Share News

Scene Reconstruction: హత్య కోణంలోనే దర్యాప్తు

ABN , Publish Date - Nov 16 , 2025 | 04:35 AM

టీటీడీ మాజీ ఏవీఎ్‌సవో, జీఆర్పీ సీఐ సతీశ్‌ కుమార్‌ అనుమానాస్పద మృతిని పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సతీశ్‌ సోదరుడు హరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హత్య కేసు నమోదు చేశారు.

Scene Reconstruction: హత్య కోణంలోనే దర్యాప్తు

  • సీఐ సతీశ్‌ మరణంపై హత్య కేసు నమోదు.. జీఆర్పీ నుంచి తాడిపత్రి డివిజన్‌కు కేసు బదిలీ

  • పోలీసు, వైద్యాధికారులతో సీఐడీ డీజీ భేటీ

  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన అయ్యన్నార్‌

  • రైలు నుంచి బొమ్మలను తోసి.. ‘సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌’

  • గుంతకల్లులో మరో పోలీసు బృందం దర్యాప్తు

  • ప్రయాణికుల వివరాలు, కాల్‌ డేటా, ఫుటేజీ పరిశీలన

  • బోగీలో రక్తపు మరకలు కనిపించాయన్న సిబ్బంది

  • రేపు ఘటనా స్థలానికి వెళ్లనున్న ఫోరెన్సిక్‌ వైద్యులు

  • పత్తికొండలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

అనంతపురం/గుంతకల్లు/గుత్తి/తాడిపత్రి/తిరుపతి/పత్తికొండ, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): టీటీడీ మాజీ ఏవీఎ్‌సవో, జీఆర్పీ సీఐ సతీశ్‌ కుమార్‌ అనుమానాస్పద మృతిని పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సతీశ్‌ సోదరుడు హరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హత్య కేసు నమోదు చేశారు. శ్రీవారి పరకామణి లెక్కింపు సమయంలో జరిగిన చోరీ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సతీశ్‌ కుమార్‌ మృతిని ప్రభుత్వం, పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఐడీ డైరెక్టర్‌ జనరల్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ అనంతపురం జిల్లాలోనే మకాంవేసి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అనంతపురం రేంజ్‌ డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీశ్‌, ఇతర పోలీసు అధికారులు, రైల్వే పోలీసులు, ఫోరెన్సిక్‌ నిపుణులు, వైద్య నిపుణులతో ఆయన చర్చించారు. ఈ క్రమంలో సీఐ సతీశ్‌ మృతిపై ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. అనంతరం తాడిపత్రి సమీపంలోని ఘటనా స్థలానికి వెళ్లి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సతీశ్‌ బరువు, ఎత్తుకు సమానంగా ఉన్న రెండు బొమ్మలను వేగంగా వెళుతున్న రైలు నుంచి కిందకు తోయించి ‘సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌’కు ప్రయత్నించారు. ఈ దృశ్యాలను వీడియో తీశారు.

పోస్టుమార్టంలో ఏం గుర్తించారు?

సతీశ్‌ కుమార్‌ మృతిపై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాకు వచ్చిన సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ శనివారం అనంతపురంలోని పోలీస్‌ గెస్ట్‌ హౌస్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు వైద్య నిపుణులతో చర్చించారు. సీటీ స్కాన్‌లో, పోస్టుమార్టంలో ఏం గుర్తించారు? ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి? ఇది హత్యేనా? ప్రమాదం వల్ల జరిగిందా? అని అనేక కోణాల్లో ఆరా తీసినట్లు తెలిసింది. ఫోరెన్సిక్‌ అధికారుల బృందాన్ని, రైల్వే పోలీసులను సైతం ఆయన పిలిపించి మాట్లాడారు. అనంతరం, ఘటనా స్థలానికి చేరుకున్న సీఐడీ డీజీ, డీఐజీ, ఎస్పీ, ఏఎస్పీ రోహిత్‌కుమార్‌చౌదరి, గుంతకల్లు రైల్వే డీఎస్పీ శ్రీనివాసాచారి తదితరులు సతీశ్‌ మృతదేహం లభ్యమైన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతదేహం ఎక్కడ పడింది? రైల్వే ట్రాక్‌కు ఎంత దూరంలో పడింది? వంటి వివరాలను ఆరాతీశారు. ఈ సందర్భంగా పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయించారు.


వారే హత్య చేయించారా?

