జనజీవన స్రవంతిలోకి..
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:53 AM
విద్యార్థి దశలో మావోయిజం వారి మనస్సుల్లోకి ప్రవేశించింది. ఒకే జిల్లా నుంచి వేర్వేరుగా అరణ్యంలోకి అడుగుపెట్టినా యాదృచ్ఛికంగా కలిశారు. పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అగ్రనేతలకు అనుచరులుగా ఉంటూ దళంలో అంచెలంచెలుగా ఎదిగారు. ఆపరేషన్ కగార్‌తో కంగారు పడిన ఆ దంపతులు పోలీసులకు లొంగిపోయారు. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన జోరిగె నాగరాజు, గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన జ్యోతీశ్వరి జీవిత నేపథ్యం ఇది. ఇద్దరూ కృష్ణాజిల్లాకు చెందిన వారే అయినా ఇప్పుడు ఆయా గ్రామాల్లో వారికి సంబంధించిన బంధువులు ఎవరూ లేరు.
-‘కృష్ణా’లో పెరిగారు... దండకారణ్యంలో ఎదిగారు!
- డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
- అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో త్రుటిలో తప్పించుకున్న నాగరాజు, జ్యోతీశ్వరి
- ఇద్దరూ కృష్ణాజిల్లా వాసులే..
విద్యార్థి దశలో మావోయిజం వారి మనస్సుల్లోకి ప్రవేశించింది. ఒకే జిల్లా నుంచి వేర్వేరుగా అరణ్యంలోకి అడుగుపెట్టినా యాదృచ్ఛికంగా కలిశారు. పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అగ్రనేతలకు అనుచరులుగా ఉంటూ దళంలో అంచెలంచెలుగా ఎదిగారు. ఆపరేషన్ కగార్‌తో కంగారు పడిన ఆ దంపతులు పోలీసులకు లొంగిపోయారు. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన జోరిగె నాగరాజు, గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన జ్యోతీశ్వరి జీవిత నేపథ్యం ఇది. ఇద్దరూ కృష్ణాజిల్లాకు చెందిన వారే అయినా ఇప్పుడు ఆయా గ్రామాల్లో వారికి సంబంధించిన బంధువులు ఎవరూ లేరు.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ)
జోరిగె నాగరాజు 1971లో జన్మించారు. పెనమలూరు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత గొల్లపూడిలో ఐటీఐలో చేరారు. ఐటీఐలో సివిల్ చేస్తుండగా మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యారు. 1991లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో చేరారు. ఐటీఐ తర్వాత నాగరాజు అడుగులన్నీ అడవుల వైపు పడ్డాయి. 1993లో మావోయిస్టు పార్టీలో సభ్యుడిగా చేరిన ఆయన అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌కు అనుచరుడిగా మారారు. ఆయనకు సహాయకుడిగా, కొరియర్‌గా వ్యవహరించేవారు. హరగోపాల్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన శిష్యుడిగా ముద్రవేయించుకున్నారు. తర్వాత రీజనల్ కమిటీ సెక్రటరీగా పనిచేసిన మస్తాన్‌రావు నేతృత్వంలో పనిచేశారు. ఈ ఇద్దరి వద్ద పనిచేసిన అనుభవంతో 1998లో దళంలో ఏరియా కమిటీ సభ్యుడిగా ఎదిగారు. గుంటూరు డివిజనల్ కమిటీ పరిధిలో ఉండే దాచేపల్లి, బొల్లపల్లి దళాల్లో పనిచేశారు. 2002లో నాగరాజు డివిజనల్ కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది గుత్తికొండ ఏరియా కమిటీ, గుంటూరు డివిజనల్ కమిటీకి ఇన్‌చార్జిగా వ్యవహరించారు. 2005లో కృష్ణపట్టి దళం డివిజనల్ కమిటీ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. 1997లో మావోయిస్టు పార్టీ అప్పటికే దళంలో చేరిన జ్యోతీశ్వరితో నాగరాజుకు వివాహం చేసింది. అప్పటికి జ్యోతీశ్వరి గుంటూరు డివిజనల్ కమిటీ పరిధిలోని చంద్రవంక దళ సభ్యురాలిగా పనిచేస్తుంది. 2006లో మావోయిస్టు పార్టీ నాగరాజును దండకారణ్యానికి బదిలీ చేసింది. 2014 వరకు తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత సౌత జోనల్ కమిటీ సభ్యుడిగా పదోన్నతిపై ఉత్తర బస్తర్‌కు బదిలీ అయ్యారు. 2014 నుంచి 2019 వరకు ఉత్తర బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్‌చార్జిగా పనిచేశారు. ఆ తర్వాత నాగరాజుకు పార్టీ తిరిగి ఉత్తర బస్తర్ డివిజనల్ కమిటీ బాఽధ్యతలు అప్పగించింది. 2019 నుంచి ఇప్పటి వరకు తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్‌చార్జిగా వ్యవహరించారు. మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన తర్వాత నాగరాజు పేరు ఒక్కో డివిజన్‌లో ఒక్కో విధంగా మారింది. ఆర్‌కే, విష్ణు, కమలేష్ పేర్లతో నాగరాజు దళంలో నాయకుడిగా ఎదిగారు. నాగరాజుపై ప్రభుత్వం రూ.20లక్షల రివార్డును ప్రకటించింది.
ఇదీ జ్యోతీశ్వరి నేపథ్యం..
నాగరాజు సతీమణి పేరు మేడక జ్యోతీశ్వరి. కృష్ణాజిల్లా గూడూరు మండలం కప్పలదొడ్డికి చెందిన ఆమె చేనేత కుటుంబంలో జన్మించారు. ఆమెకు ఇద్దరు అక్కలు, అన్నయ్య ఉన్నారు. ఈమె పదో తరగతి వరకు పెడనలోని జిల్లాపరిషత పాఠశాలలో చదువుకున్నారు. 1997లో జ్యోతీశ్వరి ఇంటి నుంచి వెళ్లిపోయారు. తర్వాత మావోయిస్టు దళంలో చేరారు. అగ్ర నేతలు జ్యోతీశ్వరికి నాగరాజుతో వివాహం చేశారు. ఒకరికొకరు సంబంధం లేకుండా దళంలోకి వెళ్లి అక్కడే ఒక్కటయ్యారు. ఈమె దళంలోకి వెళ్లే సరికే నాగరాజుకు హరగోపాల్ అనుచరుడిగా ముద్రపడింది. నాగరాజు గుంటూరు డివిజనల్ కమిటీలో ఉన్నప్పుడు జ్యోతీశ్వరి దాచేపల్లి, బెల్లంకొండ దళాల్లో పనిచేశారు. నాగరాజును వివాహం చేసుకున్న తర్వాత కృష్ణపట్టి ఏరియా కమిటీ, రాచకొండ దళంలో పనిచేశారు. 2001లో ఏరియా కమిటీ సభ్యురాలిగా జ్యోతీశ్వరి పదోన్నతి పొందారు. నల్లగొండ డివిజనల్ కమిటీ పరిధిలో ఉన్న రాచకొండ, కృష్ణపట్టి దళాల్లో ఆమె పనిచేశారు. 2006లో డివిజనల్ కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొంది 2007లో బస్తర్ ప్రాంతానికి బదిలీ అయ్యారు. 2008లో తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీ మహిళా విభాగం ఇన్‌చార్జి బాధ్యతలను చేపట్టారు. తర్వాత 2011లో కేశకల్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పార్టీ ఆమెను నియమించింది. 2014లో ఉవే, కిస్కోడ్ సబ్ డివిజనల్ కమిటీకి ఇన్‌చార్జిగా వ్యవహరించారు. దళంలో సభ్యులకు రాజకీయ అంశాలపై అవగాహన కల్పించే మొబైల్ అకడమిక్ పొలికల్ ఆర్గనైజేషన్ స్కూల్ (ఎంఏపీవోఎస్) పాఠాలను బోధించారు. జ్యోతీశ్వరిపై ప్రభుత్వం రూ.5లక్షల రివార్డును ప్రకటించింది. దళంలో జ్యోతీశ్వరికి అరుణ, సరిత, మాలతి, తరుణ అనే పేర్లు ఉన్నాయి.
అబూజ్‌మడ్ భారీ ఎన్‌కౌంటర్‌లో
చనిపోయారని ప్రచారం
గడచిన ఏడాది అక్టోబరు నెలలో అబూజ్‌మడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టు పార్టీకి అగ్రనేతలుగా ఉన్న వాళ్లను ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నాగరాజు, అరుణ చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. వారిద్దరూ చనిపోయినట్టు పలు చానళ్లు ప్రసారం చేశాయి. కానీ అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో నాగరాజును కాపాడే క్రమంలోనే 31 మంది దళం సభ్యులు ప్రాణాలు కోల్పోయినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. భద్రతా బలగాలు కాల్పులు జరుపుతుండగా అతడికి తూటాలు తగలకుండా ఈ దళ సభ్యులు అడ్డుగా నిలబడటంతో వారు చనిపోయారు. అక్కడి నుంచి నాగరాజు దండకారణ్యంలోకి పారిపోయాడు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి సమీపంలోనే అతడి భార్య అరుణ ఉంది. ఇద్దరూ కలిసి త్రుటిలో తప్పించుకుని దండకారణ్యంలో తలదాచుకున్నారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఈ ఇద్దరు జనజీవన స్రవంతిలో వచ్చారు.