IPS Officer Ammireddy: ఐపీఎస్ అమ్మిరెడ్డికి ప్రివిలేజ్ సెగ!
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:12 AM
ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డి శాసనమండలి ప్రివిలేజెస్ కమిటీ ఎదుట హాజరయ్యారు. కమిటీ సమావేశం మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది.
శాసనమండలి కమిటీ ఎదుట హాజరు
పొంతన లేని సమాధానాలతో నీళ్లు నమిలిన అమ్మిరెడ్డి
జనవరి 5న మరోసారి విచారణకు రావాలని ఆదేశం
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డి శాసనమండలి ప్రివిలేజెస్ కమిటీ ఎదుట హాజరయ్యారు. కమిటీ సమావేశం మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. ఈ సందర్భంగా ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ బీటీ నాయుడు నేతృత్వంలోని కమిటీ సుమారు గంటన్నరపాటు అమ్మిరెడ్డిని విచారించింది. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ఏఐజీగా పనిచేస్తున్న అమ్మిరెడ్డి గతంలో గుంటూరు ఎస్పీగా పనిచేసిన సమయంలో అప్పటి ఎమ్మెల్సీ లోకేశ్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ... ‘ఎస్సీ కులాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే లీగల్‌గా చర్యలు తీసుకుంటాం’ అంటూ చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ లోకేశ్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై అమ్మిరెడ్డికి నోటీసులు ఇచ్చి పిలిపించిన కమిటీ.. లోకేశ్ ట్వీట్‌లో ఎక్కడా కుల ప్రస్తావన లేకపోయినా మీరు ఎందుకు ఎస్సీ కులాన్ని ప్రస్తావించారని కమిటీ ప్రశ్నించింది. అమ్మిరెడ్డి నీళ్లు నమిలారు. ‘మీరు ఇచ్చిన సమాధానంలో శాసనమండలి ప్రివిలేజెస్ కమిటీకి ఎలాంటి అధికారాలు లేవని ఎలా పేర్కొంటారు.?’ అన్న మరో ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... ‘అది అప్పటి డీజీపీ కార్యాలయ న్యాయ సలహాదారుగా ఉన్న వ్యక్తి ఇచ్చారు’ అని చెప్పారు. అమ్మిరెడ్డితోపాటు వచ్చిన ఆ వ్యక్తిని కమిటీ ప్రశ్నించింది. దానికి ఆయన... ‘అప్పట్లో ఏం రాశానో నాకు గుర్తు లేదు’ అని పేర్కొన్నారు. కమిటీ అడిగిన పలు ప్రశ్నలకు అమ్మిరెడ్డి పరస్పర విరుద్ధంగా సమాధానాలు ఇచ్చారు. గతంలో డీజీపీకి లీగల్ అడ్వయిజర్‌గా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం మరో శాఖకు పనిచేస్తున్నారు. ప్రివిలేజెస్ కమిటీ అధికారాలను ప్రశ్నించినందుకుగాను ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరేందుకు ప్రివిలేజెస్ కమిటీ సిద్ధమవుతోంది. రాజ్యాంగపరంగా ఆర్టికల్ 194 ప్రకారం రాజ్యసభకు ఏ విధంగా హక్కులు ఉంటాయో రాష్ట్రంలో ఉన్న శాసనమండలికి కూడా అవే అధికారాలు ఉంటాయని కమిటీ స్పష్టం చేసింది. జనవరి 5న మరో దఫా విచారణకు హాజరు కావాలని అమ్మిరెడ్డిని ఆదేశించింది.
కమిటీ ముందుకు మరో ఇద్దరు అధికారులు
మండలి చైర్మన్ మోషేన్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి కమిటీ ఎదుట హాజరైన వివరణ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ వెంకటమరణయ్య విచారణకు హాజరయ్యారు. అధికారుల నుంచి సేకరించిన వివరణలు, ఆధారాలను పరిశీలించిన అనంతరం కమిటీ తదుపరి నిర్ణయం తీసుకోనుంది. ప్రజాప్రతినిధుల గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కమిటీ స్పష్టం చేసింది. సమావేశంలో కమిటీ సభ్యులు జయేంద్ర భరత్, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పండుల రవీంద్రబాబు, తలశిల రఘురామ్, రాజగోల్ల రమేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు.