Share News

Investments: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో 7,500 పెట్టుబడులు

ABN , Publish Date - Nov 13 , 2025 | 05:50 AM

రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ (ఆహారశుద్ధి) రంగంలోకి సుమారు 7,500 కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

Investments: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో 7,500   పెట్టుబడులు

  • విశాఖ సదస్సులో ఎంవోయూలు

  • జాబితాలో మోండలెజ్‌, పతంజలి, జైన్‌ ఇరిగేషన్‌ సంస్థలు

  • ఐదేళ్లలో ఈ రంగంలో లక్ష్యం 30 వేలకోట్ల పెట్టుబడులు.. 3 లక్షల ఉద్యోగాలు

  • ఏడాదిన్నరలోనే 16 వేలకోట్ల పెట్టుబడుల రాక

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ (ఆహారశుద్ధి) రంగంలోకి సుమారు 7,500 కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. 14, 15 తేదీల్లో విశాఖలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సులో ఆయా కంపెనీలు ఎంవోయూలు చేసుకోనున్నాయి. మోండలెజ్‌ డైరీ మిల్క్‌, పతంజలి, జైన్‌ ఇరిగేషన్‌, గోద్రేజ్‌, రిలయన్స్‌, ఐటీసీ, కెలాగ్స్‌, ఇండస్‌ కాఫీ వంటి అనేక కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఐదేళ్లలో ఆహారశుద్ధి రంగంలోకి 30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, మూడు లక్షల మందికి ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ ఏడాదిన్నరలోనే దాదాపు రూ.16 వేల కోట్ల విల ువైన పెట్టుబడులు సాధించి ఇప్పటికే సగానికి పైగా లక్ష్యం సాధించింది. మెగా ప్రాజెక్టుల కేటగిరీలో రూ.6,100 కోట్ల మేర పెట్టుబడులతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనకు ఆయా కంపెనీలు సమర్పించిన ప్రతిపాదనలకు ఇప్పటికే ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. వీటిలో కొన్ని పరిశ్రమలు గ్రౌండింగ్‌ దశలో ఉండగా, మరికొన్ని ప్రారంభోత్సవాలకు సిద్ధమవుతున్నాయి. ఇక భారీ, చిన్నతరహా పరిశ్రమల విభాగంలో మరో రూ.1,500 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు ఎంవోయూలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవిగాక మరో రూ.3 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. వచ్చే మూడు, నాలుగేళ్లలో 40 నుంచి 50 వేల కోట్ల వరకు పెట్టుబడులు ఆకర్షించే అవకాశముందని అంచనా. కొత్తగా రానున్న పెట్టుబడులతో రాష్ట్రంలో ఆహారశుద్ధి రంగం మరింత అభివృద్ధి చెందనుంది.


గత ప్రభుత్వంలో కుదేలు

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. వేల కోట్ల పెట్టుబడులతో నెలకొల్పే భారీ పరిశ్రమలతో పాటు ఉపాధి కల్పనలో కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) స్థాపనకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ప్రభుత్వపరంగా తగిన ప్రోత్సాహకాలు అందిస్తే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని భావిస్తోంది. అయితే కొవిడ్‌ దెబ్బతో కుదేలైన చిన్న పరిశ్రమలకు గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేలసంఖ్యలో యూనిట్లు మూతపడ్డాయి. లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. గత వైసీపీ పాలనలో అతలాకుతలమైన ఎంఎ్‌సఎంఈ రంగానికి ప్రభుత్వపరంగా మళ్లీ ఊతమిచ్చి గాడిన పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేస్తోంది.


ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ

రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు, అపారమైన సహజ వనరులు అందుబాటులో ఉండటంతో పెద్దఎత్తున యూనిట్లు నెలకొల్పేందుకు వీలుగా ఎంఎ్‌సఎంఈ రంగంతో ఈ సెక్టార్‌ను ప్రభుత్వం అనుసంధానం చేసింది. రైతులు పండించే ఆహార ఉత్పత్తులకు టెక్నాలజీ వినియోగంతో విలువ జోడింపు ఇచ్చి, ఆయా జిల్లాల్లోని ఆహార ఉత్పత్తులకు అంతర్జాతీయస్థాయిలో మార్కెటింగ్‌ అవకాశాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది. రాయలసీమ జిల్లాల్లో మామిడి సహా ఉద్యాన పంటలు, మిరప, పసుపు తదితరాలతో పాటు కోస్తా జిల్లాల్లో ఆక్వా ఉత్పత్తులను శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెసింగ్‌ చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీని ప్రకటించింది. చిన్న యూనిట్లకు పెట్టిన స్థిర మూలధన పెట్టుబడిలో 75 శాతం, భారీ పరిశ్రమలకు 35 శాతం వరకు రాయితీలతో పాటు భూములు, విద్యుత్తు తదితర వసతులు కల్పిస్తామని ప్రకటించింది.

Updated Date - Nov 13 , 2025 | 05:53 AM