ACB Investigation: అనకాపల్లి ఆస్పత్రిలో 22 మందిపై విచారణ
ABN , Publish Date - Jul 28 , 2025 | 05:49 AM
అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో గతంలో పలు అక్రమాలకు పాల్పడిన 22 మందిపై త్వరితగతిన విచారణ చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు.
ఏసీబీ నివేదిక ఆధారంగా సత్యకుమార్ ఆదేశం
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో గతంలో పలు అక్రమాలకు పాల్పడిన 22 మందిపై త్వరితగతిన విచారణ చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. 2020 ఫిబ్రవరి లో ఈ ఆస్పత్రిలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో గుర్తించిన పలు అక్రమాలపై ఏసీబీ సమర్పించిన నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు అనుమతిచ్చినట్లు మంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అప్పటి డీసీహెచ్‌య్‌సతోపాటు తొమ్మిది మంది వైద్యులు, 12 మంది హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సుల అక్రమాలపై శీఘ్రంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఆ ఆస్పతిలో లైసెన్స్ లేకుండా క్యాంటీన్ నిర్వహణ, భోజనం అందించాల్సిన రోగుల వివరాల్ని తెలపకపోవడం, ఆహార సరఫరా నాణ్యత పట్ల నిర్లక్ష్యంతోపాటు విధి నిర్వహణలో పూర్తిగా విఫలం కావడంతో వీరిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఏసీబీ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లో మార్పు తెచ్చేందుకు మరింత పటిష్టమైన చర్యల్ని చేపట్టాలని ఆయన ఆదేశించారు.