Share News

Parakamani Case: పట్టుకున్నదెంత.. లెక్క చూపిందెంత

ABN , Publish Date - Nov 12 , 2025 | 05:07 AM

తిరుమల పరకామణిలో చోరీ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యనార్‌ నేతృత్వంలో అధికారుల బృందం తిరుపతి పద్మావతి అతిథిగృహంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 Parakamani Case: పట్టుకున్నదెంత.. లెక్క చూపిందెంత

  • పరకామణి కేసును ఎందుకంత తేలిగ్గా తీసుకున్నారు?

  • అప్పటి టీటీడీ అధికారులను విచారించిన సీఐడీ డీజీ

  • నేడు విచారణకు హాజరుకానున్న మాజీ ఈవో ధర్మారెడ్డి

తిరుపతి(నేరవిభాగం), నవంబరు 11(ఆంధ్రజ్యోతి): తిరుమల పరకామణిలో చోరీ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యనార్‌ నేతృత్వంలో అధికారుల బృందం తిరుపతి పద్మావతి అతిథిగృహంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మంగళవారం అప్పటి డిప్యూటీ ఈవో మల్లికార్జునరావు, తిరుమల కమాండ్‌ కంట్రోల్‌ యూనిట్‌ ఇన్‌చార్జి చంద్ర, ఆర్‌ఎస్ఐ సుబ్బరాజు, టీటీడీ గార్డు రామచంద్రను వేర్వేరుగా విచారించారు. ప్రధానంగా ఉద్యోగ విభాగాల్లో బాధ్యతల నిర్వహణ, డ్యూటీ నిబంధనలకు సంబంధించిన విషయంలో వాంగ్మూలాలు నమోదు చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన మేరకు.. తొలుత మల్లికార్జునరావుతో జరిగిన విచారణలో ‘పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్‌ వద్ద పట్టుకున్న విదేశీ కరెన్సీ ఎంత? అందులో డాలర్లు ఎన్ని? ఎఫ్‌ఐర్‌లో చూపించిన లెక్క ఎంత?’ అన్నదానిపై సీఐడీ డీజీ ఎక్కువగా ఆరా తీసినట్టు తెలిసింది. ‘డిప్యూటీ ఈవో హోదాలో పరకామమణిలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు.? ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.? రవికుమార్‌ను ఎందుకు తనిఖీ చేయలేద’ని ప్రశ్నల వర్షం కురిపించారు. ‘72 డాలర్లు పట్టుకుంటే 9 డాలర్ల లెక్క ఎందుకు చూపించారు? పంచనామా ఎందుకు చేయలేదు? రాజీ వెనుక పెద్దలు ఎవరు? అంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారు? నాటి అధికార పార్టీ నేతలు ఏమైనా ఒత్తిడి తెచ్చారా? డిప్యూటీ ఈవో హోదాలో బాధ్యతగా ఎందుకు వ్యవహరించలేదు’ అని డీజీ అడిగినట్టు సమాచారం. ఎవరి ద్వారా టీటీడీకి డిప్యుటేషన్‌పై వచ్చారు? ఇందులో ధర్మారెడ్డి పాత్ర ఏమైనా ఉందా?’ అని ఆరాతీశారు.


ఫుటేజీలు ఉన్నాయా? డిలీట్‌ చేశారా?

‘కమాండ్‌ కంట్రోల్‌లో చోరీ డేటా పుటేజీలు ఉన్నాయా? డిలీట్‌ చేశారా? ఉన్నవి ఎవరికి స్వాధీనం చేశారు? రవికుమార్‌ను పట్టుకున్న రోజు ఆయన పక్కనున్న ఉద్యోగులు ఎవరు?’ అని సీసీ యూనిట్‌ ఇంచార్జి చంద్రను సీఐడీ డీజీ ప్రశ్నించినట్లు తెలిసింది. చోరీ చేస్తున్నట్టు సీసీ కెమెరాలో చూసి, వీజీవోకు అప్పగించానని ఆయన జవాబు ఇచ్చినట్టు సమాచారం. గార్డు వచ్చి చెప్పిన తర్వాత పట్టుకున్నామని ఆర్‌ఎస్ఐ సుబ్బరాజు చెప్పినట్టు తెలిసింది. కాగా, పరకామణి కేసులో కీలక అధికారిగా ఉన్న మాజీ ఈవో ధర్మారెడ్డి బుధవారం సీఐడీ డీజీ ముందు హాజరుకానున్నారు.

Updated Date - Nov 12 , 2025 | 05:08 AM