..ఐపీఎస్ సంజయ్‌కు షరతులతో బెయిల్
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:46 AM
అగ్నిమాపక శాఖ, సీఐడీలో నిధుల దుర్వినియోగం కేసులో రిమాండ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్‌కు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది...
ఏ-4 కొండలరావుకు కూడా.. బెజవాడ ఏసీబీ కోర్టు తీర్పు
రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు
కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు
విజయవాడ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అగ్నిమాపక శాఖ, సీఐడీలో నిధుల దుర్వినియోగం కేసులో రిమాండ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్‌కు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న మరో నిందితుడు కొండలరావుకు కూడా బెయిల్ ఇచ్చింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో హైకోర్టు గతంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయగా.. ఏసీబీ అధికారులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టి తక్షణమే కోర్టులో లొంగిపోవాలని సంజయ్‌ను ఆదేశించింది. దీంతో ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. ఆయన 112 రోజులుగా జ్యుడీషియల్ రిమాండ్‌పై విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టు కొట్టేసింది. ఇదే కేసులో ఏ-4గా ఉన్న బిక్కిన కొండలరావును కొద్దిరోజుల క్రితం ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. 29 రోజులుగా ఆయన రిమాండ్‌లో ఉన్నారు. ఈ ఇద్దరి బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగియడంతో న్యాయాధికారి సోమవారం తీర్పు ఇచ్చారు. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని.. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని.. పాస్‌పోర్టును కోర్టులో అప్పగించాలని షరతులు విధించారు.