గుంతకల్లు జీఆర్పీ సీఐ సతీశ్‌ కుమార్‌ శుక్రవారం తెల్లవారుజామున గుత్తి జీఆర్పీ పరిధిలోని కోమలి రైల్వే స్టేషన్‌ సమీపంలో మృతి చెందారని జీఆర్పీ పోలీసులు తెలిపారు. పరకామణి కేసులో సాక్ష్యం చెప్పేందుకు గురువారం రాత్రి రాయలసీమ ఎక్స్‌ప్రె్‌సలో(నంబర్‌ 12794) గుంతకల్లు నుంచి తిరుపతికి బయలుదేరారని, శుక్రవారం ఉదయం కోమలి రైల్వే స్టేషన్‌ సమీపంలో కేఎం నంబరు 373/9-11 సమీపంలో అనుమానస్పద రీతిలో మృతి చెందారని తెలిపారు. సతీశ్‌ సోదరుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎ్‌స సెక్షన్‌ 103(1) కింద కేసు నమోదు చేశారని, హత్యగా భావిస్తూ.. తాడిపత్రి పోలీస్‌ సబ్‌ డివిజన్‌కు కేసును బదలాయించినట్లు తెలిపారు. మరో పోలీసు బృందం గుంతకల్లులో పర్యటించి విచారించింది. పరకామణి చోరీ కేసు నిందితులే హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. రైల్వే రిజర్వేషన్‌ చార్టును సేకరించి, ఏ-1 బోగీలో సతీశ్‌ కుమార్‌తోపాటు ప్రయాణించిన వారి జాబితాను పరిశీలించారు. రైల్వే స్టేషన్‌ సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. రాయలసీమ ఎక్స్‌ప్రె్‌సలోని ఏ1 బోగీని పరిశీలించడానికి మరో బృందం వెళ్లింది. ఆ బోగీలో సతీశ్‌ కుమార్‌పై దాడి జరిగి ఉంటే రక్త నమూనాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, సీటీ స్కాన్‌, పోస్టుమార్టమ్‌లలో సతీశ్‌ కుమార్‌ పుర్రె ఛిద్రం కావడంతోపాటు ఛాతీ ఎముకలు(రిబ్స్‌) కూడా విరిగిపోయినట్లు గుర్తించారు.


వేరే సీటు వద్ద సతీశ్‌ లగేజీ?

సతీశ్‌ ఏ1 బోగీలోని 29వ బెర్త్‌ను రిజర్వు చేసుకున్నారు. కానీ ఆయన లగేజీ బ్యాగ్‌ను 11వ సీటు వద్ద గుర్తించారు. ఘటనకు కొన్ని గంటల ముందు సతీశ్‌ తన భార్యకు ఫోన్‌ చేసినట్లు సమాచారం. ఆ రాత్రి సుమారు నాలుగు సార్లు తన భార్యకు ఫోన్‌ చేయగా... ఆమె లిఫ్ట్‌ చేయలేదని తెలుస్తోంది. దీంతో ఆయన ‘నాట్‌ ఫీలింగ్‌ కంఫర్ట్‌’ అనే సంక్షిప్త సందేశాన్ని తన భార్యకు పంపించారని ప్రచారం జరుగుతోంది.

బోగీలో రక్తపు మరకలు?

సతీశ్‌ కేసును రేణిగుంట జీఆర్పీఎఫ్‌ డీఎస్పీ హర్షిత నేతృత్వంలోనూ విచారిస్తున్నారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో సతీశ్‌ ఏ1 కోచ్‌లో ఎక్కారు. గుంతకల్లులో ఆరుగురు దిగిపోగా, సతీశ్‌తో పాటు మరో ఆరుగురు ఎక్కినట్టు తెలిసింది. 29వ నెంబరు బెర్త్‌లో సతీశ్‌ కూర్చున్నట్టు సమాచారం. దీనిపై టీటీఈ పాపారావు, లోకో పైలెట్‌ జగదీశ్‌లను విచారించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు బెడ్‌ రోలర్స్‌ను కూడా విచారిస్తున్నట్టు తెలిసింది. రైలు తిరుపతికి చేరుకోగానే ఈ కోచ్‌ను శుభ్రం చేసిన ఐదుగురు పారిశుధ్య కార్మికులు, గార్డును విచారించారు. కోచ్‌లో రక్తం మరకలున్నట్లు వారు చెప్పారని తెలిసింది. మరోవైపు సతీశ్‌ సర్వీస్‌ రివాల్వర్‌ ఎక్కడుందో ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాగా.. ఆయన అంత్యక్రియలు శనివారం కర్నూలు జిల్లా పత్తికొండలో అధికార లాంఛనాలతో జరిగాయి. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌కుమార్‌, శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర తదితరులు నివాళులర్పించారు. శ్మశాన వాటికలో రైల్వే పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలను నిర్వహించారు.

Updated Date - Nov 16 , 2025 | 04:38 AM