Share News

Investment Boom: పెట్టుబడుల ధమాకా

ABN , Publish Date - Oct 09 , 2025 | 04:37 AM

నవ్యాంధ్రకు మొదటిసారి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) రానుంది. విశాఖలో భారీ స్థాయిలో రూ.87,520 కోట్ల పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన...

Investment Boom: పెట్టుబడుల ధమాకా

  • రూ.87,520 కోట్లతో విశాఖలో ఏఐ డేటా సెంటర్‌

  • రాష్ట్రానికి తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి

  • గూగుల్‌ అనుబంధ సంస్థ ‘రైడెన్‌’కు రైట్‌రైట్‌

  • ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం

  • మొత్తం 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

  • వీటితో 67,218 మందికి ఉద్యోగావకాశాలు

  • ఐటీ, ఇంధన, ఫుడ్‌ప్రాసెసింగ్‌ ప్రాజెక్టులకు ఓకే

  • మహారాష్ట్రకు ముంబై ఒక్కటే.. మనకు 3 హబ్‌లు

  • విశాఖ, అమరావతి, తిరుపతి హబ్‌లపై ఫోకస్‌

  • 3 ప్రాంతాలూ పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి

  • మంత్రి లోకేశ్‌ ప్రతిపాదన.. సీఎం సమ్మతి

  • శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి దాకా విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌

  • ఉమ్మడి పశ్చిమ నుంచి ప్రకాశం వరకు ఇంకోటి

  • నెల్లూరు, సీమ జిల్లాలతో మరో జోన్‌

అమరావతి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు మొదటిసారి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) రానుంది. విశాఖలో భారీ స్థాయిలో రూ.87,520 కోట్ల పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన కృత్రిమ మేధ డేటా సెంటర్‌ ఏర్పాటుకు గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్ఫోటెక్‌ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన 11వ ఎస్‌ఐపీబీ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌, మంత్రులు లోకేశ్‌, అనగాని సత్యప్రసాద్‌, కె.అచ్చెన్నాయుడు, పి.నారాయణ, టీజీ భరత్‌, కందుల దుర్గేశ్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలు జరిగిన భేటీలో పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులతో .. 67,218 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. మహారాష్ట్రకు ముంబై ఒక్కటే ఎకనామిక్‌ హబ్‌గా ఉంటే.. మన రాష్ట్రానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతి మూడు ఎకనామిక్‌ హబ్‌లు ఉన్నాయని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఈ మూడు హబ్‌లను సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని మంత్రులు, ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్రంలోని మూడు ఎకనామిక్‌ కారిడార్‌లనూ గ్రోత్‌ హబ్‌లుగా వినియోగించుకోవాలన్నారు.


క్వాంటం వ్యాలీ తరహాలోనే రాష్ట్రానికి వస్తున్న డేటా సెంటర్లు.. టెక్నాలజీ రంగంలో కీలక మలుపుగా అభివర్ణించారు. విశాఖ పారిశ్రామికాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎకనామిక్‌ కారిడార్‌ తరహాలోనే రాయలసీమలోనూ ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్‌ ఈ భేటీలో ప్రతిపాదించారు. మూడు ప్రాంతాలనూ పారిశ్రామిక జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలన్నారు. ఈ సూచనలతో ముఖ్యమంత్రి ఏకీభవించారు. విశాఖ కేంద్రంగా శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి దాకా విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అమరావతి కేంద్రంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకూ మరో ఎకనామిక్‌ రీజియన్‌, తిరుపతి కేంద్రంగా నెల్లూరు, రాయలసీమ జిల్లాలతో మరో జోన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.


ఆగ్రోప్రాసెసింగ్‌ హబ్‌గా సీమ

రాయలసీమలో ఏరోస్పేస్‌, ఎలకా్ట్రనిక్స్‌, డ్రోన్‌ సిటీ, ఆటోమొబైల్‌ రంగ కారిడార్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వీటితో పాటు ఉద్యాన పంటలకు కేంద్రంగా రాయలసీమ ఆగ్రోప్రాసెసింగ్‌ హబ్‌గా మారుతుందన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లును అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా తయారు చేయాలని.. దీనికోసం ల్యాండ్‌ బ్యాంకును ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


రంగాలవారీగా ఆమోదించిన పెట్టుబడులివీ..

