IPS officer PV Sunil Kumar: నేటి విచారణకు రాలేను
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:23 AM
నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ప్రధాన నిందితుడైన(ఏ-1) సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్....
రెండు వారాల గడువివ్వండి
రఘురామ కేసులో దర్యాప్తు అధికారికి ఐపీఎస్ సునీల్‌కుమార్ సమాచారం
గుంటూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ప్రధాన నిందితుడైన(ఏ-1) సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ గురువారం విచారణకు హాజరుకావడంలేదు. ఆ కేసులో గుంటూరులోని సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో ఈ నెల 4న విచారణకు హాజరు కావాలంటూ దర్యాప్తు అఽధికారి, ప్రస్తుతం విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ గత నెల 26న ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే తన కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్య కారణంగా రాలేనని, వచ్చేందుకు తనకు రెండు వారాల గడువు ఇవ్వాలని సునీల్ ఆయనకు సమాచారమిచ్చారు. సునీల్‌ను విచారించేందుకు ఎస్పీ దామోదర్ బుధవారమే గుంటూరుకు చేరుకున్నారు. చివరి నిమిషంలో తాను రావడం లేదని ఆయనకు సునీల్ సమాచారమిచ్చారు. నిజానికి సునీల్‌కుమార్‌కు నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆయన విచారణకు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు మళ్లీ నోటీసులివ్వాలా.. ఇస్తే అందులో ఏ షరతులు విధించాలి.. ఎంత గడువు ఇవ్వాలనే అంశాలపై న్యాయ సలహా అనంతరం నిర్ణయం తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఏ-1గానాటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌ను, ఏ-2గా అప్పటి నిఘా చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ-3గా నాటి సీఎం జగన్, ఏ-4గా అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్, ఏ-5గా నాటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని చేర్చారు. దర్యాప్తు క్రమంలో విజయ్‌పాల్‌ను విచారించి అరెస్టు చేశారు. ఆ తర్వాత రఘురామపై దాడి చేసిన తులసిబాబును కూడా అరెస్టుచేశారు. ఆ తర్వాత పెద్దగా కదలికలేదు. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉండడంపై రఘురామరాజు పలు దఫాలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే.