ఆక్రమణ చెర!
ABN , Publish Date - May 05 , 2025 | 01:32 AM
ఆయకట్టు పొలాలకు నీరందించడంతో పాటు భూగర్భజలాలను పెంపొందించడమే లక్ష్యంగా శతాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన చెరువులు, ఏరులు ఆక్రమణలతో నానాటికీ విస్తీర్ణం తగ్గిపోతున్నాయి. అక్రమార్కుల కబ్జాలతో అస్తిత్వాన్ని కోల్పోతూ మెట్ట ప్రాంత రైతులకు మళ్లీ డ్రాట్ ఏరియా(నీటి కరువు) మూలంగా బోర్లు వేసుకునేందుకు కూడా నిషేధం విధించే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత ప్రభుత్వ హయాంలో పూడ్చి వేసిన చెరువులు, ఏరులు(రామిలేరు, బుడమేరు)ల్లో దర్జాగా ఉద్యాన పంటలు(ఆయిల్‌పామ్, చెరకు) సాగు చేస్తున్నారు. దీనిపై సర్వత్రా రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- దర్జాగా చెరువులు, ఏరులు కబ్జా!
- వాటిలో ఉద్యాన పంటల సాగు
- నీటి నిల్వలు లేక పడిపోతున్న భూగర్భ జలాలు
- మళ్లీ బోర్లపై రానున్న నిషేధం!
- పట్టించుకోని అధికారులు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
ఆయకట్టు పొలాలకు నీరందించడంతో పాటు భూగర్భజలాలను పెంపొందించడమే లక్ష్యంగా శతాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన చెరువులు, ఏరులు ఆక్రమణలతో నానాటికీ విస్తీర్ణం తగ్గిపోతున్నాయి. అక్రమార్కుల కబ్జాలతో అస్తిత్వాన్ని కోల్పోతూ మెట్ట ప్రాంత రైతులకు మళ్లీ డ్రాట్ ఏరియా(నీటి కరువు) మూలంగా బోర్లు వేసుకునేందుకు కూడా నిషేధం విధించే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత ప్రభుత్వ హయాంలో పూడ్చి వేసిన చెరువులు, ఏరులు(రామిలేరు, బుడమేరు)ల్లో దర్జాగా ఉద్యాన పంటలు(ఆయిల్‌పామ్, చెరకు) సాగు చేస్తున్నారు. దీనిపై సర్వత్రా రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, హనుమాన్‌జంక్షన్ రూరల్):
బాపులపాడు మండలంలో కొత్తపల్లి, బిళ్లనపల్లి, మడిచర్ల, తదితర మెట్ట ప్రాంతాల్లోని చెరువులతో పాటు అధిక వర్షం పడితే పొలాలు ముంపునకు గురవకుండా వరదనీటిని తరలించే రామిలేరు ఆక్రమణకు గురైంది.
- కొత్తపల్లిలో 14 ఎకరాల చెరువులో సుమారు నాలుగు ఎకరాలు కొందరు ఆక్రమించి ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. చెరువును ఆనుకుని ఉన్న స్వంత భూమి పట్టాదారు పాసుపుస్తకాల సహాయంతో ఈ భూమిని కూడా కలుపుకున్నారు. దీనిపై తహసీల్దార్ మురళీకృష్ణ పంచాయితీ అధికారులకు నోటీసులు జారీ చేసినా ఫలితం శూన్యం.
- బిళ్లనపల్లి గ్రామంలో సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలోని గద్దె గౌరమ్మ కుంట చెరువు, 12.21 ఎకరాల్లోని జగన్‌మోహిని చెరువు, 12.51 ఎకరాల్లోని వినాయక చెరువు ఆక్రమించి గత ప్రభుత్వ హయాంలో మట్టితోలి చెరుకు లాంటి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. మూడు చెరువుల్లో సుమారు 12 ఎకరాలకుపైగా జరిగిన ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే అధికారులు కరువయ్యారు.
- రామిలేరులో పల్లెర్లమూడి- శోభనాపురం మధ్యలో సుమారు ఎకరం పైగా ఆక్రమించి ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. గతేడాది ఇదే రామిలేరు వరద ఉధృతికి వేలాది ఎకరాలు నీట మునగడంతో పాటు జాతీయ రహదారిపై బొమ్ములూరు వద్ద మూడు అడుగుల మేర నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
- బుడమేరు ఆక్రమణల వల్ల రంగయ్యప్పారావుపేట, ఓగిరాల గ్రామాలు రోజులు పాటు నీటమునిగి ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు. ఆరుగొలను, తిప్పనగుంట, కానుమోలు తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల వరి పంట నీటమునిగిపోయింది.
