Share News

MBPC course: రెండు రూపాల్లో ఎంబైపీసీ

ABN , Publish Date - Jun 05 , 2025 | 06:14 AM

ఇంటర్‌ తర్వాత ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ రెండిటిలో దేనినైనా ఎంపిక చేసుకునే వెసులుబాటును ఎంబైపీసీ కల్పిస్తుంది. అయితే ఎంబైపీసీ అని చెబుతున్నా సాంకేతికంగా ఎంబైపీసీ పేరుతో గ్రూపు ఉండదని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేస్తోంది.

MBPC course: రెండు రూపాల్లో ఎంబైపీసీ

ఎలక్టివ్‌ సబ్జెక్టు లేదా అదనపు సబ్జెక్టు

అదనపు సబ్జెక్టు పాసైతే అదనపు మార్క్సు షీట్‌

ఎలక్టివ్‌లో అన్నీ ఉత్తీర్ణత సాధించాలి

‘అదనం’లో ఫెయిలైనా ఇంటర్‌ సర్టిఫికెట్‌ ఆగదు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఇంటర్మీడియట్‌లో కొత్తగా తీసుకొచ్చిన ఎంబైపీసీ కోర్సును విద్యార్థులు రెండు రూపాల్లో చదవొచ్చు. ఈ ఏడాది ఎంపీసీ, బైపీసీని కలిపి ఎంబైపీసీని తీసుకొచ్చారు. ఇంటర్‌ తర్వాత ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ రెండిటిలో దేనినైనా ఎంపిక చేసుకునే వెసులుబాటును ఎంబైపీసీ కల్పిస్తుంది. అయితే ఎంబైపీసీ అని చెబుతున్నా సాంకేతికంగా ఎంబైపీసీ పేరుతో గ్రూపు ఉండదని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేస్తోంది. సాంకేతికంగా ఎంబైపీసీ పేరు లేకపోయినా ఎంబైపీసీ చదివే అవకాశం మాత్రం కల్పించింది. ఈ ఏడాది నుంచి ఎంపీసీ, బైపీసీల్లోనూ ఐదు సబ్జెక్టులే ఉంటాయి. వాటిలో ఒకటి ఎలక్టివ్‌ సబ్జెక్టుగా ఉంటుంది. అంటే విద్యార్థులు కచ్చితంగా ఏదొక సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలి. ఈ క్రమంలో రెండు రూపాల్లో ఎంబైపీసీ చదవొచ్చు.

అదనపు సబ్జెక్టు పాసైతే అదనపు సర్టిఫికెట్‌

ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులందరికీ ఫిజిక్స్‌, కెమిస్ర్టీ సబ్జెక్టులుంటాయి. ఎంపీసీ విద్యార్థులకు గణితం, ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, ఇంగ్లీష్‌ తప్పనిసరి సబ్జెక్టులుగా ఉంటాయి. ఒకటి ఎలక్టివ్‌ సబ్జెక్టుగా ఉంటుంది. విద్యార్థులు భాషా, కోర్‌లో అందుబాటులో ఉన్న 24 సబ్జెక్టుల్లో ఏదో ఒక దానిని ఎలక్టివ్‌గా తీసుకోవచ్చు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని ఎలక్టివ్‌గా తీసుకుంటే అది ఎంబైపీసీ అవుతుంది. కానీ సర్టిఫికెట్‌ మాత్రం ఎంపీసీ పేరుతోనే వస్తుంది. అందులో బయాలజీ ఉంది కాబట్టి కావాలంటే మెడిసిన్‌ చదవొచ్చు. ఈ విధానంలో విద్యార్థి బయాలజీ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. అదే బైపీసీ గ్రూపు తీసుకుంటే గణితం ఎలక్టివ్‌గా తీసుకోవచ్చు. అప్పుడు బైపీసీ సర్టిఫికెట్‌ జారీ అయినా కావాలంటే ఇంజనీరింగ్‌ వైపు వెళ్లొచ్చు. ఎలక్టివ్‌ సబ్జెక్టుగా భాషా, ఇతర సబ్జెక్టులు తీసుకుంటే ఎంబైపీసీకి మరో అవకాశం ఉంటుంది. ఐదు సబ్జెక్టులకు అదనంగా ఆరో సబ్జెక్టు కావాలంటే అదనంగా తీసుకుని చదవొచ్చు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితంను అదనపు సబ్జెక్టుగా తీసుకోవచ్చు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీ సబ్జెక్టు ఉత్తీర్ణత సాధిస్తే అదనపు మార్కుల మెమో ఇస్తారు. బైపీసీ విద్యార్థులు గణితం పాసైతే కూడా అదనపు మెమో జారీచేస్తారు. అదనపు సబ్జెక్టులో ఫెయిల్‌ అయినా ఇంటర్‌ సర్టిఫికెట్‌ జారీ ఆగదు. ఇంటర్‌ పూర్తికి మొదటి ఐదు సబ్జెక్టులే ప్రామాణికం. అదనపు సబ్జెక్టు మార్కులు మొత్తం మార్కుల్లో కలపరు. విడిగా చూపిస్తారు. అదనపు మెమోతో విద్యార్థులు మెడిసిన్‌, ఇంజనీరింగ్‌లలో ఏదైనా చదవొచ్చు. కాగా, సాంకేతికంగా ఎంబైపీసీ గ్రూపు లేనందున కాలేజీలు ఆ గ్రూపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. దీనిపై తాజాగా ఒక వివరణ జారీచేసింది. అదనపు సబ్జెక్టు కింద బయాలజీ, గణితం తీసుకునే విద్యార్థులు కావాలనుకుంటే నిర్దేశిత సమయం కంటే ముందు దాన్ని వదిలేయవచ్చని తెలిపింది. అదనపు సబ్జెక్టు ఉత్తీర్ణత తప్పనిసరి కాదని, ఎలక్టివ్‌ సబ్జెక్టు మాత్రం కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలని స్పష్టం చేసింది.

Updated Date - Jun 05 , 2025 | 06:14 AM