Kadiri Rural Police: అడవిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:11 AM
శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం చెక్కవారిపల్లి సమీప అటవీ ప్రాంతంలో ఆవాసముంటున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
‘వల’పన్ని.. డ్రోన్ల సాయంతో పట్టుకున్న పోలీసులు
మారణాయుధాలు, బంగారం, నగదు స్వాధీనం
అత్యాచారాలు, దోపిడీలు, హత్య కేసుల్లో నిందితులు
నిందితులంతా నంద్యాల జిల్లాకు చెందినవారే
శ్రీసత్యసాయి జిల్లా అటవీ ప్రాంతంలో ఆర్నెల్లుగా ఆవాసం
తనకల్లు, నంద్యాల, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం చెక్కవారిపల్లి సమీప అటవీ ప్రాంతంలో ఆవాసముంటున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఇందుకోసం ‘వల’పన్ని.. డ్రోన్లు సైతం ఉపయోగించి పట్టుకున్నారు. నంద్యాల జిల్లా పాణ్యంలోని చెంచు కాలనీకి(ఇందిరమ్మ కాలనీ) చెందిన వీరు.. వివిధ నేరాలకు పాల్పడ్డారని, దోపిడీ దొంగలని పోలీసులు గుర్తించారు. బొగ్గులు కాల్చే పేరిట అటవీ ప్రాంతంలో స్థావరం ఏర్పరుచుకున్నారని నిర్ధారించారు. వీరిలో ఇద్దరు జీవిత ఖైదీలు కూడా ఉండడం గమనార్హం. వివరాలివీ.. తనకల్లు మండలం చెక్కవారిపల్లి సమీపంలోని తెల్ల గరుగుగుట్టపై ఏడు కుటుంబాలు ఆరునెలలుగా ఉంటున్నాయి. ఈ ముఠా కుటుంబాల్లో పలువురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. బొగ్గులు కాల్చుకుంటూ ఉపాధి పొందుతున్నట్లు స్థానికులు భావించారు. ఈ క్రమంలో చెంచుగాడు అనే ఈ ముఠా సభ్యుడొకరు ఇటీవల పాణ్యం పోలీసులకు చిక్కాడు. అతడిచ్చిన సమాచారంతో ఈ ముఠా గుట్టు బయట పడింది. చెంచుగాడిని వెంటబెట్టుకుని నాలుగు రోజుల క్రితం పాణ్యం పోలీసులు కదిరికి వచ్చారు. దొంగల స్థావరాన్ని కనిపెట్టేందుకు డ్రోన్ల సాయం తీసుకున్నారు. కదిరి రూరల్ సీఐ నాగేంద్ర ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్‌ఐలు, 70మంది పోలీసులు, 50మంది స్థానిక యువకులు ఆదివారం రాత్రి వలలు తీసుకుని అటవీ ప్రాంతానికి వెళ్లారు. సోమవారం తెల్లువారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించి.. ఏడుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. మారణాయుధాలు, నగదు, కొంత బంగారం స్వాధీనం చేసుకున్నారు.
కరడుగట్టిన ముఠా..
నిందితులు పల్నాడు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో కూడా పలు నేరాలకు పాల్పడి అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసు రికార్డుల్లో నమోదయ్యారు. పెద్ద ఎత్తున దారి దోపిడీలు, దొంగతనాలు చేశారని, అత్యాచారాలు, హత్యలకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఇటీవల ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రెండు జంటలపై దాడిచేసి హత్య చేశారనే ఆరోపణలున్నాయి. ఒక్కొక్కరిపై 20 నుంచి 30 కేసులు నమోదైనట్లు సమాచారం. వీరిలో ఇద్దరు జీవిత ఖైదీలు ఉండగా, ఒకరు గుంటూరు జైలు నుంచి పారిపోయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
పది తులాల బంగారం స్వాధీనం
దొంగల ముఠాను పోలీసులు అడవిలో పట్టుకున్నారని తెలియగానే సమీప గ్రామాల ప్రజలు, విలేకరులు ఆ ప్రాంతానికి వెళ్లారు. పోలీసులు ఎవరినీ అటవీ ప్రాంతంలోనికి రానివ్వలేదు. దొంగల స్థావరంలో మారణాయుధాలతోపాటు ఒక సంచి నిండా నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వదంతులు వ్యాపించాయి. నిందితులను పోలీసు వాహనాల్లో కదిరికి తరలించారు. అనంతరం సున్నపుగుట్ట తండా వద్దకు తీసుకెళ్లి విచారించారు. అక్కడి నుంచి రాయచోటి మార్గంలో పాణ్యంకు తరలించారు. పాణ్యం పోలీసులకు సహకరించి, వివిధ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్నామని కదిరి రూరల్ సీఐ నాగేంద్ర తెలిపారు. వారిని పాణ్యం పోలీసులకు అప్పగించామన్నారు. నిందితుల వద్ద పది తులాల బంగారం లభించిందని తెలిపారు.