తూతూమంత్రంగా చర్యలు
చెరువులు, ఏరులు భారీగా ఆక్రమణలకు గురైనా అధికారులు మాత్రం కన్నెత్తి చూడకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెరువులు ఆక్రమణలకు గురైనట్లు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా ఆక్రమణదారులకు, పంచాయతీ వారికి నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అరకొర పూడిత తీతతో సమస్య మళ్లీ మొదలు..
ఆక్రమణలకు గురైన చెరువుల చెర విడిపించేందుకు ఒక శాఖపై, మరొక శాఖ అధికారులు వంతులు వేసుకుని నిర్లక్ష్యం చేయడం వల్ల అక్రమార్కులకు మరింత ఊతమిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా అరకొర పనులతో చెరువులకు మేలు జరగడంలేదని, కనీసం ఒక అడుగు మేర కూడా పూడిక తీయట్లేదని కానుమోలు గ్రామానికి చెందిన రైతులు తెలిపారు. పూడికతీసిన మట్టిని చెరువు కట్టపై పోసి వదిలివేయడంతో వర్షాకాలంలో మట్టి కరిగి చెరువులోకి కారిపోయి ఎప్పటిలా మెరక తేలిపోతుందంటున్నారు.
డ్రాట్ ఏరియా నుంచి మళ్లీ నిషేధం దిశగా..
కొత్తపల్లి, బిళ్లనపల్లి, మడిచర్ల, శోభనాపురం, తదితర మెట్ట ప్రాంత గ్రామాల్లో గతంలో భూగర్భజలాలు అందుబాటులో లేని కారణంగా డ్రాట్ ఏరియా(బోర్లు వేయడంపై నిషేధం)గా పరిగణించారు. గత టీడీపీ ప్రభుత్వ హయంలో నిర్మించిన చెక్‌డ్యాంలు, పంట కుంటలువల్ల భారీ వర్షాలకు నీటితో నిండి భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. దీనితో రెండు సంవత్సరాల క్రితం నిషేధం ఎత్తివేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకుని, చెరువులు, ఏరుల్లోని ఆక్రమణలు తొలగించకపోతే నీటి నిలువ సామర్థ్యం తగ్గి భూగర్భ జలాలు మళ్లీ అడుగంటే ప్రమాదం పొంచి ఉంది. ఇదే జరిగితే మళ్లీ బోర్లపై నిషేధం విధిస్తూ డ్రాట్ ఏరియాలోకి వెళ్లే ప్రమాదముంది.
శాఖల సమన్వయంతో ఆక్రమణలను కట్టడి చేయాలి
రెవెన్యూ, జలవనరులశాఖలతో పాటు పంచాయతీ విభాగం కూడా సమన్వయం చేసుకుంటూ ఆక్రమణలు తొలగించడంతో పాటు పూడికతీత పనులను మూడు అడుగుల మేర తీయాలని రైతులు కోరుతున్నారు. దీని వల్ల భూగర్భజలాలు అందుబాటులోకి రావడంతో పాటు కాలువ కింద ప్రాంతాల్లో ముంపు ప్రమాదం నుంచి వేలాది ఎకరాలను రక్షించవచ్చు.
సరిహద్దులు ఏర్పాటు చేస్తే మేలు
శాఖల సమన్యయంతోఆక్రమణలకు గురైన చెరువులను గుర్తించి పూడికతీసి మట్టిని తరలించడంతో పాటు సరిహద్దులను ఏర్పాటు చేస్తే పూర్తి నిల్వ సామర్థ్యం పెరిగి రైతులకు ఉపకరిస్తుందని బిళ్లనపల్లి రైతులు గోపి, వెంకటేశ్వరరావు, కొత్తపల్లి రైతు షేక్ బాషా చెబుతున్నారు. ప్రతి రెండు లేదా మూడు నెలలకు అధికారులు, చెరువు సంఘాల నాయకులు, ఆయుకట్టు రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం వల్ల చెరువులు, ఏరుల ఆక్రమణను కట్టడి చేస్తూ రక్షణ చర్యలపై చర్చించవచ్చునని పేర్కొన్నారు.