Share News

Employment Opportunities: ఆరంభానికి ముందే అదిరింది

ABN , Publish Date - Nov 14 , 2025 | 05:11 AM

విశాఖలో సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు శుక్రవారం ప్రారంభం కానుంది. రెండు రోజులు కొనసాగనున్న ఈ సదస్సుకు ఒక రోజు ముందుగానే బెనిఫిట్‌ షో తరహాలో సన్నాహకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు...

Employment Opportunities: ఆరంభానికి ముందే అదిరింది

  • ఒక రోజు ముందుగానే రూ.3,65,304 కోట్ల ఒప్పందాలు

  • సీఎం చంద్రబాబు సమక్షంలో సంతకాలు చేసిన 35 సంస్థలు

  • ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానం విశాఖ

  • అంచనాలకు మించి పెట్టుబడులు: చంద్రబాబు

అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): విశాఖలో సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు శుక్రవారం ప్రారంభం కానుంది. రెండు రోజులు కొనసాగనున్న ఈ సదస్సుకు ఒక రోజు ముందుగానే బెనిఫిట్‌ షో తరహాలో సన్నాహకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చేపట్టిన అవగాహనా ఒప్పందాల బదలాయింపునకు భారీ స్పందన వచ్చింది. ఐదు ప్రభుత్వ శాఖలు 35 పారిశ్రామిక సంస్థలతో రూ.3,65,304 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా 1,24,371 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. కాగా... భాగస్వామ్య సదస్సును ప్రకటించాక వివిధ దేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్‌ పర్యటించి చేసుకున్న 410 ఎంఓయూలతో రూ.9,78,248 కోట్ల పెట్టుబడులు, 7,48,427 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. 2019-24 మధ్యకాలంలో అప్పటి సీఎం జగన్‌ అనుసరించిన పారిశ్రామిక వ్యతిరేక విధానాల కారణంగా చాలా కంపెనీలు ఏపీ పేరెత్తితేనే హడలిపోయాయి. ముఖ్యంగా పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలతో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను జగన్‌ హఠాత్తుగా రద్దు చేశారు. ఆ ఒప్పందాలన్నీ కేంద్రం చొరవతో చంద్రబాబు ప్రభుత్వం చేసుకుంది. వాటిని రద్దు చేస్తానంటే చట్టపరంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జగన్‌ను కేంద్రం హెచ్చరించింది. అయినా.. జగన్‌ లెక్కచేయలేదు. వాటి రద్దు ఫలితం అంతర్జాతీయ పారిశ్రామిక సమాజంపై పడింది. ఏపీలో పరిశ్రమలను ప్రోత్సహించడం అలా ఉంచితే.. తరిమి కొడతారన్న అభిప్రాయం పారిశ్రామిక దిగ్గజ సంస్థల్లో బలంగా నాటుకుంది.


కేంద్రం హెచ్చరించినట్లుగానే పీపీఏల రద్దు నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో పీపీఏల మేరకు విద్యుత్‌ కొనుగోళ్ల కోసం దాదాపు రూ.6,500 కోట్లు, కోర్టు ఉత్తర్వులు వచ్చేలోగా బహిరంగ మార్కెట్లో మరో రూ.3,500 కోట్ల మేర కరెంటు కొనుగోళ్ల ద్వారా మొత్తంగా రూ.10,000 కోట్లను జగన్‌ ప్రభుత్వం ప్రజలపై ‘ట్రూఅప్‌ భారం’ వేసింది. వీటికితోడు అమర్‌రాజా బ్యాటరీస్‌ను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టింది. జాకీ అండర్‌ గార్మెంట్స్‌ కంపెనీ రాష్ట్రానికి రాకుండానే వెళ్లిపోయింది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలో విశ్వాసం పెరిగింది. దీంతో ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరుగనున్న పారిశ్రామిక సదస్సుకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఒక రోజు ముందుగా గురువారం సీఎం చంద్రబాబు సమక్షంలో 35 సంస్థలు చేసుకున్న ఒప్పందాలు ఇలా ఉన్నాయి.

Updated Date - Nov 14 , 2025 | 05:15 AM