  • విశాఖలో గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్ఫో టెక్‌ ఆధ్వర్యంలో కృత్రిమ మేథ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఆమోదం. రూ.87,520 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగావకాశాలు. రైడెన్‌ ఇన్ఫోటెక్‌ సంస్ధకు సబ్సిడీ ధరకు విశాఖలో భూమి. ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలను అందించేందుకు ఆమోదం.

  • రాష్ట్రంలో ఏఐలో శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.140 కోట్ల పెట్టుబడితో ఇమేజిన్నోవేట్‌ టెక్‌ సొల్యూషన్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఆమోదం. దీనిద్వారా 3,600 మందికి ఉద్యోగాలు.

  • ఇంధన రంగంలో రూ.16,920 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా. ఇందులో అనంతపురంలో రూ.2,000 కోట్ల పెట్టుబడులతో 400 మెగావాట్ల ఏసీ/580 మెగావాట్ల డీసీ, 800 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ నెలకొల్పేందుకు ఆక్మే ఊర్జా వన్‌ సంస్థ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం. 1,380 మందికి ఉద్యోగాలు. ఇదే జిల్లాలో రూ.2 వేల కోట్ల పెట్టుబడితో టాటా పవర్‌ రెన్యువబుల్స్‌ ఎనర్జీ లిమిటెడ్‌ 400 మెగావాట్ల ఏసీ, 560 మెగావాట్ల డీసీ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం, 1,380 మందికి ఉద్యోగాలు. విజయనగరంలో రూ.12,905 కోట్లతో దుగ్గేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు చింతా గ్రీన్‌ఎనర్జీకి అనుమతి.ఆంపిన్‌ ఎనర్జీ ట్రాన్సిసన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలోరూ.15.10 కోట్లతో కర్నూలు, నంద్యాలలో 2.30 మెగావాట్లతో సోలార్‌, విండ్‌ పవర్‌ ప్లాంటు ఏర్పాటుకు ఆమోదం.


  • ఫుడ్‌ప్రాసెసింగ్‌ రంగంలో రూ.1,200 కోట్ల పెట్టుబడులకు సమ్మతి.. రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ 2024-29 ఫుడ్‌ప్రాసెసింగ్‌ పాలసీ మేరకు ఆహార తయారీ ఉత్పత్తులను అందించేందుకు చేసిన ప్రతిపాదనలకు ఆమోదం. రూ.758 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉద్యోగాలను కల్పిస్తారు. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ తయారీ-విక్రయాల్లో రూ.208 కోట్ల పెట్టుబడికి గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌కు గ్రీన్‌సిగ్నల్‌. సోయా ఉత్పత్తుల తయారీకి రూ.201 కోట్లతో ఎస్‌వీఎఫ్‌ సోయా ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేసిన పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం. అలాగే ఆహార ఉత్పత్తుల తయారీకి రూ.33 కోట్లతో ఫ్రెష్‌ బౌల్‌ హార్టికల్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేసిన ప్రతిపాదనకూ ఆమోదం.

  • పర్యాటకంలో రూ.858 కోట్ల పెట్టుబడి.. 1098 మంది ఉద్యోగావకాశాలు. ఇందులో మెస్సర్స్‌ దసపల్లా అమరావతి హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అమరావతిలో రూ.200 కోట్ల పెట్టుబడులతో నిర్మించే హోటల్‌ నిర్మాణానికి ఆమోదం. అరకు లోయలో రూ.55 కోట్లతో వీఎ్‌సకే హోటల్స్‌, రిసార్ట్స్‌ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌. శ్రీకాకుళంలో రూ.83 కోట్ల పెట్టుబడితో లాడ్జి హోటల్‌ నిర్మాణానికి శ్రీవేంకటేశ్వర లాడ్జ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఆమోదం. అమరావతిలో మెస్సర్స్‌ సదరన్‌ గ్లోబ్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూ.177 కోట్లతో హోటల్‌ నిర్మాణానికి అనుమతి.

  • పారిశ్రామిక రంగంలో రూ.5,800 కోట్ల పెట్టుబడులు.. వీటితో 6,646 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం.

Updated Date - Oct 09 , 2025 | 06:54 AM